రాష్ట్రీయం

అయోధ్యే అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలతో పాటు ప్రజల్లో చైతన్యం నింపేందుకు వచ్చే ఎన్నికల్లోపు రామమందిర నిర్మాణం చేపట్టేలా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉంటాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేయడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికల బీజేపీ అజెండాను బయటపెట్టారు. శుక్రవారం నాడు ఆయన పార్టీ నేతలకు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశనం చేశారు. అమిత్ షా రాక సందర్భంగా పార్టీ నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ ఉత్సాహం ఉప్పొంగింది. బేగంపేట విమానాశ్రయంలో
ఆయనకు
ఘనస్వాగతం లభించింది. ఆయన వెంట పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు భూపేందర్ యాదవ్, పీ మురళీధరరావు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ ఉన్నారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన నేరుగా హోటల్‌కు చేరుకుని అక్కడ ఆర్‌ఎస్‌ఎస్ , వీహెచ్‌పీ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం అక్కడి నుండి పార్టీ కార్యాలయానికి వచ్చారు. తొలుత పార్టీ విస్తారక్‌లతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. మధ్యాహ్నం లోక్‌సభ ఎన్నికల యాజమాన్య కమిటీలతో సమావేశమయ్యారు. మధ్యలో నిజామాబాద్ అభ్యర్థి అరవింద్‌తోనూ, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో విడివిడిగా సమావేశమయ్యారు. ప్రధాని పిలుపునిచ్చిన సంపర్క్ ఫర్ సమర్ధన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నేతా స్థానికంగా ఉన్న ప్రముఖులను కలవాలన్న
లక్ష్యంలో భాగంగా సాయంత్రం అమిత్ షా ఫిల్మ్‌సిటీకి వెళ్లి పత్రికాధిపతి రామోజీతో దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. అనంతరం ఆయన అక్కడి నుండి గచ్చిబౌలి ఓరియన్ విల్లాకు చేరుకుని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ఆమె కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల సంపుటిని వారికి అమిత్ షా అందించారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికలలోపు రామమందిర నిర్మాణం చేపట్టేలా కేంద్రప్రభుత్వ చర్యలు ఉంటాయని అమిత్ షా పేర్కొన్నారని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులతో అమిత్‌షా సమావేశం అనంతరం పేరాల శేఖర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేలా అమిత్‌షా పర్యటన సాగిందని చెప్పారు. బీజేపీ సొంత బలంతోనే రాబోయే ఎన్నికల్లో ముందుకు పోతుందని అన్నారు. మండల, గ్రామ స్థాయిలో పార్టీ నాయకత్వం పర్యటించేలా, ప్రజలతో మమేకమై పల్లెపల్లెల్లో బీజేపీని విస్తృతం చేయాలని అమిత్ షా నిర్దేశించినట్టు చెప్పారు. 119 నియోజకవర్గాల్లో 119 నాయకత్వ బృందాలు పర్యటించేలా కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలని అమిత్‌షా నిర్దేశించారని అన్నారు. కేంద్ర పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనపై బీజేపీ మున్ముందు వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు ఆయన చెప్పారు.
పుస్తకావిష్కరణ
అమిత్ షా పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జన చైతన్య యాత్ర పుస్తకాన్ని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేతులు మీదుగా ఆవిష్కరించారు. జూన్ 23 నుండి 14 రోజుల పాటు మార్పుకోసం పేరిట రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ చేపట్టిన జనచైతన్య యాత్ర కార్యక్రమ విశేషాల సంపుటి ని అమిత్ షా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి డాక్టర్ కే లక్ష్మణ్ అధ్యక్షత వహించారు.
వ్యూహాత్మక అడుగులు
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని అమిత్ షా సూచించారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను మట్టికరిపించేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారని ఆయన చెప్పారు. ఈ భేటీలో పార్టీ కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

చిత్రం..బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో అమిత్ షా