రాష్ట్రీయం

ఏమిటీ భూదాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 22: ‘రాజధానికి ఎన్ని వేల ఎకరాల భూములు కావాలి?. ఇప్పటికే 53వేల 800 ఎకరాలు సమీకరించారు. 120 రకాల పంటలు పండే పచ్చని భూములను ధ్వంసం చేస్తున్నారు. ఇంకా భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మీ భూదాహానికి అంతం లేదా? ఇకపై మీ ఆటలు సాగవు’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. నిర్బంధ భూసేకరణను ప్రతిఘటించాలని రైతులకు పిలుపునిచ్చారు. పోలీసు బలగాలను మోహరించి తుపాకులు ఎక్కుపెట్టాలని చూస్తే రైతుల పక్షాన తానే ముందుకొచ్చి నిలబడతానని హెచ్చరించారు. ఆదివారం రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా ఉండవల్లిలో భూసమీకరణ, సేకరణను వ్యతిరేకిస్తున్న రైతులతో పవన్‌కళ్యాణ్ సమావేశమయ్యారు. ఏటా మూడు పంటలు పండే భూముల్ని మెట్టపొలాలుగా చూపి దోపిడీ చేస్తున్నారని ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. వ్యవసాయం, రైతులు, రైతుకూలీల గురించి తెలియని
మంత్రి నారాయణ నవ్వుతూ పంట భూములను బుల్‌డోజర్లతో దున్నటం అమానుషమన్నారు. రైతుకు కన్నీళ్లు తెప్పిస్తే వినాశనం తప్పదని హెచ్చరించారు. రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకునే అప్రకటిత నియంతృత్వ విధానాన్ని ప్రభుత్వం
అమలు చేస్తోందని మండిపడ్డారు. రైతుల్ని అడ్డంగా దోచుకుంటూ బలప్రయోగం ప్రదర్శించి వారిని వీధిన పడేస్తే జనసేన పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని స్పష్టం చేశారు. భూసేకరణను వ్యతిరేకిస్తున్న ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో తమను వేధింపులకు గురిచేస్తున్నారని రైతులు పవన్ ఎదుట ఏకరవు పెట్టారు. తమ సొంత పొలాల్లోకి వెళ్లాలంటే ఆధార్ కార్డు చూపాల్సి వస్తోందని, 144 సెక్షన్ విధించటంతో భయభ్రాంతులకు గురవుతున్నామన్నారు. దీనిపై పవన్ స్పందిస్తూ ‘ముఖ్యమంత్రి గారూ.. రైతుల్ని ఇబ్బంది పెట్టటం ద్వారా సింగూర్ పోరాటం, బషీర్‌బాగ్ కాల్పుల సంఘటన లాంటివి పునరావృతం కావాలని ప్రభుత్వం కోరుకుంటోందా?’ అని ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రంలో బషీర్‌బాగ్‌లో విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపి పదేళ్లు అధికారానికి దూరమయ్యారని గుర్తుచేశారు. జనసేన అండతో మళ్లీ అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు మరోసారి రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే తిరగబడతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. భూసేకరణ చట్టానికి సవాలక్ష సవరణలు చేసుకోమనండి, రాష్టప్రతి ఉత్తర్వులు తెచ్చినా భూములిచ్చే ప్రసక్తిలేదని తేల్చిచెప్పండని రైతులకు ఉద్బోధించారు. లెక్క ప్రకారం గ్రామసభలు నిర్వహించాలని, 85 శాతం మంది అంగీకరించాలని, సోషల్ ఇంపాక్ట్ ఎసెస్‌మెంట్ జరగాలని, ఆపైనే ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని పవన్ వివరించారు.
రహదార్ల కోసం సేకరణ జరుపుతున్నామని చెపుతున్నారని, ఏ రహదారికి ఎంత అవసరం? ప్రత్యామ్నాయ మార్గాలేమిటనే అంశాలపై స్పష్టత లేదా? అని నిలదీశారు. గతంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి 24వేల ఎకరాలు సేకరించారని, ఇందులో 12వేల ఎకరాల్లో మాత్రమే ప్లాంట్ ఏర్పాటైందని, భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఉపాధి లేక, ఆదాయం కోల్పోయి ఆలయాల్లో ప్రసాదాలు తిని బతకాల్సిన దైన్యస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరగదన్నారు. బలవంతపు భూసేకరణ కుదరదని, అసైన్డ్ భూముల రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేమంటే అభివృద్ధి నిరోధకుడిగా తనపై ముద్ర వేస్తున్నారని, తాను అభివృద్ధికి వ్యతిరేకిని కాదని స్పష్టం చేశారు.

చిత్రం..గుంటూరు జిల్లా ఉండవల్లిలో భూసమీకరణ, సేకరణను వ్యతిరేకిస్తూ రైతులతో సమావేశమైన పవన్