రాష్ట్రీయం

అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజన్సీ, మెట్ట ప్రాంతాలు ఆదివారం కురిసిన అధిక వర్షాలకు అతలాకుతలమయ్యాయి. జల్లేరు, ఎర్రకాల్వ, బయనేరు, సంఘం వాగు, ఇతర కొండవాగులు పొంగడంతో రహదార్లకు గండ్లు పడ్డాయి. వంతెనలు కూలిపోయాయి. మున్సిపల్ పట్టణమైన జంగారెడ్డిగూడెంకు, మండల కేంద్రమైన బుట్టాయగూడెంకు ఇతర ప్రాంతాలతో రహదారి సంబంధాలు తెగిపోయాయి. జంగారెడ్డిగూడెం పట్టణానికి తూర్పున కొవ్వూరు రోడ్డులో బ్రిటీష్ పాలకులు నిర్మించిన బెయిలీ వంతెన బయనేరు వాగు ఉద్ధృతికి సోమవారం కుప్పకూలిపోయింది. దీంతో రాజమండ్రి ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి ఉద్ధృతంగా ప్రవహించిన జల్లేరు వాగు జంగారెడ్డిగూడెం పట్టణానికి పశ్చిమ దిశగా ఉన్న మాతన్నగూడెం వద్ద జల్లేరు వంతెన పట్టక వరద నీరు పక్కగా పొలాల్లోకి మళ్లిపోయింది. జల్లేరు వంతెన దాటిన తరువాత తాడువాయి పంచాయతీ పరిధిలో 30 అడుగల మేర జాతీయ రహదారికి గండి పడింది. దీంతో తల్లాడ - దేవరపల్లి రహదారిలో రాకపోకలు పూర్తిగా బంద్ అయాయి. జంగారెడ్డిగూడెం నుండి ఖమ్మం,
భద్రాచలం, హైదరాబాద్ వెళ్లే మార్గం మూసుకుపోయింది. మండలంలోని పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన ప్రదేశంలో వేసిన డైవర్షన్ రోడ్డు వాగు ఉద్ధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఏజన్సీ ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి ఏజన్సీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ గుడి వద్దకు వెళ్ళిన దాదాపు 600 నుండి 700 మంది వాగులు పొంగడంతో కొండలపై చిక్కుకు పోయారు. పోలీసుల ఆధ్వర్యంలో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఐటిడిఎ, ఫైర్ సిబ్బంది సహాయంతో వారిని సోమవారం ఉదయం రక్షించి జంగారెడ్డిగూడెం తీసుకువచ్చి వారి గమ్యస్థానాలకు చేర్చారు. జంగారెడ్డిగూడెం మండలంలోని కొంగువారిగూడెం వద్ద శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో నీటిపారుదల అధికారులు ఆందోళనకు గురయ్యారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 83.50 మీటర్లు కాగా, ఆదివారం రాత్రి ఒక్కసారిగా పూర్తి స్థాయిని దాటిపోవడంతో ప్రాజెక్టు స్పిల్‌వేలో నాలుగు గేట్లను ఎత్తివేసి వరద నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఒక గేటు మొరాయించడంతో మూడు గేట్లను ఎత్తివేశారు. మొరాయించిన గేటు మీదుగా వరద నీరు పొర్లిపోతోంది. ప్రాజెక్టులోకి సోమవారం ఉదయం 8 గంటలకు 70 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, స్పిల్‌వే నుండి 35 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి కాలువ గేట్లు ఉన్న ప్రాంతంలో కరకట్టకు బీటలు వారడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. రెవెన్యూ, పోలీస్, నీటిపారుల శాఖ అధికారులు కరకట్ట తెగిపోకుండా అత్యవసర చర్యలు మొదలు పెట్టారు. కరకట్ట తెగిపోతే దాదాపు 50 గ్రామాలు నీట మునిగే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ప్రాజెక్టుకు దగ్గరలోని దేవులపల్లి, పుట్లగట్లగూడెం, నాగులగూడెం, లక్కవరం, పంగిడిగూడెం, పేరంపేట గ్రామాలను ఖాళీ చేయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎర్రకాలువ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం వల్ల ప్రాజెక్టు ఆయకట్టు భూములతో పాటు నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలాల్లోని పంట పొలాలు నీట మునిగిపోతాయి. లక్కవరం వద్ద ఎర్రకాలువపాటు వెదుళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎర్రకాలువ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ సందర్శించి, నీటిపారుదల అధికారులతో వరద పరిస్థితిని సమీక్షించారు. జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాశ్ స్థానిక డీఎస్పీ చిటికెన మురళీకృష్ణతో కలిసి జల్లేరు వాగు ఉద్ధృతికి జాతీయ రహదారి గండి పడిన ప్రదేశాన్ని, బయనేరు వంతెన కూలిపోయిన ప్రదేశాన్ని సందర్శించి, అధికారులతో సమీక్షించారు.

చిత్రం..*వరద ఉద్ధృతికి కూలిపోయిన బయనేరు బెయిలీ వంతెన