రాష్ట్రీయం

సహకరిస్తే సత్ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 13: ప్రాధాన్యతా రంగాలకు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. ఉండవల్లి గ్రీవెన్స్ హాలులో శుక్రవారం 203వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశం సందర్భంగా 2018-19 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. రాష్ట్ర వార్షిక రుణప్రణాళిక లక్ష్యం లక్షా 94వేల 220 కోట్లు కాగా ప్రాధాన్యతా రంగానికి లక్షా 44వేల 220 కోట్లు, ప్రాధానే్యతర రంగానికి 50వేల కోట్లు, భారీ పరిశ్రమలకు రూ 10వేల 457 కోట్లు, ఎంఎస్‌ఎంఇలు 3745 కోట్లు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు 14వేల 28కోట్లు, స్మాల్ ఎంటర్‌ప్రైజెస్‌కు 11వేల 500 కోట్లు, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కు 2733కోట్లు ప్రతిపాదించారు. ఎంఎస్‌ఎంఈ రుణాలు 28వేల 261 కోట్లు, వ్యవసాయ రుణప్రణాళిక రూ 1,01,564కోట్లు స్వల్పకాలిక ఉత్పాదక రుణాలు 75వేల కోట్లు కేటాయించగా ఇందులో కౌలురైతులకు ఆర్థికసాయం కింద 7500 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు 21వేల 323 కోట్లు, వ్యవసాయ వౌలిక సదుపాయాలకు 241 కోట్లు, అనుబంధ కార్యక్రమాలకు 5వేల కోట్లను వరుసగా ప్రతిపాదించారు. సకాలంలో బ్యాంకులు రుణాలందిస్తే వ్యవసాయ దిగుబడులు పెరిగి రైతులకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ఆలోచనలు బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో పెట్టటమే సమస్య అన్నారు. రైతు రుణమాఫీ అమలులో తొలి ఏడాది అనేక కష్టాలను ఎదుర్కొన్నామని
వాటిని ఎలా అధిగమించిందీ వివరించారు. ఎవరూ సహకరించకపోయినా రైతు ప్రాధికార సంస్థ ఏర్పాటుతో రుణమాఫీని అమలు చేశామని గుర్తుచేశారు. రైతుల్లో వ్యవసాయంపై విశ్వాసం పెంపొందించగలిగాం.. ఎరువులు, సూక్ష్మపోషకాలు అన్నీ సకాలంలో అందించాం.. అందువల్లే దిగుబడితో పాటు వ్యవసాయ వృద్ధిరేటు పెరిగిందని తెలిపారు. వ్యవసాయ రుణాల అమలులో సాధికార సంస్థ సహకారం తీసుకోవాలని సూచించారు. విభాగాల వారీగా వెళ్లాలని, తాము పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సమాచారాన్ని అంతటినీ ఆన్‌లైన్‌లో ఉంచుతున్నామని వివరించారు. సామర్థ్యం పెంపుదల, నైపుణ్యాభివృద్ధితో బ్యాంకర్లు తమ సేవలను మెరుగుపరుచుకోవాలని కోరారు. పరీక్షలు రాసే విద్యార్థిలా ప్రతి మూడు నెలలకోసారి వృద్ధిరేటు తనకు ఒక పరీక్షగా చెప్పారు. నెలవారీ ప్రణాళికాబద్ధంగా ఇంక్లూసివ్‌నెస్‌పై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. తద్వారా వృద్ధిరేటును, ప్రజల్లో సంతోషశాతాన్ని, వృద్ధిని అంచనా వేయవచ్చన్నారు. పెద్దనోట్ల ఉపసంహరణతో దేశమంతటా బ్యాంకులు డిపాజిట్లులేక ఇబ్బందులుపడితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులలో చేరిన డిపాజిట్లలో 9 శాతం వృద్ధిని గమనించ వచ్చని ఓ అధికారి వివరించగా ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఉద్ఘాటించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని, అనంతపురం ఎడారిగా మారిందని, రైతులు వ్యవసాయాన్ని వదిలి పంట విరామం ప్రకటించిన దైన్యస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వ్యవసాయరంగాన్ని ప్రాథమికరంగ మిషన్‌గా ఎంచుకుని దార్శనికతతో ముందుకు సాగామని, ఎరువులు, సూక్ష్మ పోషకాలను సకాలంలో అందించి ఉత్పాదకతను పెంచగలిగామన్నారు. దీనివల్ల రైతుల్లో మనోధైర్యం కలిగిందన్నారు. సకాలంలో రుణాలు అందించకపోవటమే ఓ సమస్యగా చెప్పారు. వ్యవసాయరంగాన్ని సంస్కరణలతో ఆధునీకరించామని ఇ-క్రాపింగ్.. జియోట్యాగింగ్ విధానాలను ఉదహరించారు. గత నాలుగేళ్లలో వ్యవసాయంలో స్థిరత్వం వచ్చిందని, పద్ధతి ప్రకారం సమస్యలను అధిగమించామని తెలిపారు. పద్ధతి లేకుండా వెళితే సమస్యలు తప్పవన్నారు. పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ, గ్రామీణాభివృద్ధికి ఊతమిస్తుందని, సుస్థిర సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడుతుందని, ఈ రంగానికి బ్యాంకర్లు చేయూతనందించాలని సూచించారు.రైతులకు ఆదాయాన్ని పెంచే రైతు ఉత్పాదక సంస్థలలో సభ్యులసంఖ్యపై బ్యాంకర్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి స్పందిస్తూ ఒక సంఘంలో 50, మరో సంఘంలో 75 ఉంటారని, ఇలాంటి 15 సంఘాలను ఒక సమ్మేళనంగా (కానె్ఫడరేషన్)గా తీర్చిదిద్దవచ్చని సూచించారు.కోటి ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగుచేయాలనే లక్ష్యంతో ఒక ప్రణాళిక రూపొందించుకుంటే తొలిదశలో సమస్యలు ఎదురయ్యాయని అనుభవాలను వివరించారు. గత ఏడాది చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడికాయలు కిలోకు రూ 8 ధర ఉంటే ఈ ఏడాది ఒకేసారి రూ. 4కు పడిపోయిందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించిందని గుర్తుచేశారు. కోల్డ్‌చెయిన్ అభివృద్ధి చేశామని కిలో తోతాపురి మామిడికి రూ 2.50 సబ్సిడీ అందించగా ఫ్యాక్టరీ యజమానులు రూ 5 చెల్లించారని, దీంతో 7.50 రూపాయలకు గిట్టుబాటుధర కల్పించినట్లయిందన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ఒకే బ్యాంకు శాఖలు అనేకం ఉన్నాయని మరో బ్యాంకర్ తెలిపారు. ఏజెంట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీంతో సాధికార మహిళల సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని 15శాతం తగ్గించగలిగామని వ్యవసాయాధికారులు వివరించగా మరింత తగ్గించాలని ముఖ్యమంత్రి సూచించారు. తాము అధికారంలోకి వచ్చిన సమయంలో ఏ ఒక్కరంగంలో సానుకూల పరిస్థితులులేవన్నారు.ప్రజలు, అధికారుల సహకారంతో ఒక్కొక్కటిగా సమస్యలు అధిగమించామన్నారు. ఐటీ, ఇంటర్నెట్ సమాహారంగా వచ్చిన ఐఓటీ పరిజ్ఞానంతో పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చామన్నారు. అభివృద్ధి, సంక్షేమం తమకు ప్రాధాన్యాలని, పింఛన్ల చెల్లింపు, నరేగా అమలు, చంద్రన్న బీమా తదితర కార్యక్రమాల అమలులో ఆన్‌లైన్ ద్వారా చేపట్టి రియల్‌టైమ్ గవర్నెన్స్ ద్వారా అమలుచేస్తూ పారదర్శకత పాటిస్తున్నట్లు వివరించారు. జీఎస్‌డీపీకి వ్యవసాయరంగం నుంచే 34 శాతం వస్తోందన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం లాంటి ఆదాయంలేని జిల్లాలు ఉన్నాయని, కడప, కర్నూలు తరువాత వరుసలో ఉన్నాయన్నారు. అన్ని జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సమావేశాలు మొక్కుబడిగా సాగరాదని భవిష్యత్‌కు ఉపయుక్తంగా ఉండే అజెండా అమలు చేయాల్సి ఉందన్నారు.
చిత్రం..రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు