రాష్ట్రీయం

నాకు ప్రజలే తోడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సామాన్యుడి ప్రభుత్వం ఏర్పడినట్టేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. యువతకు దిశానిర్దేశం చేయడానికి, ఆడపడుచులకు అండగా నిలబడటానికి, కులమత భేదం లేకుండా ప్రజలందరికీ సమన్యాయం చేయడానికి జనసేన పాటుపడుతుందన్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఆర్థికంగా ఎంతో బలమైన, పత్రికలు, ఛానళ్లు ఉన్న తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పోటీపడాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి 25 నుండి 40 కోట్ల వరకు ఖర్చుచేసి, మళ్లీ మనందరినీ కొనేయడానికి టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. ఇంతటి బలమైన పార్టీలను ఎదుర్కోవడానికి వామపక్షాలతో కలిసి ముందుకు వస్తున్న జనసేనకు ప్రజలంతా అండగా నిలబడాలని కోరారు. తనకు ఛానళ్లు, పత్రికలు లేవని, డబ్బు లేదని, ప్రజలే తనకు సర్వస్వమన్నారు. సభకు వచ్చిన యువత అంతా సీఎం సీఎం అని నినదిస్తే తాను ముఖ్యమంత్రి అయిపోనని, అంతా బాధ్యతగా ఓటర్లుగా నమోదుచేసుకుని, వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఓటు వేస్తేనే అది సాధ్యపడుతుందన్నారు. చంద్రబాబు తరహాలో 2019లో మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని, ఆ తర్వాత ఆయన కుమారుడిని
మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని తాను కోరబోనన్నారు. అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలాగా ముఖ్యమంత్రిని చేస్తేనే సమస్యలు తీరుస్తానని చెప్పబోనన్నారు. తాను, తన పిల్లల బాగు కోసం ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలేదని, ఇప్పుడున్న యువతతోపాటు వారి బిడ్డల భవిష్యత్తు కూడా ఉన్నతంగా ఉండాలనే ఆశయం తనలో ఉందన్నారు. ముఖ్యమంత్రి పదవి చాలా బాధ్యతతో కూడుకున్నదని, అందరికీ అండగా నిలబడతాననే నమ్మకం, విశ్వాసం ఉంటే జనసేనకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. డబ్బు మాత్రమే సంపాదించాలంటే ఏడాదికి కనీసం రూ.25 కోట్లు ఆదాయపన్ను చెల్లించేంత తాను సినిమాల్లోనే సంపాదించగలనన్నారు. అయితే తాను ఒక చేత్తో సంపాదించిన కోట్లన్నీ, మరో చేత్తో వదిలేసుకునే వచ్చానన్నారు. కోట్లు సంపాదించడంలో తనకు ఆనందం ఉండదని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలోనే తనకు ఆనందం ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రజల కన్నీళ్లు, కష్టాలే కనిపిస్తున్నాయని, వాటిని తొలగించాలనేదే తన ధ్యేయమన్నారు.
ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు మొహం చాటేస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రజల నమ్మకం కోల్పోయిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే పూటకో మాటతో తెలుగుదేశం పార్టీ కూడా నమ్మకం కోల్పోయిందన్నారు. నిన్న మొన్నటి దాకా తిట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నికల్లో మద్దతిచ్చిన చంద్రబాబు, మళ్లీ మోదీతో కలిసిపోయినా ఆశ్చర్యం లేదన్నారు. ఇక వైసీపీ జగన్ సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా బలమైన సామాజిక, రాజకీయ మార్పు రావాలని కోరుకుంటున్నారని, ఆ మార్పుని తీసుకొచ్చి, ప్రజలందరికీ జనసేన అండగా ఉంటుందని స్పష్టంచేశారు. సభలో జనసేన పార్టీ నాయకులు ఇర్రింకి సూర్యారావు, యర్రా నవీన్, కనకరాజు సూరి, కలవకొలను తులసీ రావు, బర్రే జయరాజు, మైల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సభలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్