రాష్ట్రీయం

భట్టి బ్యాచ్ ఢిల్లీకి ఎందుకో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మరికొంత మంది రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీకి వెళ్లడంలో ఆంతర్యం ఏమిటనే విషయంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలన్న డిమాండ్‌తోనే భట్టి నేతృత్వంలో ప్రతినిధుల బృందం న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కోరినట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది. బుధవారం భట్టితోపాటు ఎమ్మెల్యేలు డికె అరుణ, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు రాహుల్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ వారితో కొంత సేపు ముచ్చటించారు. ఆ సమయంలోనే వారు ఉత్తమ్‌పై ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ప్రారంభమైంది. పార్టీలో అందరినీ కలుపుకొని పోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా పార్టీలో తనకు సరైన గుర్తింపు రావడం లేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కూడా భట్టి బృందంతో ఢిల్లీ వెళ్ళడం చర్చనీయాంశమైంది. కాగా, భట్టి మాత్రం తాము ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
ఇలావుంటే, ఉత్తమ్‌కుమార్ బుధవారం తన జన్మదినోత్సవాన్ని గాంధీ భవన్‌లో పార్టీ కార్యకర్తల మధ్య నిర్వహించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొంత మంది నాయకులు ఢిల్లీ వెళ్ళి మీపై ఫిర్యాదు చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. తనపై ఫిర్యాదు చేసే అవకాశమే లేదని, అలా చేస్తారని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. రాహుల్‌ను కలిసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు ఢీల్లీ వెళ్ళారని ఆయన చెప్పారు. పార్టీలో నాయకుల మధ్య విభేదాలు ఏమీ లేవని, అందరమూ కలిసి పని చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు అందరం సమష్టిగా పని చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇటీవల తాను రాహుల్ గాంధీతో సమావేశమైనప్పుడు పార్టీని క్షేత్ర స్థాయి నుంచి పూర్తి స్థాయిలో బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. 30 వేలకు పైగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు 14 చొప్పున కమిటీలను నియమించి, మొత్తం నాలుగున్నర లక్షల మందితో కాంగ్రెస్ సైన్యాన్ని తయారు చేయడమే తమ ముందు ఉన్న ప్రధాన కర్తవ్యమని ఆయన తెలిపారు. అదేవిధంగా శక్తి ఆప్‌ను విస్తృత పరిచేందుకు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నామని, ఇవి పూర్తిగా రాహుల్ ఆదేశాల మేరకు జరుగుతున్నదని అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలతో సిద్ధం అవుతున్నదని ఉత్తమ్‌కుమార్ విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో జనాభా గణన చేయకుండా ఎలా ఏర్పాటు చేస్తారని, ఒక్కో దగ్గర ఒక్కో విధంగా బీసీల జనాభా వివరాలు ఉన్నాయని తెలిపారు. ఇలాఉండగా సీఎల్‌పీ నేత జానారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.