రాష్ట్రీయం

ఆశీర్వదిస్తే మరింత ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 7: కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల ముదనష్టపు పాలన వల్ల దేశం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అట్టడుగున ఉన్నాయని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూ మరోమారు ప్రజల ముందుకు వెళుతున్నామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే, రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళతానని అన్నారు. ప్రభుత్వ పదవి కాలం మరో ఏడు మాసాలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల అవాకులు, చవాకుల వల్లనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని, ఒకరకంగా ముందస్తు ఎన్నికలకు వారే కారణమని ఆరోపించారు. సెంటిమెంటుగా తనకు ఎంతో కలిసివచ్చిన నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్‌లో శుక్రవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరై, వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల పిచ్చి కూతలు వింటుంటే రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ నిలిచిపోతుందోనన్న ఆందోళన కలుగుతున్నదని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధమంటూ కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు ప్రగల్భాలు పలికాయని, అందుకే తాము ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయించామని అన్నారు. చిప్పలు చేతిలో పట్టుకుని ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లి టికెట్లు అడుక్కునే దురవస్థలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ నేతలను చూస్తే ఇక్కడి కాంగ్రెస్ నాయకుల లాగులు తడుస్తాయని ఎద్దేవా చేసారు. యాభై ఏళ్లుగా గులాములుగానే బతుకులీడుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఆకలితో ఆవురావురుమంటున్నారని, వారికి అవకాశం కల్పిస్తే మొత్తం దోచుకుంటారని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా అప్పటి కాంగ్రెస్ సర్కారు వివక్ష చూపిస్తే, తాము అధికారంలోకి వచ్చాక దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వేలం పాట మాదిరిగా రెండు వేల పింఛన్లు ఇస్తామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘మీరు రెండు వేలు ఇస్తే మేము రెండు వేల ఒక వంద ఇస్తామంటాము. అప్పుడేం మాట్లాడుతారు’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల నోటి నుండి పింఛన్లు రెండు వేలు ఇస్తామని చెప్పడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయల పింఛనే ప్రధానకారణమని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మత ఘర్షణలు, కర్ఫ్యూలు లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. క్లబ్బులు, గుడుంబా, మట్కా, గుట్కా, ఫ్యాక్షనిజం, రౌడియిజం, కుంభకోణాలు లేకుండాపోయాయని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెస్తే గ్రామానికో క్లబ్బు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొన్ని సమస్యలు తీరాయని, మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయని, మిగిలిన పనులను ఆత్మ గౌరవంతో పూర్తి చేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీకి మరో అవకాశం కల్పించాలని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న అల్పాదాయ ఉద్యోగులు ఈ అంశాలపై ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఆయా ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయించుకున్నాయని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం కొంత మేరకు జీతాలను పెంచిందని, అయితే, పెరిగిన జీతంపై తనకు ఏ మాత్రం సంతృప్తి లేదన్నారు. పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మొదట్లో కల్యాణ లక్ష్మీ పథకానికి రూ. 51 వేలతో ప్రారంభించి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని లక్షా 116లకు పెంచినట్లు స్పష్టం చేసారు. హుస్నాబాద్‌పై ఉన్న సెంటిమెంటుతో తొలి సభను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘మీ దీవెనలతో యుద్ధానికి బయలుదేరుతున్నాను’ అన్నారు. సర్వశక్తులొడ్డి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టామని, ఆ అభివృద్ధి ఇదే విధంగా ముందుకువెళ్లాలంటే రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం కావాలని కేసీఆర్ అన్నారు.