రాష్ట్రీయం

పోటెత్తిన గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 20: ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద సోమవారం ఉదయం నుంచీ వరద నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. గోదావరి నది ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొత్తం 175 గేట్లను ప్రవాహ మట్టానికి మించి ఎత్తి వేసినపుడు 11.75 అడుగులు నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. సోమవారం ఉదయం పదకొండున్నర గంటలకు గోదావరి నది మట్టం 13.75 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 13.90 అడుగుల నీటి మట్టంలో గోదావరి ప్రవహిస్తూ 13 లక్షల 9వేల వేల 373 క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి పోతున్నాయి. భద్రాచలం వద్ద 43.60 అడుగులు నీటి మట్టం నుంచి 44.4 అడుగులకు పెరిగింది. వేగంగా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ఈ రాత్రి కల్లా గోదావరి నది మూడో ప్రమాద హెచ్చరికస్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో హై అలెర్ట్ కొనసాగుతోంది. అఖండ గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో ఎగువ ప్రాంతంలోని
ఎటపాక, కూనవరం, చింతూరు, విఆర్ పురం, దేవీపట్నం మండలాల్లోనూ, బ్యారేజీ దిగువ గోదావరి నదీ పాయల నడుమ కోనసీమ ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేశారు. స్థానికంగా కూడా భారీ వర్షాలు పడుతుండటంతో పంటచేలు కూడా ముంపునకు గురయ్యే పరిస్థితి చోటుచేసుకుంది. బ్యారేజీ ఎగువ ప్రాంతంలోని అఖండ గోదావరి పరీవాహక పాపికొండలు జాతీయ అటవీ ప్రాంతంలోనూ, కొండ కోనల్లో భారీగా వర్షాలు పడుతుండటంతో కొండవాగులు, పాములేరు, సోకులేరు, పింజరికొండ వాగు, సీతపల్లివాగు పొంగుతున్నాయి. గోదావరి ఉపనది శబరి ప్రధానంగా వరద పోటుతో ఉరకలేస్తోంది. కోనసీమ ప్రాంతంలోని ఏటిగట్లను రెవెన్యూ, ఇరిగేషన్ యంత్రాంగం పర్యవేక్షిస్తున్నారు. పలుచోట్ల లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజన ప్రాంతంలోని దేవీపట్నం మండలంలో ప్రత్యేక బృందాలను మకాం వేయించారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్, ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలోనూ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
విలీన మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. శబరి నది ఉద్ధృతి పెరగడంతో కూనవరం వద్ద రహదారి దిగ్బంధమైంది. దీంతో భద్రాచలం రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు వరద పోటు అధికంగా ఉండటంతో గోదావరి నదిపై రాజమహేంద్రవరం సమీపంలో ఉన్న ఒక వైపు ఆత్రేయపురం, నిడదవోలు వైపు వెళ్లే బ్యారేజీ బ్రిడ్జి రోడ్డుపై వాహనాలను నిలుపుదల చేశారు. కార్లను, టూవీలర్లను మాత్రమే వెళ్లనిస్తున్నారు. మరో వైపు గామన్ వంతెనపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. 16వ నెంబర్ జాతీయ రహదారిపైనే ట్రాఫిక్ సజావుగా వెళుతోంది.
జిల్లాలో అమలాపురం, రాజమహేంద్రవరం, రామచంద్రపురం, ఎటపాక, రంపచోడవరం డివిజన్లు వరద ప్రభావానికి గురయ్యాయి. జిల్లాలో మొత్తం 19 మండలాల్లో 44 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. జిల్లాలో 14 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2,541 మందికి పునరావాసం కల్పిస్తున్నామని, దేవీపట్నం మండలంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా వుంచామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. రంపచోడవరం ఐటిడిఎలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పీవో నిషాంత్‌కుమార్ 24 గంటల పాటు సమీక్షిస్తున్నారు. అమలాపురం డివిజన్‌లో ఎపుడు ఎటువంటి సమస్య ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా అప్రమత్తమం చేశామని, ప్రత్యేక సహాయక బృందాలను కూడా సిద్ధం చేశామని ఆర్డీవో వెంకటరమణ చెప్పారు. నాటు పడవలను రద్దు చేశామన్నారు.
ఇదిలావుండగా గత 48 గంటలుగా గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. ఈ దశలో మళ్లీ వరద ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కూడా భారీగా గోదావరి ప్రవాహం పెరుగుతోంది. కాళేశ్వరంలో 17.60 మీటర్లు, పేరూరు 10.98, దుమ్ముగూడెం 11.53, కూనవరం 18.24, కుంట 10.83, కొయిదా 22.90, పోలవరం 13.30, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద 16.74 మీటర్ల మట్టంలో గోదావరి నది ఉరకలు వేస్తోంది. అఖండ గోదావరి నది వరద ఉద్ధృతితో రాజమహేంద్రవరంలోని స్నానఘట్టాల్లోకి జలాలు భారీగా చేరుకున్నాయి. కొన్ని స్నాన ఘాట్‌లలో ఉపాలయాలు నీట మునిగాయి.

చిత్రాలు.. రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద గోదావరి పరవళ్లు

*వరదనీటిలో కొవ్వూరు గోష్పాద క్షేత్రం