రాష్ట్రీయం

ఏడుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 1: కడప-కర్నూలు హైవేపై చెన్నూరు మండలం దౌలతాపురం క్రాస్ వద్ద ఏడుగురు ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరిలో ఇద్దరు చైనా, మరో ఇద్దరు టిబెట్‌కు చెందినవారు. ఓఎస్‌డి (ఆపరేషన్స్) రాహుల్‌దేవ్ శర్మ జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం వివరాలు తెలియజేస్తూ స్మగ్లర్లకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇటీవల పలువురు అంతర్జాతీయ, అంతర్‌రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా అరెస్టయిన స్మగ్లర్ల విచారణలో వారికి అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది.
వీరి నుంచి రూ.15లక్షలు విలువైన 768 కిలోల బరువున్న 30 ఎర్రచందనం దుంగలతోపాటు ఫోర్డ్ కారు, ల్యాప్‌ట్యాప్ ,11 సెల్ ఫోన్లు, విదేశీ కరెన్సీతోపాటు రూ.10వేలు దేశీయ నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఝూంగ్‌జి (చైనా,34), సూలీ (చైనా,27), పసాంగ్ సెరింగ్ న్యూఢిల్లీ (టిబెటిన్, 37), సోనమ్ సెరిగ్ న్యూఢిల్లీ (టిబెటిన్,27), మనీష్ పాల్ లూద్రా (31) న్యూఢిల్లీ, రఘునాధ్ ధంగార్ (మద్యప్రదేశ్,32), ముఖేష్ దాస్ బైరాగి (మద్యప్రదేశ్,31) ఉన్నారు. నిందితుల్లో ఒకడైన ఝూంగ్‌జీ చైనాదేశంలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన వాడు. చైనాలోని పవర్ బ్యాంక్స్ (సెల్‌ఫోన్ కంపెనీ) సేల్స్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి హుజియాన్ రాష్ట్రంలోని పుతియాన్ నగరంలో ఎర్రచందనం ఫర్నిచర్ తయారీ యూనిట్ కలిగివున్న లింగ్ పింగ్ చెంగ్ అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నాయి. లింగ్ పింగ్ చెంగ్ ఇతడ్ని భారత్ నుంచి చైనాకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేలా ప్రోత్సహించారు. సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు ఆకర్షితుడై ఢిల్లీ పరిసర ప్రాంతాలనుంచి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసేవాడు.
ఇతడు ఢిల్లీ , హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాది రాష్ట్రాల స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఇతనికి ఇటీవల కడప జిల్లా పోలీసులు అరెస్టు చేసిన అంతర్జాతీయ స్మగ్లర్లు మునియప్పన్ అలియాస్ విష్ణ్భుయ్, బద్రుల్ హసన్ అలియాస్ హసన్‌బాయ్‌లతో సంబంధాలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇతను 38 టన్నుల ఎర్రచందనం దుంగలను చైనాకు తరలించి, లింగ్‌పింగ్ చెంగ్‌కు విక్రయించి కోట్లాదిరూపాయలు ఆర్జించాడు. ఇతను చైనాకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ లింగ్‌పింగ్ చెంగ్‌కు ప్రధాన అనుచరుడు. చైనా దేశంలోని మరికొందరి ఎర్రచందనం స్మగ్లర్లకు కూడా ఇతడు దుంగలు సరఫరా చేసేవాడు. భారత్‌లో స్మగ్లర్ల నుంచి టన్నుకు రూ.20 నుంచి 25లక్షలకు కొనుగోలు చేసి, చైనాలో రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు విక్రయించేవాడు. మరో నిందితుడైన సూలీ చైనా దేశంలోని హూనాన్ ప్రావిన్స్‌కు చెందిన వాడు. ఇతని స్నేహితుడైన ఝాంగ్ జి పనిచేసే పవర్ బాక్స్ సెల్ ఫోన్ కంపెనీలోనే సేల్స్‌మెన్‌గా పనిచేసే వాడు. చైనాకు చెందిన లింగ్‌పింగ్ చంగ్‌తో సంబంధాలు ఏర్పరచుకుని భారత్ నుంచి చైనాకు దుంగలు తరలించే వాడు. మరో నిందితుడు పసాంగ్ సేరింగ్ టిబెట్‌కు చెందిన వాడుకాగా, కర్నాటక రాష్ట్రంలోని మైసూర్ కుషాల్ నగర్ టిబెటన్ల శరణార్థి శిబిరంలో ఉంటూ ఆధ్యాత్మిక శిక్షణ లామా కోర్సు పూర్తిచేశాడు. తర్వాత పూజారి ఉద్యోగం చేస్తూ ట్యాక్సీని అద్దెకు తీసుకుని యాత్రికులను తరలించే డ్రైవర్‌గా పనిచేసేవాడు.
ఢిల్లీ , హర్యానా, ఉత్తరప్రదేశ్‌లతోపాటు టిబెట్‌లోని ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వారినుంచి ఎర్రచందనం దుంగలు కొనుగోలుచేసి చైనా స్మగ్లర్లకు అమ్మేవాడు. 2011 నుంచి ఎర్రచందనం స్మగ్లర్లతో ఇతడికి సంబంధాలు ఉన్నాయి. మరో నిందితుడు సోనమ్ సెరింగ్ టిబెట్‌లో ప్రాధమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. భారతదేశంలోని ఉత్తరఖాండ్ రాష్ట్రానికి వలస వచ్చి 10వ తరగతి వరకు చదువుకొని, ఢిల్లీలో ఓ ప్రైవేట్ కంపెనీలో కేక్ మేకర్‌గా పనిచేసేవాడు. కొందరు ఎర్రచందనం స్మగర్లతో సంబంధాలు ఏర్పరచుకుని చైనాకు ఎర్రచందనం విక్రయించేవాడు. మరో నిందితుడు మనీష్ పాల్ లూథ్రా ఢిల్లీకి చెందిన ఆమ్‌వే కంపెనీలో పనిచేస్తూ తరచు మజ్నూ-కా-టిల్లా ప్రాంతానికి వెళ్తు పసాంగ్ సెరింగ్, సోనమ్ సేరింగ్‌లతో సంబంధాలు ఏర్పరచుకుని ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరాడు.
ఇతడు హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి దుంగలు కొనుగోలు చేసేవాడు. మరో ఇద్దరు నిందితులైన రఘనాధ్ ధంగార్, ముఖేష్ దాస్ బైరాగిలు మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్నం జిల్లాకు చెందినవారు కాగా, ఢిల్లీకి చెందిన అంతర్ రాష్ట్ర స్మగ్లర్లకు డ్రైవర్లుగా పనిచేసేవారు. ఢిల్లీకి చెందిన స్మగ్లర్ల సూచనల మేరకు ఎర్రచందనం దుంగలను ఆయా గమ్యస్థానాలకు చేర్చేవారు. వీరికి రూ.25వేలు నుంచి రూ.30వేలు ఇచ్చేవారు. ఎర్రచందనం దుంగలను ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, నేపాల్,టిబెట్ల స్మగ్లర్ల నుంచి కొనుగోలు చేసి వాటిని పండ్లు, కూరగాయల మాటున లారీల్లో నేపాల్, టిబెట్ మీదుగా చైనాకు తరలించేవారు.
చాలాసార్లు వీరు దుంగలను కొబ్బరిపీచు మాటున చైనాకు తరలించేవారు. సముద్ర మార్గం ద్వారా ఓడల్లో కంటైనర్ల ద్వారా కలకత్తా నుంచి హాంకాంగ్, చైనా, చైనా నుంచి దుబాయ్‌లకు రవాణా చేసేవారు. హవాలా ద్వారా స్మగ్లర్లు ఢిల్లీలో డబ్బులు అందజేసేవారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ డిఎస్పీ హరినాధబాబు, సిఐలు టి.వెంకటేశ్వర్లు, యు.సదాశివయ్య, ఎస్‌ఐలు ఎస్‌ఎం బాష, ఎం.రాజరాజేశ్వరరెడ్డి, హేమకుమార్, వి.నాగరాజు, ఎస్.రోషన్, డి.హాజివల్లి, ఆర్‌ఎస్‌ఐ విజయనర్సింలు, సిబ్బందిని ఓఎస్‌డి రాహుల్‌దేవ్ శర్మ అభినందించారు.

మంగళవారం కడప పోలీసు కార్యాలయంలో అరెస్టయన ఎర్రచందనం స్మగ్లర్ల
వివరాలు విలేఖరులకు వెల్లడిస్తున్న ఓఎస్‌డి (ఆపరేషన్స్) రాహుల్‌దేవ్ శర్మ