ఆంధ్రప్రదేశ్‌

భృంగి వాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీశైల పుణ్యక్షేత్రంలో భ్రమరాంబిక, మల్లికార్జునస్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు భృంగి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఉదయం 7.30 గంటల నుంచి చండీశ్వర పూజ, పంచవరాణార్చనలు, జపానుష్టానములు, శ్రీ స్వామివారికి విశేష అర్చనలు, అమ్మవారికి నవవరణార్చనలు, రుద్రహోమం, చండీహోమం, బలి హరణ కార్యక్రమాలను ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. సాయంత్రం నిత్య పూజలు, అనుష్టానములు, నిత్యాహవనములు, బలి హరణ సమర్పించి స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకరణ మండపంలో ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించి అర్చకస్వాములు షోడసోపచార పూజలు నిర్వహించారు. అలాగే మంగళ హారతులు ఇచ్చి మేళతాళాల నడుమ స్వామి వారిని గర్భాలయం నుంచి గ్రామోత్సవానికి తీసుకు వచ్చారు.

స్కూలు బస్సును ఢీకొన్న లారీ
డ్రైవరు, 14 మంది విద్యార్థులకు గాయాలు
జంగారెడ్డిగూడెం, మార్చి 1: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద మంగళవారం స్కూలు బస్సును లారీ వెనుక నుండి ఢీకొన్న ప్రమాదంలో 14మంది విద్యార్థులు గాయపడ్డారు. బస్సు డ్రైవరు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలావున్నాయి... జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ పాఠశాలకు చెందిన స్కూలు బస్సు బుట్టాయగూడెం మండలం రామారావుపేట జంక్షన్ నుండి జంగారెడ్డిగూడెం బయలుదేరింది. మార్గమధ్యంలో పట్టెన్నపాలెం, శ్రీనివాసపురం గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకుని కొద్దిసేపట్లో పాఠశాలకు చేరుకుంటుందనగా వెనుక నుండి లారీ ఢీకొంది. దీనితో బస్సు అదుపుతప్పి సుమారు పది అడుగులు దిగువన ఉన్న రోడ్డు మార్జిన్లోకి దూసుకుపోయి, ఒరిగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా విద్యార్థులున్నారు. వీరిలో 14 మంది గాయపడగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. బస్సు డ్రైవర్ దొండపాటి ఇశ్రాయేలుకు తీవ్రగాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వ సామాన్య వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లారు. ప్రమాదం కారణంగా బైపాస్ రోడ్డులో కొద్దిసేపు ట్రాఫిక్ స్థంభించింది.
తన్నుకున్న కౌన్సిలర్లపై టిడిపి వేటు
తెనాలి, మార్చి 1: సర్వసభ్య సమావేశ నియమ నిబంధనలకు విరుద్ధంగా కౌన్సిల్‌లో దాడులకు పాల్పడిన ఇద్దరు తెలుగుదేశంపార్టీ కౌన్సిలర్లను సభకు రాకుండా సస్పెండ్ చేసినట్లు మున్సిపల్ చైర్మన్ కొత్తమాసు తులసీదాసు పేర్కొన్నారు. మంగళవారం ఆయన చాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం జరిగిన మున్సిపల్ సమావేశంలో ప్రజాసమస్యలు పక్కనబెట్టి వ్యక్తిగత ధూషణలు, దాడులకు పాల్పడిన టిడిపికి చెందిన కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, పసుపులేటి త్రిమూర్తులను మూడు మాసాలకుపాటు సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. సభా సమయాన్ని వృధా చేయటమేగాకుండా ఇతర సభ్యులను ఇబ్బందిపెట్టే విధంగా భయబ్రాంతులకు గురిచేయటం, సభా మర్యాదలు పాటించక పోవటం, కౌన్సిల్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు ఇద్దరు కౌన్సిలర్లను సభనుండి 89 రోజల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇదిలాఉండగా సభామర్యాదలు పాటించకుండా వ్యక్తిగత దూషణలు, దాడులకు పాల్పడిన కౌన్సిలర్లపై చర్యకు పార్టీ పరంగా విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు స్థానిక శాసన సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు.
కొనసాగుతున్న ద్రోణి.. తేలికపాటి జల్లులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 1: మధ్య మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వరకూ విస్తరించిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు కర్నాటక ప్రాంతంలోని భూ ఉపరితలంపై అల్పపీడనం ద్రోణి కూడా సమాంతరంగా కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. వీటి ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పోలీసుల అదుపులో న్యూడెమోక్రసీ నక్సలైట్లు?
జంగారెడ్డిగూడెం, మార్చి 1: పశ్చిమగోదావరి జిల్లా ఏజన్సీలో నక్సల్స్ కదలికలపై ఇటీవల కూంబింగ్ చేపట్టిన స్పెషల్ పార్టీ పోలీసులు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. బుట్టాయగూడెం పోలీసు స్టేషన్ పరిధిలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న వారిలో ఆ పార్టీ అరుణోదయ రాష్ట్ర నాయకుడు రామన్న, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి సోమరాజు, పార్టీ దళ కమాండర్, అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మన్న ఉన్నట్టు తెలిసింది. అయితే తమ అదుపులో నక్సలైట్లు ఎవరూ లేరని పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా పోలీసులు శుక్రవారం తమ పార్టీ నేతలు రామన్న, సోమరాజు, ధర్మన్నలను అదుపులోకి తీసుకున్నారని, వీరిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్.ఖాజానం డిమాండ్ చేశారు. వీరిలో ధర్మన్న దళ కమాండర్ అయినప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, నిరాయుధుడని చెప్పారు. పోలీసుల వల్ల వారికి ప్రాణాపాయం ఉందని భావిస్తున్నామని, అందుకే తక్షణమే కోర్టులో హాజరుపరచాలని కోరుతున్నట్టు ఖాజానం తెలిపారు.
కడప సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మార్చి 1:కడప సెంట్రల్ జైలులో మంగళవారం ఓ ఖైదీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా మాదరాస గ్రామానికి చెందిన బి.కుమార్ (45) ఒక హత్యకేసులో జీవిత ఖైదు పడడంతో తొలుత అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమండ్రి జైలులో తోటి ఖైదీలతో గొడవపడుతూ సమస్యలు సృష్టిస్తుండటంతో 2014లో ఇక్కడికి తరలించారు. గత కొంతకాలంగా అతడు తీవ్ర అనారోగ్యం, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు సమాచారం. జైలులో ఇటుకల తయారీ పరిశ్రమలో పనిచేస్తుంటాడు. అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక భవనంలోని కొక్కీకి ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి ఖైదీలు జైలు అధికారులకు తెలియజేయడంతో వెంటనే అతడిని కడప రిమ్స్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా కడప జైలులో ఇటీవల కాలంలో ఖైదీ ఆత్మహత్య చేసుకోవడం ఇది మూడవ సంఘటన.

కేంద్రం కోరిన అంశాలపై రాష్ట్రం వివరాలు ఇవ్వలేదు
అందుకే పోలవరానికి నిధులు అందలేదు: పురంధ్రీశ్వరి
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, మార్చి 1: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కొన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరణ ఇవ్వలేదని, అందువల్లే బడ్జెట్‌లో రూ.100కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయని బిజెపి నాయకురాలు పురంధ్రీశ్వరి చెప్పారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ఏ మాత్రం శంకించాల్సిన అవసరం లేదన్నారు. విభజన సమయంలో ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనంచేసి, ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమంచేసింది ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అని చెప్పారు. విభజన సమయంలో ఆ నిర్ణయం తీసుకోకపోతే పోలవరం ప్రాజెక్టు సాధ్యమయ్యేది కాదన్నారు. కేంద్రం కోరిన వివరణలను సమర్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటుచేసిందని, అయితే రాష్ట్రప్రభుత్వం పిపిఎను విశ్వాసంలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. దీనిపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిందన్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌లో పట్టిసీమ ప్రాజెక్టు ఉందా? అని కేంద్రం వివరణ కోరిందన్నారు. కేవలం మూడేళ్ల పాటు మాత్రమే పట్టిసీమ ప్రాజెక్టు కొనసాగుతుందని అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, అందువల్ల పట్టిసీమ ప్రాజెక్టు వ్యయాన్ని పోలవరం ఖర్చులో ఎలా చేరుస్తారని కేంద్రం రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందన్నారు.

చెక్‌పోస్టులపై ఏసిబి దాడులు
గంగాధరనెల్లూరు/తడ, మార్చి 1: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల పరిధిలోని ఠాణా చెక్‌పోస్టు సమీపంలోని వాణిజ్య పన్నులశాఖ చెక్‌పోస్టుపై మంగళవారం ఉదయం ఏసిబి అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కార్యాలయంలో అదనంగా ఉన్న కొంత నగదుతో పాటు అనధికారికంగా వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. చెక్‌పోస్టువద్ద అక్రమ వసూళ్లు కొనసాగుతున్నాయన్న సమాచారంతో ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికార బృందం పక్కాప్రణాళికతో మంగళవారం తెల్లవారు జామునే ఈ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న పెనుమూరు మండలానికి చెందిన బికె జగ్గయ్య, చిత్తూరు పట్టణానికి చెందిన రాజ్‌కుమార్‌ను గుర్తించారు.కాగా చెన్నై నుండి వైజాగ్‌కు సమాచారాలను అందించే పరికరాలు లోడు తీసుకువెళ్తున్న లారీని మంగళవారం నెల్లూరు జిల్లా తడ మండలం బివి పాలెం తనిఖీ కేంద్ర అధికారులు పట్టుకొన్నారు.

బాబు వైఫల్యమే
బడ్జెట్ కేటాయంపులపై జ్యోతుల

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 1: రాష్ట్ర ప్రయోజనాలన్నిటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్ధం కోసం కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. చంద్రబాబు వైఫల్యాలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో మంగళవారం నెహ్రూ విలేఖరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను పూర్తిగా నిరాశ పరచిందన్నారు. రాష్ట్రానికి కనీస స్థాయిలో నిధులు సాధించడంలో చంద్రబాబు సహా రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం ఎంపిలు పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల పరిష్కారానికి ఏ మాత్రం నిధులు కేటాయించలేదని, ఈ విషయంలో చంద్రబాబు చేష్టలుడిగి చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రూ.1800 కోట్లు నిధులు మంజూరు చేశామని, ఆ లెక్కలు ఇంతవరకు బయటకు చెప్పలేదంటూ బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధ్రీశ్వరి ఆరోపించారని ఈ సందర్భంగా జ్యోతుల వ్యాఖ్యానించారు. పురంధ్రీశ్వరి చేసిన విమర్శలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తిచేయని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవల్సి వస్తుందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై 11 ప్రాజెక్ట్‌లు నిర్మిస్తుండగా, మరో రెండు ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. ఇదే గనుక జరిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో మొదటి పంటకు కూడా నీరు అందని ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు.