ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ.. దుమారమే!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం పున:ప్రారంభం కానున్నాయి. రానున్న రోజుల్లో బడ్జెట్ సమావేశాలు వాడి,వేడిగా జరగనున్నాయని అధికార, విపక్ష సభ్యుల ధోరణి చూస్తే స్పష్టమవుతోంది. శాసనసభ రణరంగాన్ని తలపించనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార,విపక్ష సభ్యులు మాటల కత్తులు దూస్తున్న తీరు చూస్తుంటే బాహాబాహీ తథ్యమనేది సుస్పష్టం. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు అస్త్రాలతో వైకాపా సిద్ధమవుతుండగా, దానిని దీటుగా ఎదుర్కోవడానికి టిడిపి రిహార్సల్స్ వేసింది. బడ్జెట్ సమావేశాలను ఇరు పార్టీలూ తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నించడంతో సమావేశాల తీరు రసవత్తరంగా మారనుందని విశే్లషకులు భావిస్తున్నారు. సభను ప్రజాసమస్యల పరిష్కారానికి వేదికగా ఉపయోగించుకోవాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధికార, విపక్ష పార్టీల సభ్యులను కోరుతునే ఉన్నారు. కేంద్రం నుండి నిధులను రాబట్టడంలో ప్రభుత్వ వైఫల్యంతో పాటు భూ దందా, రావెల కుమారుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అంశాలను వైకాపా నేతలు అసెంబ్లీలో ప్రస్తావన చేయనున్నారు. వీటితో పాటు దాదాపు పాతిక అంశాలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించేందుకు వైకాపా సిద్ధమవుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు వైకాపా 25 ప్రశ్నలను, అంశాలను సిద్ధం చేసుకున్నది. అందులో ప్రధానమైనవి: సిఆర్‌డిఎ భూ సమీకరణ, రైతుల అసంతృప్తి, అవినీతి, వ్యవసాయం, వ్యవసాయ రుణ మాఫీలో వైఫల్యాలు, ప్రాజెక్టుల అంచనా పెంపులో అవినీతి, అగ్రిగోల్డ్ బాధితులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కృష్ణా నదీ జలాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలతో పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు.
కాగా మంగళవారం నుండి మొదటి రెండు రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేయడం, ప్రభుత్వ సమాధానం కొనసాగుతుంది. 10న ఆర్థిక మంత్రి సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 11, 12, 13 తేదీల్లో అసెంబ్లీకి సెలవు దినాలు. 14, 15, 16 తేదీల్లో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ జరుగుతుంది. 17న ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు. 18 నుంచి పద్దులపై చర్చ ప్రారంభమవుతుంది. 20న ఆదివారం, 25న గుడ్ ఫ్రై-డే సందర్భంగా సెలవు. 27న ఆదివారం సెలవు. 28, 29 తేదీల్లో వివిధ పద్దులపై చర్చ జరుగుతుంది. 30న ఎపి ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.
ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయండి
వైకాపా నుండి తెలుగుదేశం పార్టీ తీర్ధం తీసుకున్న ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీ నేతలు ఇప్పటికే స్పీకర్‌కు ఒక వినతి పత్రం అందజేశారు. దీంతో పాటు అధికారికంగా మంగళవారం నాడు పార్టీ పరంగా నోటీసు ఇవ్వనున్నారు. దాంతో పాటు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసును కూడా మంగళవారం ఇచ్చేందుకు వైకాపా నేతలు సన్నద్ధమవుతున్నారు. టిడిపిలో గతంలో చేరిన వారితో పాటు ఇటీవల భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ వరకు అందరిపైనా అనర్హత వేటు వేయాల్సిందిగా వైకాపా నేతలు స్పీకర్‌ను కోరారు.
నేడే అవిశ్వాస తీర్మానం నోటీసు
రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ వైకాపా తమ నోటీసును మంగళవారం ఇవ్వనున్నట్టు తెలిసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్టు ఇప్పటికే వైకాపా అధినేత జగన్ చెప్పారు. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వైకాపా ఈసారి ఏకంగా ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాను ప్రసంగించిన తర్వాత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్‌కు అందజేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం కాబట్టి స్పీకర్‌పై ఇచ్చిన నోటీసు ప్రస్తావన అవసరం లేదని అన్నారు. పైగా అసెంబ్లీ నిబంధన ప్రకారం నోటీసు ఇచ్చిన రెండు రోజుల్లోనే సభ ఆమోదం తీసుకుని 10 రోజుల్లో చర్చ చేపట్టాల్సి ఉంటుందని జగన్ చెబుతున్నారు.