రాష్ట్రీయం

పంచాయతీ రిజర్వేషన్లపై నిర్ణయం మారదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: పంచాయతీ ఎన్నికల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీలకు 61 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో మార్పులేదని, ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళతామని ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చూడాలంటూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో బుధవారం వివరంగా చర్చించింది. పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేవంలో దాదాపు గంట పాటు చర్చించింది. ఆ తర్వాత మంత్రులు జూపల్లి, ఈటల రాజేందర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితిలోనూ 34 శాతం తగ్గకుండా చూస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు కలిపి 61 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఇప్పటికే నిర్ణయించామని (ప్రభుత్వం నిర్ణయించిందని) మంత్రులు వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓపై కొంత మంది హైకోర్టుకు వెళ్లారన్నారు. దాంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చూడాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కొంత మంది హైకోర్టుకు వెళ్లడం వల్లనే చిక్కులు వచ్చాయన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేయాలని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయించామన్నారు. కోర్టులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వాస్తవంగా బీసీ, ఎస్టీ, ఎస్సీలు కలిపి మొత్తం జనాభాలో 80 శాతం వరకు ఉన్నారని మంత్రులు తెలిపారు. తమిళనాడుతో సహా మరికొన్ని రాష్ట్రాలు కూడా రిజర్వేషన్లను 50 శాతం మించి అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. అదే వెసులుబాటును
తెలంగాణకు కూడా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
పొడిగింపా? స్పెషలాఫిసర్లా?
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ నెల 31తో ముగుస్తోందని జూపల్లి, ఈటల గుర్తు చేశారు. వీరి పదవీకాలం ముగిసిన తర్వాత ప్రస్తుతం ఉన్న పాలకమండళ్ల పదవీ కాలాన్ని పొడగించాలా లేక ప్రత్యేక అధికారులను నియమించాలా అన్న అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని, ఆ తర్వాత మంత్రివర్గ పూర్తిస్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
సకాలంలో ఎన్నికలు నిర్వహంచాలనే ఉద్దేశంతోనే పంచాయతీరాజ్ శాఖ పరిపాలనాపరమైన నిర్ణయాలను తీసుకుంటూ వచ్చిందని మంత్రులు తెలిపారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందన్నారు.
రిజర్వేషన్లపై రాష్ట్రాలకే అధికారం
రిజర్వేషన్లపై రాష్ట్రానికే అధికారం ఇవ్వాలంటూ తమ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని ఈటల, జూపల్లి తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఒక తీర్మానాన్ని గతంలోనే చేసి, కేంద్రానికి పంపించామని అన్నారు. తమ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ కేంద్రం వద్దకు వెళతామని స్పష్టం చేశారు.