ఆంధ్రప్రదేశ్‌

శంభో హరహర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : శివరాత్రి సందర్భంగా ఉభయ తెలుగురాష్ట్రాల్లోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. సోమవారం శివుడికి ప్రీతిపాతమైన రోజు. ఈ రోజు సాధారణంగా శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తుంటారు. ఈ సంవత్సరం శివరాత్రి సోమవారం రావడంతో ఉభయ రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. అన్ని ప్రధాన క్షేత్రాల్లో ‘ఓం నమఃశివాయ’ అంటూ భక్తులు శివుడి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, వేములవాడ, కాళేశ్వరం, ఆలంపూర్ జరాసంఘం, కీసర తదితర పుణ్యక్షేత్రాల్లో లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. శివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు తరలి రావడంతో అన్ని ప్రధాన క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక అభిషేకాలను రద్దు చేశారు.
శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయాలను దాదాపు ఐదులక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కృష్ణానది పాతాళగంగలో స్నానమాచరించేందుకు భక్తులు లక్షల సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం భ్రమరాంబాదేవీ, మల్లికార్జునస్వామి నంది వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. సాయంత్రం రథోత్సవం, రాత్రి కళ్యాణోత్సవం జరిగింది. గుంటూరు జిల్లా కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. త్రికూటాచలం శివనామస్మరణతో మార్మోగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కోటప్పకొండ ఆలయంలో ఏర్పాట్లను రెండు రోజుల నుండే స్వయంగా పర్యవేక్షించారు. పంచారామాలైన అమరావతి (గుంటూరు), సోమేశ్వరాలయం (్భమవరం-పశ్చిమగోదావరి), క్షీరరామలింగేశ్వరాలయం (పాలకొల్లు), కుమార భీమేశ్వరాలయం (సామర్లకోట), భీమేశ్వరాలయం (ద్రాక్షారామం) లలో భక్తులు వేల సంఖ్యలో మూలవిరాట్టులను దర్శించుకున్నారు. విశాఖపట్నం సాగర తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరమశివుడికి మహాకుంభాభిషేకం జరిగింది.
శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. స్వామి దర్శనం కోసం సాధారణ భక్తులకు ఐదు గంటల సమయం పట్టింది.
తెలంగాణలోని వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శనానికి దాదాపు మూడు లక్షల మంది భక్తులు వచ్చారు. శివరాత్రి సందర్భంగా ఆర్జిత సేవలు, అభిషేకాలను రద్దు చేశారు. దక్షిణ కాశీగా పేరుపొందిన ఐదో శక్తిపీఠమైన ఆలంపూర్ జోగులాంబదేవీ, బాలబ్రహ్వేశ్వర ఆవమి ఆలయాలకు భక్తులు సోమవారం పెద్దసంఖ్యలో వచ్చారు. శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామమహ్వేరం (అచ్చంపేట సమీపంలో) కూడా శివరాత్రి ఘనంగా జరిగింది. మల్లెతతీర్థం, నల్లమల అటవీ ప్రాంతంలోని బౌరాపురం మల్లికార్జునిడికి చెంచులు ప్రత్యేక పూజలు చేశారు. చెంచుల నేతృత్వంలో ఈ పర్యాయం దేవాదాయ శాఖ ఇక్కడ ఉత్సవం నిర్వహించింది. హైదరాబాద్ సమీపంలోని కీసర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి దర్శనానికి దాదాపు మూడు లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. ఇక్కడ భవాని శివదుర్గ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట సమీపంలోని యానగుంది (కర్నాటక) మాణిక్య గిరి క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖలో తరలి వచ్చారు. ఉభయ రాష్ట్రాల్లోని చిన్న చిన్న శివాలయాలు కూడా శివరాత్రి సందర్భంగా భక్తులతో కళకళలాడాయి. విజయవాడలో పరమేశ్వరుని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్మరిస్తూ సోమవారం పవిత్ర కృష్ణానదిలో జల్లుస్నానాలు ఆచరించి తరించారు. వేకువఝామున 3గంటల నుండే పెద్దసంఖ్యలో భక్తులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పుష్కర ఘాట్ (దుర్గాఘాట్)కు వచ్చి షవర్‌బాత్‌ల కింద స్నానాలు ఆచరించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి, దిగువన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి (పాత శివాలయం), శ్రీ వసంత మల్లిఖార్జున స్వామి (బుద్దావారి గుడి), ప్రకాశం బ్యారేజీ కూడలి ఎదుట శ్రీ విజయేశ్వర స్వామి, యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామివార్లను దర్శించుకొని అభిషేకాలు నిర్వహించుకున్నారు.

పరమశివుడికి
మహాకుంభాభిషేకం

విశాఖపట్నం, మార్చి 7: విశాఖ సాగరతీరంలో సోమవారం మహాశివరాత్రి సందర్భంగా పరమశివుడికి మహాకుంభాభిషేకం అత్యంత వైభవోపేతంగా జరిగింది. టీఎస్సాఆర్ కళాపీఠం ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకంలో భాగంగా కోటి లింగాల ప్రతిష్ఠ, పూజాదికాలు నిర్వహించారు. శ్రీ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శివలింగానికి అభిషేకం జరిపారు. వేకువజాము నుంచే జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు బారులుతీరి అత్యంత భక్తిశ్రద్ధలతో పసుపునీళ్ళతో లింగానికి అభిషేకం చేశారు. సినీనటులు రాజశేఖర్, జీవిత దంపతులు, కృష్ణంరాజు దంపతులు, సుమన్, పరుచూరి గోపాలకృష్ణ, మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, సుబ్బరామిరెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు అభిషేకం నిర్వహించారు.
విశ్వమానవాళి సంక్షేమానికే: సుబ్బరామిరెడ్డి
విశ్వమానవాళి సంక్షేమానికే మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఎన్నో ఏళ్లుగా విశాఖ సాగరతీరంలో మహాశివరాత్రి పర్వదినాన కుంభాభిషేకం నిర్వహిస్తున్నానన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను కాపాడేది దైవానుగ్రహం ఒక్కటేనన్నారు.
ఆదిదేవుని సన్నిధి చేరేందుకే: స్వరూపానందేంద్ర
ఆదిదేవుని సన్నిధి చేరేందుకు శివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్షలు చేయాలని శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. శివం అంటే శుభం, మంగళం, కల్యాణం అన్నారు. ఈ పదాల నుంచే నమఃశివాయ అనే శబ్ధం పుట్టిందన్నారు. కుల, మత, జాతి, వర్గ, లింగ వివక్షల్లేని భక్తికి శివరాత్రి నిదర్శనమన్నారు.

భక్తజనంతో
పోటెత్తిన కోటప్పకొండ

నరసరావుపేట, మార్చి 7: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ శైవక్షేత్రం సోమవారం భక్తజనంతో పోటెత్తింది. కిక్కిరిసిన భక్తులతో కొండ నిండుగా మారింది. దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్విఘ్నంగా సాగాయి. వేలాది మంది భక్తులు స్వామివారిని కనులారా వీక్షించి తరించారు. త్రికూటాచలం శివనామ స్మరణతో మార్మోగింది. ఒకవైపు మెట్లమార్గం, మరోవైపు ఘాట్‌రోడ్డులో భక్తులు వేలాదిగా చేరుకున్నారు. నూతన దంపతులు మెట్లపూజలు చేసి, స్వామివారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. వృద్ధులు, చిన్నారులు ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కొండపైకి చేరుకున్నారు. ఈ ఏడాది వివిఐపి, విఐపిల వాహనాలకు పాస్‌లను పూర్తిగా రద్దుచేయడంతో ఆర్టీసీ ఏర్పాటు చేసిన హైటెక్ బస్సుల్లో కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పినె్నల్లి రామకృష్ణారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, సినీ హీరో శ్రీకాంత్, మురుగుడు హనుమంతురావు, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
అమరారామంలో..
అమరావతి : పంచారామాల్లో అగ్రగామి అమరావతి దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆదివారం రాత్రికే అమరేశ్వరాలయానికి చేరుకున్న భక్తులు తెల్లవారుఝామున పవిత్ర కృష్ణానదిలో, దేవాలయ అధికారులు ఏర్పాటు చేసిన తుంపర్ల స్నానాన్ని ఆచరించి స్వామివారి దర్శనం కోసం బారులుతీరారు.

ఇంద్ర విమానంపై వాయులింగేశ్వరుడు
శ్రీకాళహస్తి, మార్చి 7 : మహాశివరాత్రి సందర్భంగా గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి సోమవారం ఉదయం ఇంద్రవాహనంపై ఊరేగారు. మహాశివరాత్రినాడు ఇంద్రుడు పరమశివుడిని తన వాహనమైన విమానంపై ఊరేగించిన సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. జ్ఞాన ప్రసూనాంబను సప్పరం వాహనంపై ఊరేగించారు. వేద పండితులు, మంగళవాయిద్యాలు, కళాబృందాల మధ్య ఉత్సవం వేడుకగా జరిగింది. రాత్రి నంది వాహనంపై స్వామి, సింహ వాహనంపై అమ్మవారు ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.