రాష్ట్రీయం

‘నీట్’గా తెగ్గొట్టారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 18: ఎంతో కష్టపడి నీట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కౌనె్సలింగ్‌లో తీరని అన్యాయం జరుగుతోంది. కౌనె్సలింగ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మెడికల్ కళాశాలలు, దేశంలోని సుమారు 27 మెడికల్ కళాశాలలు కౌనె్సలింగ్ వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. కేవలం మెడికల్ కౌన్సిల్ కమిటీ నిర్లక్ష్యం వలన భారతదేశ స్థాయిలో 15000 లోపు ర్యాంకులు సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 600 మంది విద్యార్థులు అన్యాయంగా సీట్లు పొందలేని పరిస్థితి చోటు చేసుకుంది. ఏపీలో నీట్ అభ్యర్థుల దయనీయ స్థితిని ఆదివారం విశాఖ ఎంపీ హరిబాబు దృష్టికి తీసుకెళ్లడం, ఆయన వెంటనే కేంద్ర మంత్రి నడ్డాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అఖిల భారత స్థాయిలో జరుగుతున్న తొలి కౌనె్సలింగ్ మంగళవారంతో ముగియనుంది. సోమవారం కూడా ఈ ప్రముఖ కళాశాలలు వెబ్‌లో కనిపించకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మరింత అధికమైంది. విశాఖకు చెందిన నీట్ అభ్యర్థుల తల్లిదండ్రులు తెలంగాణలోని ఓ మెడికల్ కళాశాల వైస్ ఛాన్సలర్‌తో సోమవారం మాట్లాడితే, రెండో కౌనె్సలింగ్‌లో చూద్దాంలెండి అంటూ సమాధానం చెప్పడంతో వీరు మరింత ఆందోళనకు గురవుతున్నారు. మెడికల్ కౌనె్సలింగ్ అంతా కుంభకోణంగా మారిందంటూ వారు ఆరోపిస్తున్నారు. నీట్ అభ్యర్థుల దయనీయ పరిస్థితిపై పూర్తి స్థాయి కథనం ఇది.
మెడిసిన్‌లో సీటు సంపాదించాలంటే, నీట్ పరీక్ష రాయాలన్న నిబంధన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నీట్ పరీక్షకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షా 10 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 70 వేల మంది క్వాలిఫై అయ్యారు. వీరంతా మెడికల్ కౌన్సిలింగ్‌కు అర్హత సాధించినట్టే. ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1900 సీట్లు ఉన్నాయి. ఇందులో 283 సీట్లను ఆల్ ఇండియా పూల్‌కు వదిలేయాల్సి ఉంటుంది. అంటే, అఖిల భారత స్థాయిలో మంచి ర్యాంకులు సాధించుకున్న వారి కోసం ప్రతి రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో ఉన్న సీట్లను బట్టీ ఆల్ ఇండియా పూల్‌కు కొన్ని సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. తెలంగాణలో ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1100 సీట్లు ఉన్నాయి. ఇందులో 180 సీట్లను ఆల్ ఇండియా పూల్‌కు కేటాయించారు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల నుంచి ఆల్ ఇండియా పూల్‌కు 4,600 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సీట్లు భర్తీకాకపోతే, వాటిని తిరిగి ఆయా రాష్ట్రాలకు ఇచ్చేస్తారు. కానీ ఆల్ ఇండియా పూల్‌లో ఉన్న సీట్లు భర్తీకాకపోవడం అన్న ప్రసక్తే ఉండదు. ఈ సీట్ల భర్తీకి ఈనెల 13 నుంచి కౌనె్సలింగ్ మొదలైంది. 19తో కౌనె్సలింగ్ ముగియనుంది. ఈ కౌనె్సలింగ్ ప్రక్రియ అంతా డైరక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో జరుగుతుంది.
13న కౌనె్సలింగ్ ప్రారంభమైన వెంటనే అభ్యర్థులు వెబ్‌లోని లిస్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇనిస్టిట్యూషన్స్ కాలమ్‌ను ప్రెస్ చేస్తే, వెబ్ కౌనె్సలింగ్‌లో ఉన్న మెడికల్ కళాశాలల జాబితా అంతా వస్తుంది. ఇందులో దేశంలోని 27 ప్రముఖ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కనిపించడం లేదు. ఇవి ఎలా మాయం అయ్యాయన్నది ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. మన రాష్ట్రంలోని అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కళాశాల, ఒంగోలులోని రిమ్స్ వెబ్‌లో కనిపించడం లేదు. తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, ఆదిలాబాద్, నిజామాబాద్, మెహబూబ్‌నగర్, సిద్దిపేట మెడికల్ కళాశాలలు కనిపించడం లేదు. వీటితోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్‌లోని టాప్ రేటెడ్ వైద్య కళాశాలలు కనిపించడం లేదు. ఈ విషయాన్ని డైరక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడానికి అవకాశం లేకుండాపోయింది. ఈ కౌనె్సలింగ్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ఆరు హెల్ప్ లైన్‌లు ఇచ్చారు. అవి కూడా పనిచేయడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కౌనె్సలింగ్‌కు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. ఈ విషయమై విశాఖకు చెందిన పలువురు అభ్యర్థులు కాకతీయ మెడికల్ కళాశాల వీసీని సంప్రదించగా, రెండో కౌన్సిలింగ్‌లో ఈ అభ్యర్థులకు అవకాశం ఇస్తాం అంటూ సమాధానం చెప్పి, ఫోన్ పెట్టేసినట్టు తల్లిదండ్రులు చెపుతున్నారు. అఖిల భారత స్థాయిలో రెండో కౌనె్సలింగ్ జూలై 6 నుంచి మొదలవుతుంది. ఈలోగా రాష్టస్థ్రాయిలో జరిగే కౌన్సిలింగ్ ఈనెల 22 నుంచి మొదలవుతుంది. జూలై 6న జరిగే కౌన్సిలింగ్‌లో ప్రముఖ మెడికల్ కళాశాలల్లో సీట్లు సంపాదించుకుందామని, రాష్ట్రంలో జరిగే కౌనె్సలింగ్‌ను వదులుకోవాలా? ఒకవేళ జాతీయ స్థాయి కౌనె్సలింగ్‌లో సీటు రాకపోతే, రెంటికి చెడ్డ రేవడిగా మారుతామని అభ్యర్థులు అంటున్నారు. కౌనె్సలింగ్‌లో ప్రముఖ వైద్య కళాశాలలు ఏవిధంగా మాయమయ్యాయి? దీని వెనుక ఎవరి పొరపాటు ఉందన్నది ఇంకా తేలాల్సి ఉంది. నీట్‌లో మెరిట్ సాధించిన విద్యార్థుల్లో ఏపీ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. కౌనె్సలింగ్ పొరపాట్ల వలన వీరి భవిష్యత్తు నాశనం అవబోతోంది. కనీసం కౌన్సిలింగ్ చివరి రోజైన మంగళవారమైనా కళాశాలల జాబితా కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు అభ్యర్థిస్తున్నారు.