రాష్ట్రీయం

ఆతిథ్యంగా అన్న భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 6: ఆకలి దప్పులులేని ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ 12వ సమావేశాలు గురువారం ప్రారంభమైన సందర్భంగా మాట్లాడిన ఆయన తొలిరోజు ప్రశ్నోత్తరాల అనంతరం దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మృతిపట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. దాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించి రెండు నిమిషాలు వౌనం పాటించారు. అనంతరం అన్న క్యాంటీన్లపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా అన్న క్యాంటీన్ల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్యాంటీన్లలో పరిశుభ్రత, పచ్చదనం, ఆతిథ్యం కోసం ఇతర రాష్ట్రాలతో పాటు కార్పొరేట్ సంస్థలలో అధ్యయనం జరిగిందని చెప్పారు. 204 అన్న క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటి వరకు వంద పూర్తయ్యాయని, వచ్చేనెలలో మిగిలినవి చేపడతామన్నారు. అదనంగా మరో 96 క్యాంటీన్లతో కలుపుకుని మొత్తం 300 క్యాంటీన్లను ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్‌టీ రామారావు అన్నదాన కార్యక్రమాన్ని అమలు చేశారని, ప్రస్తుతం రూ 500 కోట్ల కార్పస్ ఫండ్‌తో నిరంతర అన్నదానం జరుగుతోందని చంద్రబాబు గుర్తుచేశారు. పేదవాడికి పట్టెడన్నం నినాదంతో ఎన్టీఆర్ కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశపెడితే అది సాధ్యపడదని అంతా విమర్శించారని, అదే స్ఫూర్తితో తమ ప్రభుత్వం రూపాయికే కిలోబియ్యం పథకాన్ని కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి పంపిణీ చేస్తోందని తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలో కోటి 47 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన డొక్కా సీతమ్మ అందించిన సేవలను ముఖ్యమంత్రి ప్రస్తుతించారు. పేదలు కడుపునిండా అన్నంతిని తిరిగే పరిస్థితులు రావాలన్నారు. అన్న క్యాంటీన్లను 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్నిరకాల హంగులతో నిర్మిస్తున్నామని, ఒక్కో ప్లేట్‌కు 70 రూపాయలు ఖర్చవుతున్నా రాష్ట్రంలో ఆకలి దప్పులకు తావులేకుండా చేయాలనే లక్ష్యంతోనే వీటిని కొనసాగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆహార పదార్థాల నాణ్యత, తయారీలో ఏ మాత్రం రాజీపడే ప్రసక్తిలేదన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందిస్తోందని ప్రశంసించారు. సబ్సిడీ భోజనం పెడుతున్నామనే భావన నిర్వాహకుల్లో కనిపించరాదని, పేదలకు ఆతిథ్యంతో భోజనం అందించాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. నిరుపేద కుటుంబాలు ఆత్మగౌరవంతో ఆహారం భుజించే విధంగా క్యాంటీన్ల నిర్వహణ ఉంటుందన్నారు. కేంద్రాలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 34 లక్షల మంది భోజనం
చేశారని, సగటున రోజుకు లక్ష మంది వస్తున్నారని వివరించారు. మూడు జోన్లుగా వర్గీకరించి నిరంతర పర్యవేక్షణలో కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో 74, కోస్తాలో 72, రాయలసీమలో 58 ఏర్పాటు చేస్తామన్నారు. మునిసిపల్ పట్టణాలతో పాటు ప్రతి నియోజకవర్గంలోని ముఖ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. దేశ జనాభాలో ప్రతి 9 మందిలో ఒకరు పస్తులు ఉంటున్నారని, 19 కోట్ల 80 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని, దేశ జనాభాలో ఇది 14.5 శాతం కాగా ఇందులో 21.5 శాతం మంది పిల్లలు ఉన్నట్లు గత ఏడాది నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు. భారత ప్రభుత్వం ఆహారానికి రూ 50వేల కోట్లు ఖర్చుచేస్తోందని కూడా సర్వేలు గుర్తించాయన్నారు. ‘రాష్ట్రంలో ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదు..అర్ధాకలితో ఉండరా’దనే ఉద్దేశ్యంతోనే అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టామన్నారు. క్యాంటీన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఐవీఆర్‌ఎస్ ద్వారా నిర్వహణ తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రపంచానికే అన్న క్యాంటీన్లు ఆదర్శమన్నారు. పేదల అభ్యున్నతికి వెయ్యి రూపాయల పింఛన్, బీమా సదుపాయాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రాల నిర్వహణకు దాతృత్వంతో విరాళాలందించాలని ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను కోరారు. డబ్బు ఎంత సంపాదించామనేది ముఖ్యంకాదని, ఎంతవరకు సేవలందించామనే దృక్పథం ప్రతి ఒక్కరిలోనూ ఉండాలన్నారు. సేవా కార్యక్రమాలను బాధ్యతగా పరిగణించాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి ‘శక్తికొలదీ స్పందించండి.. ప్రతి నియోజకవర్గంలో కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ రూపొందించండి..మీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు కడుపునిండా భోజనం పెట్టండ’ని హితవు పలికారు.