రాష్ట్రీయం

ఆగిపోయన ప్రేమ జంట పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 20: గడిచిన మూడు సంవత్సరాల నుండి పరస్పరం ఇష్టపడుతున్న ఓ ప్రేమ జంట.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా, చివరి క్షణంలో అమ్మాయి తరఫు బంధువులు, కుటుంబీకులు అకస్మాత్తుగా చేరుకుని దాడి చేయడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. స్థానికుల సమక్షంలోనే అమ్మాయి బంధువులు ప్రేమ జంటపై విరుచుకుపడి, అమ్మాయిని బలవంతంగా తమ వెంట ఎత్తుకెళ్లిపోయారు. సినిమా సన్నివేశాలను తలపించిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఉదంతంతో ప్రేమజంట వివాహానికి వేదికగా ఎంచుకున్న ఆర్యసమాజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంఘటన వివరాలిలా ఉన్నాయి. మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సౌజన్య (21), రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామస్థుడైన ప్రణదీప్ (22)లు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో గత మూడేళ్ల క్రితం చేరారు. ఈ సందర్భంగా వారి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. పరస్పరం ప్రేమించుకుంటూ మూడేళ్లు గడుస్తున్న సందర్భంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, వారి పెళ్లికి అమ్మాయి తరఫు కుటుంబీకులు అంగీకరించే పరిస్థితి లేకపోవడంతో ప్రేమ పెళ్లి చేసుకోవాలని భావించారు. ప్రణదీప్ విషయాన్ని స్నేహితులకు తెలపగా, నిజామాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి జరిపించేందుకు దోస్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇద్దరూ మేజర్‌లు కావడం, పరస్పరం పెళ్లికి అంగీకరించడంతో ఆర్యసమాజ్ వారు కూడా వివాహానికి సమ్మతి తెలిపారు. ఈ మేరకు ప్రణదీప్, సౌజన్యలు బుధవారం తమ స్నేహితులతో కలిసి గుట్టుగా ఆర్యసమాజ్ వద్దకు చేరుకున్నారు. తలకు బాసింగాలు కట్టుకుని, పెళ్లి పీటల మీద కూర్చున్నారు. మరికొద్ది నిమిషాల్లో ప్రణదీప్ మూడు ముళ్లు వేసే సమయానికి, విషయం తెలుసుకున్న సౌజన్య కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆర్యసమాజ్ వద్దకు చేరుకుని ప్రేమ జంట పెళ్లిని అడ్డుకున్నారు. సౌజన్యను తమ వెంట రావాల్సిందిగా కోరగా, ఆమె ససేమిరా అనడంతో ఆగ్రహించిన కుటుంబీకులు అందరి సమక్షంలోనే ఆమెపై చేయి చేసుకున్నారు. ఆమెను బలవంతంగా అక్కడి నుండి తీసుకెళ్తున్న క్రమంలో, వారిని నిలువరించే ప్రయత్నం చేసిన ప్రణదీప్ పైనా దాడి చేయడంతో తలకు, ఇతర శరీర భాగాలపై గాయాలయ్యాయి. ఆటోలో ఎక్కేందుకు సౌజన్య మొండికేయగా, ఆమె కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనం పైనే ఆఘమేఘాల మీద అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు. పోలీసులు తాపీగా చేరుకునే సమయానికి సౌజన్య జాడ కానరాకుండాపోయింది. ఈ హఠాత్పరిణామంతో ప్రణదీప్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. తాము ఇరువురం మేజర్‌లు అయినప్పటికీ, బలవంతంగా తమ పెళ్లిని అడ్డుకున్నారని వాపోయాడు. నిజానికి సౌజన్య కుటుంబ సభ్యులు ఆర్యసమాజ్ వద్దకు వచ్చిన వెంటనే తాము టూటౌన్ పోలీసులకు సమాచారం అందించామని, పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆక్షేపించాడు. ఈ విషయమై టూటౌన్ ఎస్‌ఐ ఆంజనేయులును వివరణ కోరగా, ప్రేమజంట పెళ్లి చేసుకునే విషయమై తమకు ముందస్తుగా సంప్రదించలేదని, ఎలాంటి రక్షణ కోరలేదని అన్నారు. ఆర్యసమాజ్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నట్టు స్థానికుల ద్వారా సమాచారం అందడంతో తాము అక్కడికి చేరుకునే సమయానికే సౌజన్యను ఆమె కుటుంబీకులు తీసుకెళ్లిపోయారని తెలిపారు. ఈ విషయమై ఇప్పటివరకు ప్రణదీప్ తమకు లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఒకవేళ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొనడం కొసమెరుపు. అయితే పోలీసులు తనకు న్యాయం చేయాల్సిందేనని, ఇప్పటికే ఈ విషయమై తాను ఫిర్యాదు చేశానని, సౌజన్యను ఆమె కుటుంబీకుల బారి నుండి కాపాడి తనతో పెళ్లి జరిపించాలని, లేనిపక్షంలో ధర్నాకు పూనుకుంటానని ప్రణదీప్ స్పష్టం చేశాడు.