రాష్ట్రీయం

బదిలీల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: ‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా బదిలీలపై నిషేధం ఎత్తివేయకపోవడం వల్ల ఉద్యోగులు చాలా బాధపడుతున్నారు. ఏళ్ల తరబడిగా ఒకే చోట పని చేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు’ అని ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద వాపోవడం, దీనికి సానుకూలంగా స్పందించి ఆయన బదిలీలకు అవకాశం కల్పిస్తూ, ‘మీరంతా కోరడంతో బదిలీలకు వెసులుబాటు కల్పిస్తున్నాం. అయితే ఇవీ పూర్తి పారదర్శకంగా, అవినీతి, అక్రమాలకు తావు లేకుండా జరిగేందుకు సహకరిస్తామని ఉద్యోగ సంఘాలు పూచి ఇవ్వాలి’ అని హెచ్చరించడం నిన్నటి మాట. కానీ, నేడు సీఎం హామీని గాలికొదిలిన అధికారులు బదిలీలను జాతరగా మార్చేశారు. సీనియారిటీకి పాతర వేశారు. అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాల పూచీని, ముఖ్యమంత్రి హెచ్చరికను కూడా ఖాతరు చేయకుండా, దాదాపు అన్ని శాఖలలో బదిలీలు అక్రమాల జాతరను తలపిస్తున్నాయి. ఏ శాఖలోనూ పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతున్న దాఖలాలు లేవు. స్పష్టమై విధానాలకు పాతర వేసి అవినీతి, అక్రమాలు, సిఫారసులకు అన్ని శాఖలు ద్వారాలు తెరిచాయి. ఐదేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న వారిని తప్పని సరిగ్గా బదిలీ చేయాలన్న నిబంధనను సంబంధిత శాఖాధిపతులు తుంగలో తొక్కారు. తమకు ‘అన్ని’ విధాలుగా కావాల్సిన వారి కోసం బదిలీలకు అర్హులైనప్పటికీ వారి పోస్టులను కౌనె్సలింగ్‌లో చూపెట్టకుండా దాచిపెట్టిన ఉదంతాలు దాదాపు అన్ని శాఖలలో జరిగినట్టు బాధితులు సాక్ష్యాధారాలతో సహా స్పష్టం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తెచ్చుకుని కొందరు బదిలీల బారి నుంచి తప్పుకోగా, మరికొందరు ఎవరి అండదండలు లేని ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసి, వారి పోస్టులో గుట్టు చప్పుడు కాకుండా చేరిపోతున్నారు. ఇదేమి అన్యాయమని అడిగిన వారికి ఇందులో తమ ప్రమేయం లేదని అధికారులు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల సిఫారసుల లేఖలను చూపుతున్నట్టు బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తలు ఉద్యోగులైన పక్షంలో వారిని సాధ్యమైనంత వరకు ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సూచించారు. అయితే, ఒకే చోట ఉంటే భవిష్యత్‌లో పదోన్నతులు ఉండవని, తగిన కేడర్ పోస్టులు లేవనీ అనేక కుంటి సాకులు చూపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల విభజన సందర్భంగా ఏ రాష్ట్రంలో పని చేయాలనుకుంటే అక్కడనే కొనసాగేందుకు అధికారులకు వెసులుబాటు కల్పించారు. కొన్ని శాఖలలో శాఖాధిపతులుగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు కొనసాగుతున్నారు. ఉద్యమ సమయంలో చురుకుగా పని చేసిన ఉద్యోగులపై సదరు అధికారులు కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలతో పాటు ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన బదిలీలలో అవకతవకలు, అక్రమాలు, అవినీతి పరాకాష్టకు చేరుకున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలే చెబుతున్నారు. రిటైర్డు అధికారులు కొందరిని పదవీకాలం ముగిసినప్పటికీ ఎక్స్‌టెన్షన్ ఇచ్చి కొనిసాగించడంతో దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా పోస్టులకు రేట్లు పెట్టి మరి దోచుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారికి, ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులకు, భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్న వారికి బదిలీ నుంచి వెసులుబాటు కల్పించడంతో రాత్రికి రాత్రి నకిలీ పత్రాలను సృష్టించి బదిలీల నుంచి తప్పించుకున్న ఉదంతాలు జరిగాయని తెలుస్తోంది. బదిలీల నుంచి తప్పించుకోవడానికి ఉద్యోగులు కొందరు గుండె అపరేషన్లు జరిగినట్టు, కాన్సర్‌తో బాధపడుతున్నట్టు దొంగ సర్ట్ఫికేట్లను సృష్టించిన ఉదంతం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బయటపడింది. ఇప్పటికే 15 మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నప్పటికీ దాదాపు అన్ని జిల్లాల్లో, అన్ని శాఖలలో ఇదే విధమైన అక్రమాలు జరిగినట్టు సమాచారం. కొస మెరుపు ఏమిటంటే దొంగ సర్ట్ఫికేట్లు జారీ చేసిన వైద్య అధికారులకే వాటి వెరిఫికేషన్ బాధ్యతలు అప్పగించడం. కొందరు అధికారుల తప్పిదం, పై అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటునట్టు తెలంగాణ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు పద్మాచారి వ్యాఖ్యానించారు.