ఆంధ్రప్రదేశ్‌

మోసపోయాం .. మళ్లీ రోడ్డెక్కుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాం .. కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్‌కు నిధులకోసం మరోసారి రోడ్డెక్కి ఉద్యమబాట పట్టాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కీలక నేతలతో భేటీ అయి, నాలుగైదు రోజుల్లో ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేయనున్నట్టు ప్రకటించారు. కాపుల ఆకలి బాధలు తీర్చాలంటూ తాము చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో పాటు, కాపుల కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా తన కుటుంబం చేపట్టిన దీక్షను విరమింపచేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం తరపున మంత్రులు మధ్యవర్తిత్వం నడిపారన్నారు. కాపుల్ని బిసిలుగా గుర్తించడం, కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి రూ.1000 కోట్ల రుణాలు మంజూరు, మంజునాథ కమిషన్‌లో తాము సూచించిన ఒకరికి సభ్యత్వం ఇచ్చి, తొమ్మిది నెలల కాల వ్యవధిలో ఈ అంశాన్ని ముగించాలన్న కీలక డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి హామీ లభించిన మీదటే తాను, తన కుటుంబం దీక్ష విరమించామన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు తనతో రాయబారం నడిపిన బృందం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చే ప్రయత్నం జరగట్లేదని ఆరోపించారు. దీనిపై వివిధ వర్గాల నుంచి తనపై ఎన్నో విమర్శలు వస్తున్నాయన్నారు. అయినప్పటికీ ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకుంటారనే భావించానన్నారు. కాపు కార్పొరేషన్‌కు ఇప్పటి వరకూ 3.5 లక్షల దరఖాస్తులు అందాయని, కాపు కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.100 కోట్ల నిధులతో ఎంత మందికి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అరకొరగా పరిష్కరిస్తున్న దరఖాస్తులు సైతం అధికార పార్టీ వారికే దక్కుతున్నాయని, అర్హులైన నిరుపేద కాపులకు నిరాశ ఎదురవుతోందన్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబుది మోసపూరిత హామీగా భావించాల్సి వస్తోందన్నారు. ఇదే అంశంపై మోసపోయామని, మరోసారి రోడ్డెక్కి ఉద్యమిస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదని కాపు సోదరులు సంకేతాలిస్తున్నారన్నారు. ఇక ఉపేక్షిస్తే చంద్రబాబు ప్రభుత్వం కాపులను మరింతగా మోసం చేస్తుందన్న అనుమానంతోనే మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు ముద్రగడ ప్రకటించారు. తాము గొంతెమ్మ కోరికలు కోరట్లేదని, ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాటినే అడుగుతున్నామన్నారు. తమ ఉద్యమం ఒక పార్టీకి మేలు చేసేందుకో, మరోపార్టీని ఇరుకున పెట్టేందుకో కాదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఉద్యమ కార్యకర్తలపై పోలీసు వేధింపులు అధికమయ్యాయని, జైళ్లలో పెడతాం, ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తుని ఘటనలో చోటుచేసుకున్న సంఘటనలపై విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలని తానే చెప్పానన్నారు. అయితే ఉద్యమ ముసుగులో కొంతమంది సొంత అజెండాతో వచ్చి హింసాత్మక ఘటనలకు కారణమయ్యారన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే ఉద్యమం కూడా హింసాత్మకంగానే ఉంటుందా అన్న ప్రశ్నకు ముద్రగడ సమాధాన మిస్తూ కడుపుమండి రోడ్డెక్కినపుడు ఎటువంటి సంఘటనలైనా చోటుచేసుకుంటాయన్నారు. సమావేశంలో జిల్లా కాపునాడు నాయకుడు తోట రాజీవ్, తదితరులు పాల్గొన్నారు.