రాష్ట్రీయం

నిరుద్యోగులకు బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు డీఏల్లో ఒకదానిని చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది జనవరి 7వ తేదీ నుండి వర్తించే విధంగా డీఏ చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సవరించిన రేట్లతో పెన్షనర్లకు కూడా కరవుభత్యం(డీఏ) చెల్లించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. కాగా పార్టుటైం అసిస్టెంట్లు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు తాత్కాలిక పెంపు (అడ్‌హాక్ ఇంక్రీజ్) ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. డీఏ చెల్లింపు వల్ల ప్రభుత్వంపై రూ 627 కోట్ల భారం పడనుంది. కాగా, ఈనెల 14న ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు ముహూర్తం కుదిరింది. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం అక్టోబర్ 2 నుండి చెల్లించనున్న నిరుద్యోగ భృతికి అర్హుల జాబితాను ఖరారు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. పెన్షన్లు పొందే వారి పిల్లలకు సైతం నిరుద్యోగ భృతి ఇవ్వాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. డీ ఫార్మసీ చదివిన వారిని కూడా నిరుద్యోగ భృతికి అర్హులుగా గుర్తించాలని మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ప్రభుత్వ విధానంపై శాసనసభ, శాసనమండలి సభ్యులకు అవగాహన
కల్పించేందుకు ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ఉపకరించే ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ వెబ్‌సైట్‌ను రియల్‌టైమ్‌లో మంత్రిమండలి సభ్యులు పరిశీలించారు.
రాజధాని ప్రాంతంలో భూములులేని కుటుంబాలకు ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్లను ప్రతి మూడేళ్ల కోసారి 10 శాతం పెంచాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి సానుకూలంగా స్పందించింది. ఏపీ స్టేట్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్యవైశ్య యువత స్వయం ఉపాధి పొందేందుకు రుణాలు, విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థికసాయాన్ని కార్పొరేషన్ ద్వారా అందిస్తారు. కాగా ప్రభుత్వం కొనుగోలు పేరుతో ఈ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ఏర్పాటుచేస్తోంది. దీనికోసం ఎలక్ట్రానిక్ పాలసీలో కొన్ని మార్పులుచేశారు. దీనికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (ఐఐడీటీ)ను సెక్షన్ 8 సంస్థగా ఏర్పాటు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పెట్టుబడి, నిర్వహణ వ్యయం కింద వచ్చే రెండేళ్లకు గాను రూ 97.95 కోట్లు మంజూరు చేయాలనే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఐఐడీటీ లాభాపేక్షలేని సెక్షన్ 8 సంస్థగా నమోదు చేస్తారు. ఐఎస్‌బీ తరహాలో దీన్ని తీర్చిదిద్దుతారు. సెక్షన్ 8 సంస్థగా నమోదు కావటంతో నిర్దిష్ట అధీకృత నిర్వహణా వ్యవస్థ, స్పష్టమైన విధాన నిర్ణయాలతో పారదర్శక, జవాబుదారీ సంస్థగా రూపొందుతుందనేది ప్రభుత్వ భావన. ఐఐడీటీలో 2019 విద్యా సంవత్సరం నుంచి కొత్త ప్రోగ్రామ్స్ ప్రవేశపెడతారు. మొత్తం 250 మంది విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. 2021 నాటికి మొత్తం 400 మందికి అవకాశం ఉంటుందని అంచనా. పేరొందిన సంస్థలు దీనికి మెంటార్‌గా ఉంటాయి. పరిశ్రమ నిపుణులు సలహాదారుగా వ్యవహరిస్తారు. దేశంలో ఈ తరహా సంస్థ ఏర్పాటు ఇదే ప్రథమం.
ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ
ఆక్వా రైతాంగానికి యూనిట్‌కు రెండు రూపాయల చొప్పున విద్యుత్ రాయితీని ఏడాదిపాటు అందించాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచే ఇది అమలులోకి వస్తుంది. మొత్తం 94వేల 913 మంది రైతులు ఈ రాయితీ వల్ల ప్రయోజనం పొందనున్నారు.
విజయవాడ- సింగపూర్ మార్గంలో ఇండిగో సంస్థ ద్వారా వారానికి రెండు రిటర్న్ ఫ్లయిట్లను నడిపేందుకు ప్రోత్సాహకాలు అందించే విషయమై మంత్రిమండలిలో చర్చకు వచ్చింది. దీంతో పాటు విజయవాడ- పుట్టపర్తి మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు మంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ- నాగార్జునసాగర్ మార్గంలో విమాన సేవలు లాభదాయకం కాదనే అభిప్రాయం వ్యక్తం కావటంతో నైన్‌సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్ నడిపేందుకు మంత్రిమండలి ఆమోదించింది.
కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో నవజాత శిశువుల విభాగాన్ని మంజూరుచేసే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఎన్టీఆర్ కేన్సర్ కేర్ ప్రాజెక్టును టాటా ట్రస్ట్ భాగస్వామ్యంతో నెలకొల్పుతూ జారీచేసిన జీవో 126ను మంత్రి వర్గం ఆమోదించింది. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చినపండూరు గ్రామంలో అపోలో టైర్స్ సంస్థ ఏర్పాటుచేసే ప్లాంట్ కోసం అదనంగా కేటాయించిన 56.63 ఎకరాల భూమి ధరకు సవరణ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ముందుగా నిర్ణయించినట్లు ఎకరం రూ 14.03 లక్షలు కాకుండా కొత్త జీవో ప్రకారం ఎకరానికి రూ 11 లక్షలు ధర స్థిరీకరించారు. కాగా గాంధీజీ మునిసిపల్ హైస్కూలులో మొదటి అంతస్తును గాంధీజీ మహిళా కళాశాల కోసం బీఆర్‌జీకెవీఎస్‌వి ఎడ్యుకేషనల్ సొసైటీకి షరతులకు లోబడి 25 ఏళ్లపాటు లీజుకు ఇచ్చే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. ఈ కళాశాలలో 25 శాతం సీట్లను మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాల విద్యార్థినులకు యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుంది. విజయవాడ లబ్బీపేట బృందావన్ కాలనీలో మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం నిర్మాణానికి 1052.86 చదరపుగజాల మునిసిపల్ స్థలాన్ని నామమాత్రపు ధరకు కేటాయించే ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ విలువ కంటే కనీసం 25 శాతం తక్కువ ధరకు ఇవ్వాలనే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం