రాష్ట్రీయం

మరో జలవివాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 18: కర్నూలు, అనంతపురం జిల్లా రైతుల మధ్య ప్రభుత్వం మరో జల యుద్ధానికి తెరలేపింది. తుంగభద్ర జలాల్లో కేసీ కాలువకు కేటాయించిన 15 టీఎంసీల నికర జలాలను అనంతపురం జిల్లాకు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం కేసీ కాలువకు ప్రాణాధారమైన సుంకేసుల జలాశయం ఎగువన మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి అక్కడి నుంచి అనంతపురం జిల్లాకు నీటిని తరలించేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు సర్వే చేసి నివేదిక అందించమంటూ రూ.3.62కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కొత్తగా మరో జల వివాదం రాజుకోవడానికి ప్రభుత్వమే నిప్పురాజేసిందని రైతులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం ఈ నెల 13వ తేదీ జారీ చేసిన జీవో నెం.277 ప్రకారం తుంగభద్ర నదిపై ఉన్న ఆర్డీఎస్ దిగువన సుంకేసుల జలాశయానికి ఎగువన ఎత్తిపోతల పథకం నిర్మించి అక్కడి నుంచి అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం జలాశయానికి తుంగభద్ర జలాలను అందించాలని అనంతపురం జిల్లా అధికారులు ప్రతిపాదించగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కాగా తుంగభద్ర జలాశయంలోని కేసీ కాలువ నికర జలాలను అనంతపురం జిల్లాలో సాగునీటి అవసరాల పేరుతో 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 టీఎంసీల నీటిని కేటాయించారు. దీనిపై రైతులు, రాజకీయ నాయకులు ఆందోళన నిర్వహించగా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఆందోళనకారులనే సముదాయించింది. కరవు జిల్లాలో సాగునీటి అవసరాలను వివరించి తోటి రైతులను ఆదుకోవాలని చంద్రబాబు చేసిన విన్నపంతో కర్నూలు రైతులు శాంతించారు. ఆ తరువాత రాజశేఖరరెడ్డి 2006లో మరో జీవో ద్వారా కేసీ కాలువ నీటి వాటా నుంచి 10 టీఎంసీల నీటిని అనంతపురం జిల్లాకు మళ్లించారు. దీనిపై రైతులు, ప్రతిపక్ష పార్టీలు ఉద్యమం నిర్వహించగా ముచ్చుమర్రి వద్ద ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తానని అక్కడి నుంచి 15 టీఎంసీల కృష్ణాజలాలను వినియోగించుకోవచ్చని రైతులకు సూచించారు. దీంతో రైతులు శాంతించారు. తాజాగా విడుదల చేసిన జీవోలో కొత్తగా సుంకేసుల జలాశయం ఎగువన ఎత్తిపోతల పథకం నిర్మించాలని ప్రతిపాదించడంతో సుంకేసుల నుంచి గార్గేయపురం వరకు ఉన్న ఆయకట్టు రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారనుంది. అంతేగాక తుంగభద్ర జలాల్లో కేసీ కాలువకు కేటాయించిన 35 టీఎంసీల నికర జలాలను ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సాకుగా చూపి అనంతపురం జిల్లాకు తరలించనున్నారని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే ముచ్చుమర్రి నుంచి కడప వరకు వృథా, ఆవిరి జలాలు పోగా కేవలం 15 టీఎంసీల నీరు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందని కర్నూలు, కడప రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఎత్తిపోతల ప్రతిపాదన విరమించుకోవాలి
తుంగభద్ర నదిపై సుంకేసులకు ఎగువన ఎత్తిపోతల పథకం నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్నహోబిలం జలాశయానికి తుంగభద్ర జలాలను తరలిస్తే కర్నూలు, కడప కరవు జిల్లాలుగా మారిపోతాయని ఆయన ఆవేదన చెందారు. కేసీ కాలువ నీటిని అనంతపురం జిల్లాకు ఇచ్చి త్యాగం చేసిన కర్నూలు రైతులపై ప్రభుత్వం కక్షగట్టడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. ఇంత దారుణం జరుగుతున్నా టీడీపీ, వైకాపా చోద్యం చూస్తున్నాయని ఆయన విమర్శించారు. వారికి ఓట్ల రాజకీయమే ప్రధానం కాని రైతుల సంక్షేమం కాదని కోట్ల సూర్య దుయ్యబట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాకపోయినా రైతులతో కలిసి తాము ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఎత్తిపోతల పథకం నిర్మాణం ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండు చేశారు.