రాష్ట్రీయం

కడప ఉక్కు మా హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: విభజన హామీల అమలులో భాగంగా కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన బుధవారం ప్రధానికి లేఖ రాశారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు, పరిశోధన, విద్యాసంస్థలు వంటివి లేకపోవడం, తదితర కారణాల వల్ల రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోతోందని లేఖలో తెలిపారు. విభజన తరువాత మిగిలిన ఏపీకి 10 సంవత్సరాల పాటు అన్నిరకాలుగా సహాయం అందించాలని విభజన చట్టంలో పొందుపర్చారని గుర్తుచేశారు. అప్పాయింట్ డే నుంచి ఆరు నెలల్లోపు కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదికను సెయిల్ ఇవ్వాలని ఉందని, కనుక ఉక్కు కర్మాగారం ఏర్పాటు బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు. సాధ్యాసాధ్యాల పరిశీలనకు 2015 ఆగస్టులో టాస్క్ఫోర్సు ఏర్పాటు చేశారని, టాస్స్‌ఫోర్సు కమిటీ ఇప్పటివరకూ ఆరుసార్లు సమావేశమైందని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో ఒక కమిటీ గనులను, ఉక్కు కర్మాగార ప్రతిపాదిక ప్రాంతాన్ని పరిశీలించిందని గుర్తుచేశారు. మెకన్ సంస్థ గనులున్న ప్రాంతాలను సందర్శించిందని తెలిపారు. ఉక్కు మంత్రిత్వ శాఖకు మెకన్ సంస్థ తన నివేదికను ఈ ఏడాది ఫిబ్రవరిలో అందజేసిందని తెలిపారు. ఈ ఏడాది జనవరి 12న విభజన హామీల్లో భాగంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు హామీని అమలుచేయాలని వినతిపత్రం ఇచ్చామని ప్రధానికి గుర్తుచేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు
ఆర్థికంగా సాధ్యం కాదని సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిసిందని పేర్కొన్నారు. సెయిల్ ఇచ్చిన తొలి నివేదిక ఆధారంగా ఈ అఫిడవిట్‌ను కేంద్రం దాఖలు చేసినట్లు తెలుస్తోందన్నారు. ఇది రాష్ట్ర ప్రజలను, కడపవాసులను తీవ్ర భావోద్వేగాలకు గురిచేస్తోందని తెలిపారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తే వెనుకబడిన రాయలసీమ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవుతుందని వివరించారు. శాస్ర్తియత లేని విభజన వల్ల ఇప్పటికే రాష్ట్రం అనేక సమస్యల్ని ఎదుర్కొంటోందని, ఈనేపథ్యంలో మెకన్ సంస్థ ఇచ్చిన నివేదికను ఆమోదించాలని కోరారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు వీలుగా సుప్రీం కోర్టులో సవరించిన అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

పౌర విమానాలపై నియంత్రణ వద్దు
విశాఖ విమానాశ్రయంలో పౌర విమానాల రాకపోకలపై నియంత్రణ విధించవద్దని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కోరారు. గడచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, 2018 ఆర్థిక సంవత్సరంలో 4.1 మిలియన్లకు చేరుకుందని బుధవారం ఆమెకు రాసిన లేఖలో తెలిపారు. తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ డేగాలో కొంత భాగాన్ని విశాఖ విమానాశ్రయంగా వినియోగిస్తున్నామని తెలిపారు. విశాఖను అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని గుర్తుచేశారు. సింగపూర్, కొలంబో, దుబాయ్, తదితర ప్రాంతాలకు విమానాలను అక్కడ నుంచి నడుపుతున్నామని తెలిపారు. అనేక పర్యాటక కేంద్రాలకు విశాఖ విమానాశ్రయం దగ్గరని తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో విశాఖ విమానాశ్రయం కీలకమని వివరించారు. ఈ ఏడాది మేలో జరిగిన మిలిటరీ - సివిల్ సమన్వయ సమావేశంలో విశాఖ విమానాశ్రయం నుంచి పౌర విమానాల రాకపోకలపై అనేక నిబంధనలు, నియంత్రణ అమలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసిందని వెల్లడించారు. దీనివల్ల నవంబర్ నుంచి ప్రారంభమయ్యే విమానాల వింటర్ షెడ్యూల్ ప్రభావితం అవుతుందన్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ, మంగళ, గురువారాల్లో రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ మిలిటరీ విమానాల కోసం సమయం కేటాయించారని, దీనికి అదనంగా శని, ఆదివారాల్లో ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ నిర్వహణ పేరుతో విమానాలను అనుమతించరని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనివల్ల వారంలో సగటున 5 నుంచి 7 గంటల పాటు పౌర విమానాల రాకపోకలు నిలిచిపోతాయని గుర్తుచేశారు. దీని ప్రభావం పర్యాటక, ఆర్థిక రంగాలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖకు 45 కిలోమీటర్ల దూరంలోని భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని 2500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని, ఆ నిర్మాణం పూర్తయ్యేవరకూ విశాఖ విమానాశ్రయంలో పౌర విమానాల రాకపోకలపై నియంత్రణ విధించవద్దని రక్షణ మంత్రిని చంద్రబాబు కోరారు.