రాష్ట్రీయం

రాష్ట్రంలో బంద్ పాక్షికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ వేర్వేరుగా సోమవారం పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ పాక్షికంగా జరిగింది. అధికార పక్ష తెలుగుదేశం, ప్రతిపక్ష వైకాపాలు బంద్‌కు దూరంగా ఉండడం కూడా దీనికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు తిరగలేదు. సినిమా థియేటర్లలో ఉదయం ఆటలు రద్దు చేశారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మధ్యాహ్నం వరకు దుకాణాలు మూతపడ్డాయి. రాజధాని విజయవాడ కేంద్రంలో కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన నేతలు తెల్లవారుజాము నుంచే బస్ స్టేషన్‌ను దిగ్బంధం చేయడంతో ఉదయం కొంత సేపు బస్సుల రాకపోకలు నిలిచాయి. అ తర్వాత యథావిథిగా నడిచాయి. ఈ దఫా పోలీసులు సంయనం పాటించారు. ఏపీఎస్ ఆర్టీసీకి రూ. 4 కోట్ల మేన నష్టం వాటిల్లింది. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఉదయం నుంచి దాదాపు రెండు గంటలుపైగా కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఎం నేతలు సిహెచ్ బాబూరావు, దోనేపూడి కాశీనాథ్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, జనసేన నేత పోతిన వెంకట మహేష్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత పోతిన రామారావు తదితరులు నగరంలో బంద్‌లో పాల్గొని పర్యవేక్షించారు. బంద్ విజయవంతమైందంటూ రఘువీరారెడ్డి, పది వామపక్షాల నేతలు ప్రకటించారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని వారందరికీ రఘువీరారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లలో భారత్ బంద్ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కాలేదన్నారు. దీనికి ప్రజల ఆమోదం ఉందనేది నిరూపించిందన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల పట్ల ప్రజల ఆగ్రహానికి బంద్ అద్దం పడుతున్నదని పది వామపక్షాల నేతలు పెనుమల్లి మధు, కే రామకృష్ణ, గుర్రం విజయ్‌కుమార్, కాటం నాగభూషణం, పెనె్మత్స సుందర రామరాజు, వై సాంబశివరావు తదితరులు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరచి ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు సహకరించిన వర్తక వ్యాపార వర్గాలకు రవాణా, విద్యా సంస్థల ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు.
తిరుపతిలో నిల్..
నెల్లూరు/ఒంగోలు/తిరుపతి: పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి 18 పార్టీల పిలుపు మేరకు నెల్లూరు, ప్రకాశం , చిత్తూరు జిల్లాల్లో భారత్ బంద్ పాక్షికంగా జరిగింది. భారత్ బంద్ నెల్లూరు జిల్లాలో పాక్షికంగా జరిగింది. సోమవారం ఉదయం నుండే వివిధ పార్టీలకు చెందిన నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బంద్ చేశారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిరసన చేపట్టి ఆర్టీసీ బస్సులను కదలనీయలేదు. జిల్లాలోని నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట తదితర పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో బంద్ ప్రభావం ఉదయం 11 గంటల వరకూ కనిపించింది. తర్వాత యధావిధిగా దుకాణాలు తెరుచుకోగా, వాహనాల రాకపోకలు సాగాయి. అయితే బంద్ పాటిస్తున్న రాజకీయ పార్టీల, కార్మిక సంఘాల నేతలను జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. మరికొన్ని చోట్ల ముందస్తు అరెస్టులు కూడా జరిగాయి. బంద్ జిల్లాలో పాక్షికంగానూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగింది. పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, జనసేన, ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తాపార్టీల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన భారత్ బంద్ ప్రకాశం జిల్లాలో పాక్షికంగా జరిగింది. బంద్ సందర్బంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు, విద్యాసంస్ధలు,బ్యాంకులను ఆందోళన కారులు మూయించివేశారు. బంద్ సందర్భంగా పలు ఆర్‌టిసి గ్యారేజిల ఎదుట ఆయాపార్టీలకు చెందిన నేతలు బైఠాయించటంతో పలువురు నాయకులను, కార్యకర్తలను చీరాల, కందుకూరు ప్రాంతాల్లో పోలీసులు అరెస్టుచేశారు. జిల్లా వ్యాప్తంగా 98శాతం బస్సులు తిరగ్గా కేవలం రెండుశాతం బస్సులు మాత్రమే తిరగలేదని దీంతో సంస్ధకు 25లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆర్‌టిసి ఆర్‌ఎం విజయగీత ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. చీరాలలోని వస్త్రాలయాలు, ఒంగోలులోని బాపూజి కాంప్లెక్స్ మూతపడ్డాయి. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్‌టిసి డిపో ప్రాంగణంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు క్రికెట్ ఆడుతూ నిరసన తెలియచేశారు. జిల్లాలోని పలునియోజకవర్గ కేంద్రాల్లో తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బంద్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాపోలీసు యంత్రాంగం భారీగా పోలీసులను మోహరించారు. ఈ బంద్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు ఈదా సుధాకర్‌రెడ్డి, సిపిఎం జిల్లానాయకులు జివి కొండారెడ్డి, సిపిఐ జిల్లాకార్యదర్శి ఎంఎల్ నారాయణతోపాటు పలుపార్టీల నాయకులు పాల్గొన్నారు.
తిరుపతిలో సోమవారం చేపట్టిన భారత్ బంద్ విఫలమైంది. ఆందోళనకు దిగిన వివిధ పార్టీల కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఎమ్మార్ పల్లి పోలీస్ స్టేషన్‌ను తరలించారు. నగరంలో ఎటు చూసినా పోలీసుల పహారాతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో బంద్ విఫలమైంది. అయితే ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు మాత్రం ముందస్తుగానే సెలవు ప్రకటించారు. సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు సోమవారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఆర్టీసి బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. శాంతియుతంగా నినాదాలు చేస్తున్నవారిని ఆందోళన విరమించాలని పోలీసులు కోరినా ససేమిరా అనడంతో వారిని అరెస్టుచేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. తిరుపతి బాలాజీ కాలనీ వద్ద రోడ్డుపై బైఠాయించిన జనసేన పార్టీ నాయకులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయం 9గంటలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రులు తంగబాలు, డాక్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద గ్యాస్ సిలిండర్లను నెత్తిపై పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా డాక్టర్ చింతామోహన్, తంగబాలు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించారు.నాలుగుకాళ్ల మండపం వద్ద టీడీపీనేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ నరసింహ యాదవ్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్.విజయలక్ష్మి, కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వూకా విజయ్‌కుమార్, టీడీపీ నాయకురాలు డాక్టర్ ఆశాలత మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కాగా బంద్‌కు వైకాపా దూరంగా ఉంది. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమాక్రసీ జిల్లా నాయకుడు హరికృష్ణ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ, ఆ తరువాత స్కూటర్ ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ జెండాలు, ఫ్లకార్డులు పట్టుకుని పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. కాగా పోలీసులు ఆందోళనా కారులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, బంద్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం నిరసనలకు పరిమితం కావడం, ప్రజలు సైతం ప్రతిపక్షాల బంద్ పిలుపునకు పెద్దగా స్పందించకపోవడంతో బంద్ విఫలమైంది. ఆర్టీసి బస్సులు యధావిధిగా నడిచాయి. ఉదయం కొద్ది సేపు షాపులు మూసివేసినా పోలీసులు అరెస్టులతో రాజకీయ పార్టీల నాయకులు ఎక్కడా రోడ్లపై కనిపించకపోవడంతో షాపులు, హోటళ్లు తిరిగి తెరుచుకున్నాయి. అలాగే చిత్తూరు, మదనపల్లె, పుంగనూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో కూడా భారత్ బంద్ ప్రభావం అంతగా కన్పించలేదు.
గోదావరి జిల్లాల్లో...
రాజమహేంద్రవరం/కాకినాడ/ ఏలూరు: పెట్రో ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ సహా వివిధ రాజకీయపక్షాలు సోమవారం నిర్వహించిన భారత్ బంద్ గోదావరి జిల్లాల్లో ప్రశాంతంగా జరిగింది. చాలా ప్రాంతాల్లో బంద్ పాక్షికంగా జరిగింది. దాదాపు అన్ని చోట్లా విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పెట్రోలు బంకులను సైతం మూసివేశారు. అయితే ఆర్టీసీ బస్సులు, ఆటోలు తదితర వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగినప్పటికీ, బంద్ నిర్వహిస్తున్న వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్టుచేశారు. అనంతర వాహనాల రాకపోకలు యథావిథిగా కొనసాగాయి. కాంగ్రెస్‌తోపాటు టీడీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తదితర పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో బంద్ విజయవంతమయ్యింది. బంద్‌కు నాయకత్వం వహించిన సుమారు 30 మంది వామపక్షాలకు చెందిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టుచేశారు. తెల్లవారుజామున ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్న ఆందోళనకారులు బస్సులను తిరగనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, పలువురు నేతలను అరెస్టుచేశారు. కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్, జనసేన, వామపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెట్రో ధరలు తగ్గించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం నాయకులు బైక్‌లను తూకానికి అమ్మేస్తున్నట్టు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.కాగా రాజమహేంద్రవరంలో బంద్ నిర్వహణలో పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ చెయ్యి విరిగింది. ఎద్దుల బండిపై వినూత్న నిరసనకు దిగిన నేపథ్యంలో బండి ఎక్కుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సీపీఐ నాయకుడు నల్లా రామారావు, జనసేన నాయకులు కందుల దుర్గేష్, వై శ్రీనివాసరావు తదితరులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో అరుణ్ చెయ్యి విరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో తెల్లవారుజాము నుంచి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. జిల్లాలోని పలుప్రాంతాల్లో వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించి అనంతరం విడిచిపెట్టారు. అన్నిచోట్ల వ్యాపారులు షాపులను స్వచ్చంధంగా మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. జిల్లా కేంద్రం ఏలూరులో వివిధ పార్టీల ఆధ్వర్యంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను, బ్యాంకులను మూయించివేశారు. సిపిఎం ఆధ్వర్యంలో ఎడ్లబండిపై తిరుగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. చాలాప్రాంతాల్లో ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ తమ నిరసనను తెలిపారు. జంగారెడ్డిగూడెంలో బైక్‌కు శవయాత్ర నిర్వహించి వినూత్నరీతిలో తమ నిరసన తెలిపారు.
అనంతలో పాక్షికం
అనంతపురం: పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం చేపట్టిన భారత్ బంద్ అనంతపురం జిల్లాలో పాక్షికంగా జరిగింది. కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన బంద్‌కు సంఘీభావం తెలిపారు. టీడీపీ నేతలు వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం నగరంలో మేయర్ స్వరూప నేతృత్వంలో తెలుగు మహిళలు లారీని తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేయగా, సీపీఐ, సీపీఎం, ఎస్‌యూసీఐ ఆధ్వర్యంలో ఆటోలు లాగుతూ, ఎడ్లబండిపై బైకులతో నిరసన తెలిపారు. సీపీఎం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టైర్లు తగులబెట్టారు. హిందూపురం, కదిరి, ధర్మవరం, గుంతకల్లు, మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రిలో బంద్ పాక్షికంగా జరిగింది.

చిత్రం..అనంతపురం నగరంలో లారీని తాళ్లతో లాగి నిరసన తెలుపుతున్న తెలుగు మహిళలు