ఆంధ్రప్రదేశ్‌

జూన్ 15నుంచి అమరావతి నుంచే పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రాజధాని అమరావతిని మనందరి నగరంగా తీర్చిదిద్ది, జూన్ 15 నుంచి ప్రజలకు ఇక్కడి నుంచే పాలనను అందించేందుకు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో శుక్రవారం రూ. 28 కోట్ల విలువచేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో రాజధాని అమరావతి ఏర్పాటవుతున్నందున హైదరాబాద్ నుంచి పాలిస్తే ప్రజలకు నచ్చదన్నారు. రెండు ప్రదేశాల నుండి పాలన చేయాలంటే సాధ్యపడదన్నారు. అందువల్లే రాజధాని అమరావతిలో సచివాలయ నిర్మాణ పనులు వేగవంతం చేశామన్నారు. జూన్ 8 నాటికి రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు తన అనుభవం, సామర్థ్యాన్ని గుర్తించి ఓట్లు వేసి గెలిపించినందున వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. వేరే రాష్ట్రాల్లో మనకన్నా ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో వెనుకంజలో ఉన్నాయన్నారు. కేంద్రం నుంచి విభజన హామీలు ఇంకా రావాల్సి ఉందన్నారు. వాటిని సాధించే దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే పాలనను ఇక్కడినుంచే శాశ్వతంగా కొనసాగిస్తామని చెప్పారు. రాయలసీమ, బెంగళూరు ప్రధాన రహదారుల నిర్మాణం నరసరావుపేట మీదుగా నిర్మితమవుతుందన్నారు. అమరావతి నుంచి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం నరసరావుపేట మీదుగా వెళ్తున్నందువలన శాటిలైట్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ఎక్స్‌ప్రెస్ హైవే ద్వారా కేవలం నాలుగైదు గంటల వ్యవధిలోనే రాయలసీమ, బెంగళూరు చేరుకునే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలోనే ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయని, తిరుపతి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, కోటప్పకొండ లాంటి పుణ్యక్షేత్రాలు రాష్ట్రంలో ఉండటం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు.

ఈ పుణ్యక్షేత్రాలను వారసత్వ సంపదగా గుర్తించి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనిషిని మనిషిగా జీవింపజేసేవే ప్రార్థనాలయాలని, ఇక్కడ మానసిక వికాసం, ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన చేకూరుతాయన్నారు. పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, అందువల్లే కోటప్పకొండను కూడా పర్యాటక స్థలంగా తీర్చిదిద్దుతామన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేయడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు అందరి భాగస్వామ్యం అవసరముందని, అందువల్ల ప్రజలు ముందుకు వచ్చి తమవంతు సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.

రోజాకు మళ్లీ నిరాశే
హైకోర్టులో విచారణకు రాని పిటిషన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 4: ఏపి అసెంబ్లీ తనపై విధించిన ఏడాది సస్పెన్షన్‌పై స్టే ఇస్తూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యేందుకు హైకోర్టు అనుమతి ఇస్తుందన్న వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజాకు నిరాశ ఎదురైంది. శుక్రవారం రోజా తరపున న్యాయవాది ఇందిరా జైసింగ్ తన క్లయింట్ రోజా అసెంబ్లీకి హాజరయ్యేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు కోర్టును అభ్యర్థించారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో న్యాయవాది రిజిస్ట్రీ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే జస్టిస్ పివి సంజయ్‌కుమార్ కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, మరో పిటిషన్‌ను దాఖలు చేయడంపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని జస్టిస్ రామలింగేశ్వర రావు కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. జస్టిస్ పివి సంజయ్ కుమార్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు కోర్టు అనుమతించింది. దీనికి కోర్టు లిఖితపూర్వకమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. వెంటనే మరో పిటిషన్‌ను దాఖలు చేయగా అప్పటికే సమయం సాయంత్రం 4.30 గంటలైంది. ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టు ఈ కేసును విచారించాలని శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని హైకోర్టుకు తెలిపారు. ఈ కేసును రిజిస్ట్రీ నిబంధనల మేరకు విచారిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వర రావు స్పష్టం చేశారు.
మహిళా ప్రతినిధులతో
రేపు, ఎల్లుండి సదస్సు
పార్లమెంట్ సెంట్రల్
హాల్‌లో ముగింపు సభ
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 4:మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చట్టసభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రతినిధుల సదస్సును ఢిల్లీలో నిర్వహించనున్నట్టు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు. ఆమె శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో విలేఖరులతో మాట్లాడుతూ ‘చట్టసభల్లో మహిళా ప్రతినిధులు-నవోత్తేజ భారత నిర్మాణం’ అంశంపై శని, ఆదివారాల్లో జరిగే సదస్సును విజ్ఞాన్ భవన్‌లో రాష్టప్రతి ప్రారంభిస్తారని, మహిళా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ మహిళా ప్రజాప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారని ఆమె తెలిపారు. ప్రధాని మోదీ, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొని ప్రసంగిస్తారని సుమిత్ర మహాజన్ తెలిపారు. ముగింపు కార్యక్రమాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఏర్పాటు చేశామన్నారు.
స్వామిగౌడ్‌పై పిటిషన్‌ను
తిరస్కరించిన సుప్రీంకోర్టు
హైకోర్టుకు వెళ్లాలని సూచన
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 4: హైదరాబాద్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది.

రైతు సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం
అఖిల భారత రైతు సంఘం ప్రకటన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 4: దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు అఖిల భారత రైతుసంఘం (ఎఐకెఎస్) జాతీయాధ్యక్షులు ప్రబోధ్ పాండా, ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ ప్రకటించారు. ఎఐకెఎస్ 29వ జాతీయ మహాసభల రెండవ రోజు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయాధ్యక్షులు ప్రబోద్ పాండా మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన రూ. 20 లక్షల కోట్ల బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందన్నారు. వ్యవసాయ రంగానికి రూ.35 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు టి నరసింహన్ మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర గురించి బడ్జెట్‌లో ప్రస్తావన లేదన్నారు. భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు గుండా మల్లేష్ మాట్లాడుతూ వ్యవసాయ భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్ సంస్ధలకు ఇస్తున్నారన్నారు. ఈ సమావేశంలో చేసిన తీర్మానాలను ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ వివరించారు. రబ్బరు పండిస్తున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు వెయ్యి కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య మాట్లాడుతూ ఏపి ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూమిని లాక్కొందన్నారు.
టిడిపిలో చేరిన పాతపట్నం ఎమ్మెల్యే
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 4: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పక్ష తెలుగుదేశం పార్టీలోకి శాసనసభ్యుల వలస అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసిపి ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పచ్చకండువా కప్పించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమిడి కళా వెంకట్రావు, ఆ జిల్లాకు చెందిన మంత్రి కె అచ్చంనాయుడుతో కలిసి సిఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని సిఎం సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పటివరకు వైసిపి నుంచి తెలుగుదేశంలోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరింది.

ఈ సందర్భంగా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయించాల్సి వచ్చిందన్నారు. తెలుగుదేశం సిద్ధాంతాలు, ముఖ్యంగా చంద్రబాబు పనితీరు తనను ఎంతో ముగ్ధుడ్ని చేశాయన్నారు.

ఈవిఎంల్లో ట్యాంపరింగ్‌కు
అవకాశమే లేదు
ఈసిఐఎల్ సిఎండి సుధాకర్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 4: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవిఎం)లలో ట్యాంపరింగ్ జరిగే అవకాశమే లేదని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా లిమిటెడ్ (ఈసిఐఎల్) సిఎండి సుధాకర్ అన్నారు. ఇటీవల ఇవిఎంలు ట్యాం పరింగ్ జరుగుతున్నాయని వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఆయన ఈ వివరణ ఇచ్చారు. ఒక ప్రైవేట్ కార్యక్ర మం వద్ద విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించి తెలిపారు. ఈవిఎంల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని అన్నారు. ట్యాంపరింగ్ అనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. 2019 నాటికి ఐదు లక్షల ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేసి ఉంచాలని ఎన్నికల సంఘం తెలిపిందని స్పష్టం చేశారు. భారత దేశంలో ఈవిఎంలను వినియోగించడమే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్లలో భరోసా, పారదర్శకత కోసం రశీదు యంత్రాలను తయారు చేసినట్లు వెల్లడించారు.