రాష్ట్రీయం

‘సిరివెన్నెల’కు కొప్పరపు కవుల జాతీయ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 9: సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తీకి కొప్పరపుకవుల జాతీయ పురస్కారాన్ని ఆదివారం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రదానం చేశారు. అదేవిధంగా కొప్పరపు కవుల అవధాన పురస్కారాన్ని ఈఏడాది గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్‌కు అవధాన పురస్కారాన్ని అందచేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కొప్పరపు సోదరద్వయం అవధాన ప్రతిభ అనిర్వచనీయమని అన్నారు. వీరి ప్రతిభకు గుర్తుగా విశాఖ ఆర్‌కే బీచ్ వద్ద వీరిద్దరి శిలా విగ్రహాలను ఏర్పాటు చేశామని చెప్పారు. తెలుగువారికే సొంతమైన అవధాన విద్యలో కొప్పరపుకవులు ప్రతిభాధురీణులని అన్నారు. వీరి జీవిత చరిత్రను పాఠ్యాంశం చేసి, భావి తరాలకు వారి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటున్నామని గంటా చెప్పారు. కూచిపూడి నృత్యం, శాస్ర్తియ సంగీతాన్ని మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలు కేటాయించందని చెప్పారు. వచ్చే ఏడాది 108 నృత్య, సంగీత అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. గౌరవ అతిథిగా హాజరైన ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్.వీ.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామశాస్ర్తీ తమ గీతాలు, కవితలతో సామాన్యులకు సత్ సంప్రదాయాన్ని చేరువగా తీసుకువెళ్లారని అన్నారు. పద్యానికి, అక్షరానికి గౌరవాన్ని తెచ్చిపెట్టారని అన్నారు. వివిధ రంగాల్లో ప్రావీణ్యులైన వారి జీవిత చరిత్రలను చిత్ర రూపం ద్వారా భావితరాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే అమరావతిలో వీటన్నింటితో ఓ మ్యూజియను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. సినీ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ సిరివెన్నెల రాసిన ‘తరలిరావె తనే వసంతం’ అనే గీతం అందరికీ అర్థమయ్యే రీతిలో రాసి గొప్ప కీర్తి గడించారని అన్నారు. కవిత్వం పామరులకు కూడా మెప్పించేదిగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్, ఏపీ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రముఖ అవధాని బేతవోలు రామబ్రహ్మం, చెరువు రామకోటయ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సిరివెన్నెలకు కొప్పరపు కవుల జాతీయ పురస్కారాన్ని అందజేస్తున్న మంత్రి గంటా. చిత్రంలో కె.విశ్వనాథ్,
మండలి బుద్ధ ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు