ఆంధ్రప్రదేశ్‌

యనమల బడ్జెట్‌లో సాగుకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ముచ్చటగా మూడో సంవత్సరం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించేందుకు రంగం సిద్ధమైంది. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ముందు లాంఛనంగా దీనికి మంత్రివర్గం ఆమోదం కావాల్సి ఉంటుంది. అందువల్ల ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతోంది. ‘పేపర్‌లెస్’ బడ్జెట్‌గా దీనికి పేరు వస్తోంది. గతంలో అందరికీ బడ్జెట్ పుస్తకాలు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం కాంపాక్ట్‌డిస్క్ (సిడి) లను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రం వివిధ శాఖలకోసం రూపొందించిన బడ్జెట్ పుస్తకాలను ఇస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి యనమల 1,32,000 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం కంటే ఇది 19 వేల కోట్ల రూపాయలు అధికం. గత ఏడాది ప్రణాళిక ఖర్చుల కోసం కేవలం 34 వేల కోట్ల రూపాయలు (30 శాతం) కేటాయించగా,ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రణాళికా పద్దులకు 45నుండి 50వేల కోట్లు ప్రతిపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాష్ట్రాన్ని కరవురహిత రాష్ట్రంగా మార్చాలని భావిస్తున్నట్టు ఇటీవల పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అంటే రైతులు కేవలం పంటలపైనే ఆధారపడకుండా వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలను (పాడి, పశుగణాభివృద్ధి, ఆక్వా, కోళ్లపెంపకం, ఈముకోళ్లపెంపకంతో పాటు పళ్లు,పూలు, కాయగూరల తోటల పెంపకం తదితరాలు) చేపట్టేందుకు ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఈ రంగాలకు భారీ ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాలని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని భావిస్తున్నారు. రైతురుణ విమోచన కోసం ఏర్పాటు చేసిన రైతు సాధికారత సంస్థను బలోపేతం చేయాలని, గత ఏడాది కంటే కనీసం రెండు నుండి మూడు వేలకోట్ల రూపాయలు అధికంగా నిధులు కేటాయించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతల్లో రాజధాని అమరావతి నిర్మాణం ప్రధానంగా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన నిధులు సమకూర్చుకుని, యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగేలా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని తెలిసింది. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు రెండో ప్రాధాన్యత ఇచ్చేలా యనమల బడ్జెట్‌ను రూపొందించారని తెలుస్తోంది. రాజధాని మార్పు, సచివాలయంతో సహా హెచ్‌ఓడి కార్యాలయాల మార్పు తదితర పనుల వల్ల ప్రణాళికేతర వ్యయం కూడా ఈ పర్యాయం బాగానే పెరిగే అవకాశాలున్నాయి. సాధారణ వార్షిక బడ్జెట్‌ను యనమల శాసనసభలో ప్రతిపాదించిన తర్వాత, భోజన విరామానంతరం వ్యవసాయ బడ్జెట్‌ను సంబంధిత మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రతిపాదిస్తారు. 2016-17 సంవత్సరానికి 18 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది.

మీడియా పాయంట్‌వద్ద విలేఖరులతో మాట్లాడుతున్న ఏపి ఆర్థికమంత్రి యనమల