రాష్ట్రీయం

‘హయ్యర్’ కమిషన్‌పై మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: దేశంలో ఉన్నత విద్యపై పర్యవేక్షణకు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్‌ఈసీ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు మాత్రం ఈ కమిషన్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ను రద్దు చేసి, దాని స్థానంలో హెచ్‌ఈసీ ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల అభిప్రాయాన్ని సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 16వ తేదీన మాజీ వైస్ ఛాన్సలర్లు, వైస్ ఛాన్సలర్లు, విద్యా నిపుణులు, ఎన్‌జీవోల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు. వారందరి సూచనలను తెలుసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ఎంహెచ్‌ఆర్‌డీకి తెలియజేయనుంది. యూజీసీ పనితీరుకూ, హెచ్‌ఈసీ పనితీరుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నివృత్తి చేయడంతో పాటు రెండు సంస్థల మధ్య ఉన్న తేడాలను సుస్పష్టంగా చెప్పకపోవడంతో విద్యావేత్తలు, నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్‌కు చైర్మన్, వైస్ చైర్మన్, 12 మంది సభ్యులు, ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు. చైర్మన్, వైస్ చైర్మన్‌లు 70 ఏళ్ల వయస్సు వరకూ కొనసాగే వీలుంది. ఇక సభ్యులుగా విద్యాశాఖ కార్యదర్శి, నైపుణ్యాల శాఖ కార్యదర్శి, సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి, ఎఐసిటీఈ, ఎన్‌సీటీఈ చైర్మన్లు, ఎన్‌బిఎ, నేక్ సంస్థల అధ్యక్షులు, ఇద్దరు వైస్ ఛాన్సలర్లు, ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్లు, పరిశ్రమ రంగం నుండి ఒకరు సభ్యులుగా ఉంటారు.
ప్రధానంగా అనుమతులు ఇచ్చేందుకు మార్గదర్శకాలను రూపొందించడం, క్వాలిటీ, ప్రమాణాలను కాపాడటం, స్వయం ప్రతిపత్తి ప్రసాదించాలంటే అనుసరించాల్సిన నియమనిబంధనలు, ప్రమాణాలకు కొలమానాన్ని రూపొందించడం, డిగ్రీలు ప్రదానం చేయాలంటే అనుసరించాల్సిన విధానం, అర్హతలు, మంచి పద్ధతులను పాటించడానికి మార్గాన్ని ఈ కమిషన్ సూచిస్తుంది. కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎంపిక సెర్చి కమిటీ - సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ ఎంపిక కమిటీకి క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షత వహిస్తారు. అందులో సెక్రటరీ, ముగ్గురు విద్యావేత్తలు ఉంటారు. వారంతా అనంతరం కొత్త కమిషన్‌లో సభ్యులుగా కొనసాగుతారు. ఇదంతా బాగానే ఉన్నా, కొత్త కమిషన్‌పై అనేక మంది అనుమానాలను లేవనెత్తుతున్నారు.
మరణశాసనం: సీరా
కొత్త కమిషన్ ఏర్పాటు ప్రభుత్వ సంస్థలకు మరణశాసనమని సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ అనాలసిస్ సంస్థ (సీరా) కన్వీనర్ ఎన్. నారాయణ పేర్కొన్నారు. విదేశీ సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు పెద్ద పీట వేసేందుకు కొత్త కమిషన్ ఉపయోగపడుతుందని అన్నారు. యూజీసీ నుండి ఎంహెచ్‌ఆర్‌డికి నిధులు కేటాయించే అధికారం వెళ్లిపోతే రాజకీయాలకు అనుగుణంగానే కేటాయింపులు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. నిధుల కేటాయింపునకు రాజకీయ ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. సామాజిక న్యాయ సూత్రం అమలుచేయడం సాధ్యం కాదని, జీఈఆర్‌ను 25.2 శాతానికి పెంచాలనే లక్ష్యం నెరవేరదని అన్నారు. ఇప్పటికైనా కొత్త కమిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు.
సమీక్ష లేకుండా నిర్ణయాలా?
ఉస్మానియా యూనివర్శిటీ కొత్త కమిషన్‌పై నిర్వహించిన వర్కుషాప్‌లో పలువురు ప్రతికూలంగా స్పందించారు. ఎలాంటి సమీక్ష , ఆలోచన లేకుండా తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల దేశానికి లాభం కంటే నష్టమై ఎక్కువ జరుగుతుందని వర్కుషాప్‌లో పాల్గొన్న పలువురు విద్యావేత్తలు నిపుణులు అభిప్రాయపడ్డారని ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ సుజాత తెలిపారు. హెచ్‌ఇసిఐని వికేంద్రీకరించాలని వక్తలు అభిప్రాయపడ్డారని ఆమె చెప్పారు.
విరమించుకోవాలి: ఔటా
ఉన్నత విద్యా కమిషన్‌ను విరమించుకోవాలని ఔటా అధ్యక్షుడు ప్రొఫెసర్ బి సత్యనారాయణ పేర్కొన్నారు. కొత్తగా ప్రతిపాదించిన కమిషన్‌పై వర్కుషాప్ నిర్వహించి అభిప్రాయాలను సేకరించగా, దీనిని అనేక మంది వ్యతిరేకించారని చెప్పారు. విస్తృతమైన చర్చ జరగాలని, చర్చకు కేంద్రం ఇచ్చిన సమయం ఏ విధంగానూ సరిపోదని పేర్కొన్నారు.