రాష్ట్రీయం

ఉత్తుత్తి సర్వేలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: సర్వే నివేదికల ఆధారంగానే వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేశారా? లేక ఉత్తుత్తి సర్వేలతో హడావుడి చేసి, అభ్యర్థులను ఇతరత్రా కారణాలతో ఎంపిక చేశారా? అనే అనుమానాలు టీఆర్‌ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అదే వాస్తవమైతే, తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న కొందరికి టిక్కెట్లు ఎలా వచ్చాయని ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ భవన్‌లో ఇటీవల నిర్వహించిన పార్టీ విస్తృత సమావేశం సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగి శోభ పనితీరు బాగుందని స్వయంగా సీఎం కేసీఆరే చెప్పి, ఆ తర్వాత ఆమెకు టికెట్ నిరాకరించడం చాలా మందిని వస్మయానికి గురిచేసింది. ఇలాంటప్పుడు ఈ సర్వేల వల్ల ప్రయోజనం ఏమిటని
తిరుగుబాటు నేత కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలనే ఈ వర్గాలు తాజాగా ఉదహరిస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే నివేదికలు తెప్పించుకున్నట్టు పలు సందర్భాల్లో పార్టీ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సర్వేలన్నింట్లో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మినహా మిగతా వారందరి పనితీరు బాగుందని తేలిందా? అనే సందేహాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యే పని తీరు బాగలేదని, వారు తమ పద్ధతి మార్చుకోవాలని పార్టీ వేదికలపై అధినేత కేసీఆర్ హెచ్చరించారు. మరి పనితీరు బాగా లేని వారికి కూడా తిరిగి అభ్యర్థులుగా ఎలా ప్రకటించారని అసమ్మతి నేతల ప్రశ్న. పార్టీ నుంచి గెలుపొందిన 62 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురికి మాత్రమే టికెట్లు నిరాకరించి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారందరికీ టికెట్లు ఇవ్వడం వల్ల సొంత పార్టీ నేతలనే అవమాన పరిచినట్టు కాదా అని చాలా మంది అసమ్మతి నేతలు నిరదీస్తున్నారు. వాస్తవానికి టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన వారిలో చాలా మంది తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారే. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించి గెలుపొందిన వారినే చేర్చుకుని పార్టీలో మొదటి నుంచి పని చేసిన వారిని పక్కన పెట్టడం ఎంత వరకు సమంజసమని టికెట్ ఆశించి భగ్గపడిన ఆశావాహులు నిలదీస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ ఇవ్వకపోతే తిరుగుబాటు బావుటా ఎగురేస్తారేమోనన్న భయంతోనే టికెట్ ఖరారు చేశారేతప్ప సర్వే నివేదికల ప్రతిపాదికన కాకపోవచ్చని వీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, టీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల పని తీరుతో పోలిస్తే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేల పట్ల నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు సమాచారం. వీరు మొదటి నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులను కలుపుకొని వెళ్లకుండా తమ వెంట వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం, నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం వంటి చర్యలతో ఇప్పటికే పార్టీ మాతృ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమను పక్కన పెట్టిన వారినే తిరిగి అభ్యర్థులుగా ప్రకటించడాన్ని టీఆర్‌ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వీరి అసంతృప్తి ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలిస్తాయని అసంతృప్తి వర్గాలు విశే్లషిస్తున్నాయి.
ఇలావుంటే, ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించడం వల్ల కొంత అసంతృప్తి వ్యక్తం కావడం సహజమేనని పార్టీ అధిష్టానం అభిప్రాయపడుతున్నది. టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి కొత్తేమీ కాదని, ఇంతకంటే ఎక్కువగా అసంతృప్తి రేగిన సందర్భాలు చాలా ఉన్నాయని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలు సమీపించే సమయానికి అంతా సర్దుకుంటుందని పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, సర్వేలు, నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందా? లేదా? అన్న అనుమానాలు టీఆర్‌ఎస్ అసంతృప్తి నేతలు, కార్యకర్తలను వేధిస్తునే ఉన్నాయి.