ఆంధ్రప్రదేశ్‌

హంస వాహనంపై మల్లన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. అలాగే మేళతాళాల నడుమ మంగళ హారతులు ఇచ్చి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గ్రామోత్సవానికి తీసుకెళ్లారు. గ్రామోత్సవంలో వీరభద్ర విన్యాసాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలు, లంబాడీల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గ్రామోత్సవం రథశాల వద్ద నుంచి ప్రారంభించగా శివ స్వాములు, భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు, నారికేళములు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. సుమారు 50 వేలకు మందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా. ఇకపోతే గురువారం శ్రీ పార్వతీపరమేశ్వరులు మయూర వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

హైకోర్టు జడ్జిచే
విచారణ జరిపించాలి
భూదందాపై సిపిఐ కార్యదర్శి రామకృష్ణ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 2: రాజధాని ప్రాంతంలో పెద్దఎత్తున భూకుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌తో కల్సి ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఏ నిర్మాణాలు ఎక్కడ వస్తాయో ముందే తెలుసుకుని కొందరు రాష్ట్ర, కేంద్రమంత్రులు, అధికార పార్టీ నేతలు పేదలు, రైతుల వద్ద కారుచౌకగా భూములు కాజేసి వేల కోట్లు సునాయసంగా సంపాదించేందుకు మార్గం సుగుమం చేసుకున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను బట్టి అర్థమవుతుందన్నారు. శంకుస్థాపన జరిగి ఇంకా ఒక్క ఇటుక కూడా అక్కడ పేర్చకముందే ఇటువంటి భారీ కుంభకోణాలు వెలికిచూడడం రాష్ట్రానికేగాక రాజకీయ వ్యవస్థకే అత్యంత అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే సిట్టింగ్ జడ్జిచే విచారణ చేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. దాదాపు 15 లక్షల ఎకరాల భూ బ్యాంక్ ఏర్పాటు చేసి కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. దీనిపై ఇప్పటికే రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు 13 జిల్లాల్లో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతులను చేశాయని పేర్కొంటూ, ఈ నెల 9న విజయవాడలో భూ బ్యాంక్‌కి వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు.

ఆస్తులపై చర్చకు సిద్ధం: లోకేశ్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 2: తాను అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నదంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌విరుచుకుపడ్డారు. ఆస్తులపై బహిరంగ చర్చకు తాను ఎక్కడికైనా రాగలను, జగన్ రాగలరా అంటూ సవాల్ విసిరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తనను కలసిన మీడియా ప్రతినిధులతో లోకేష్ ఛిట్‌చాట్ నిర్వహించారు. ఏడేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్న చరిత్ర తమదని, ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువ ఉంటే రాసిస్తానంటూ జగన్‌పై ఎదురుదాడికి దిగారు. వైకాపా నుంచి ఎమ్మెల్యేల వలసలపై స్పందిస్తూ తెలుగుదేశంలోకి వచ్చేవారినందరినీ చేర్చుకుంటామని అన్నారు. అయితే ఎవరికీ మంత్రి పదవి హామీ ఇవ్వలేదని, అలాగే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాల్సిన అవసరం కూడా లేదన్నారు. కుల, మత, ప్రాంతాల పేరుతో జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో టిఆర్‌ఎస్‌తో వైసిపి కుమ్మక్కైందని లోకేష్ ఆరోపించారు.
ఆధ్యాత్మిక చింతన ఉండాలి: బాలయ్య
శ్రీకాళహస్తి, మార్చి 2: ప్రపంచంలో భారతీయులకే సొంతమైన ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతుందని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బుధవారం ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతికోత్సవాలను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ పుట్టిన ప్రతి మనషి దైవ, పితృ, రుషి రుణాలు తీర్చుకోవాలన్నారు. ఆధ్యాత్మికత వల్ల భారతదేశ ఔన్నత్యం పెరిగిందన్నారు. వేదాలు, పురాణాలు, శతకాలను పిల్లలందరికీ నేర్పాలని సూచించారు. దీనివల్ల మంచి నడవడిక అలవడుతుందని, అందరికీ ఆదర్శంగా ఉంటారని చెప్పారు. మహానటుడు ఎన్‌టి రామారావు పౌరాణిక పాత్రల ద్వారా దేవుళ్లకు ప్రచారం కల్పించారని, సంఘసేవ చేశారని అన్నారు. శివపార్వతులను తల్లితండ్రులతో పోలుస్తామని, అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని బాలకృష్ణ అన్నారు.
బడ్జెట్ సమావేశాలకు భారీ బందోబస్తు
డిజిపి జెవి రాముడు వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 2: మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జెవి రాముడు కోరారు. కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం మచిలీపట్నం వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. చత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్నారు. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి జనంలోకి రావాలని కోరారు. ఈ నెల 5 నుండి జరిగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆగస్టులో నిర్వహించనున్న కృష్ణా పుష్కరాలకు ఇప్పటి నుండే సమాయత్తవౌతున్నామన్నారు. పుష్కర ఘాట్ల సంఖ్యను బట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని పుష్కర ఘాట్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కోస్తా తీరంలో మెరైన్ పోలీసు వ్యవస్థను పటిష్ఠపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. సముద్రంలో గస్తీ కోసం రాష్ట్రానికి 32 మెరైన్ బోట్లు మంజూరయ్యాయన్నారు. మెరైన్ పోలీసు స్టేషన్‌ల సంఖ్యను కూడా ఆరు నుండి 15కు పెంచినట్లు తెలిపారు. విలేఖర్ల సమావేశంలో ఏలూరు రేంజ్ డిఐజి పి హరికుమార్, కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్ కుమార్ పాల్గొన్నారు.

సామాన్యుడిపై భారమా?
విద్యుత్ చార్జీల పెంపుపై చర్చలో ప్రజాభిప్రాయం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మార్చి 2: ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో నానా ఇక్కట్లను ఎదుర్కొంటున్న సామాన్యులపై విద్యుత్ పెంపు భారం తగదని పలువురు ధ్వజమెత్తారు. బుధవారం శ్రీకాకుళంలోని ఎపిఈపిడిసియల్ పర్యవేక్షక ఇంజనీరు కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కమిషన్ అధ్యక్షులు జస్టిస్ భవానీ ప్రసాద్ విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. రాష్ట్రంలో 99 శాతం మంది మద్యతరగతి కుటుంబీకులే ఉన్నారని తెలిపారు. కమిషన్‌కు ఉన్న అధికారాలకు మేరకు సామాన్య వినియోగదారునిపై భారం పడకుండా చూస్తామనిఅన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న రాయితీలు తగ్గిస్తే ఎపిఈపిడిసియల్‌లో ఉన్న 905 కోట్ల రూపాయలు నష్టం దానంతట అదే భర్తీకాగలదని సిపిఎం నేతలు తిరుపతిరావు, సిటు నేత డి గోవిందరావు అన్నారు. పైగా 200 యూనిట్లు దాటితే బాదుడు అంటున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఓ సామాన్య వినియోగదారుడు రెండు ఫ్యాన్‌లు, రెండు లైట్లు వేసుకుంటున్నారని, దీంతో 200 యూనిట్లు పైబడి బిల్లు వస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు పెరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. భవానీ ప్రసాద్ స్పందిస్తూ ప్రజాభిప్రాయసేకరణలో ఇదే మొదటి సమావేశమని, పట్టణ, గ్రామీణ ప్రజలు, రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సంస్థ సిఎండి ముత్యాలరాజు పవర్ ప్రెజెంటేషన్ ద్వారా సంస్థ చేపట్టిన అభివృద్ధిని కమిషనర్‌కు వివరించారు. కంచిలి మండలం ఫెడరేషన్ ఆప్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతూ హైపవర్ కరెంటు లైన్లు వేసినప్పుడు ఉద్దానం ప్రాంతంలో ఉన్న రైతులకు న్యాయం జరగడం లేదని ఫిర్యాదు చేసారు.

పోలీసులకు చిక్కిన న్యూడెమోక్రసీ నక్సలైట్లు
బుట్టాయగూడెం, మార్చి 2: పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్‌లో న్యూడెమోక్రసీ దళ కమాండర్, ఇద్దరు కొరియర్లు చిక్కారని జంగారెడ్డిగూడెం డిఎస్పీ జె వెంకట్రావు తెలిపారు. ఉప్పరిల్ల అటవీ ప్రాంతంలో గత నెల 29వ తేదీన జరిపిన కూంబింగ్ ఆపరేషన్‌లో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం)కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పశ్చిమ ఏజన్సీలో న్యూడెమోక్రసీ దళాల కదలికలపై పోలీసులకు అందిన సమాచారం మేరకు గత నెల 29వ తేదీన అటవీ ప్రాంతమైన ఉప్పరిల్లలో జిల్లా యాంటీ నక్సల్స్ స్క్వాడ్ ఇన్‌ఛార్జి ఆర్‌ఎస్‌ఐ సతీష్‌కుమార్ తన సిబ్బందితో కూంబింగ్ నిర్వహిస్తుండగా దళ సభ్యులు ఎదురయ్యారు. కొందరు పారిపోగా, ముగ్గురు పోలీసుల చేతికి చిక్కారు.