రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌లో అసమ్మతి గోల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 10: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో పోటీ చేసే టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించిన నాటినుంచే అసమ్మతివాదుల నిరసనలు అధికమయ్యాయి. ప్రధానంగా మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్‌కు, పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుకు, కొత్తగూడెంలో జలగం వెంకట్రావ్‌కు పెద్దగా అసమ్మతి పోరులేదు. మధిర నియోజకవర్గంలో ఐదు మండలాల పరిధిలోని ప్రధాన నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశమై మదన్‌లాల్‌కు టికెట్ కేటాయించడం కుదరదని, ఆయనకి బదులు వేరే వ్యక్తికి టికెట్ కేటాయించాలని, లేనిపక్షంలో తాము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండలేమని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చేందుకు అందరూ కలిసి హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వీరిలో అధికశాతం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులు ఉండటం విశేషం. మధిర నియోజకవర్గంలో నియోజకవర్గ ఇంచార్జ్ బొమ్మెర రామ్మూర్తి తనకు టికెట్ రాకపోవడంపై నిరసన తెలిపారు. తన అనుయాయులతో సమావేశం నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్, రామ్మూర్తిని తీసుకురావాలంటూ ఎంపీ పొంగులేటిని పంపించారు. అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లుకు టికెట్ ఇచ్చారని, ఆయనకు తాము మద్దతివ్వలేమని అక్కడి నేతలు తేల్చిచెప్పారు. సత్తుపల్లిలో ఎంపీ వర్గీయుడైన మట్టా దయానంద్ ఏకంగా తాను తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తానని చెప్పడం విశేషం. మధిరలో గత ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా పోటీచేసి రెండవ స్థానంలో నిలిచిన లింగాల కమల్‌రాజ్‌కు టికెట్ ఇచ్చిన టీఆర్‌ఎస్ అధిష్ఠానం సత్తుపల్లిలో గత ఎన్నికల్లో రెండవ స్థానంలో ఉన్న తనకు ఎందుకు టికెట్ ఇవ్వరని ఆయన ప్రశ్నిస్తున్నారు. పినపాకలో పాయం వెంకటేశ్వర్లు వ్యతిరేకులు, భద్రాచలంలో నియోజకవర్గ ఇన్‌చార్జి రామకృష్ణ అనుచరులు, ఇల్లెందులో తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య వ్యతిరేకులు బాహటంగానే నిరసనలు తెలుపుతున్నారు. నాలుగేళ్ళుగా తమకు అండగా లేకపోగా తమపైనే నిర్బంధాలు విధించేలా చూసిన నేతలకు తాము ఎలా మద్దతిస్తామని బాహటంగానే చెప్పారు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో అభ్యర్థులపై అసమ్మతి జ్వాలలు అధికమవుతుండగా వారిని బుజ్జగించడంలో టీఆర్‌ఎస్ అధిష్ఠానం చేస్తున్న యత్నాలు ఫలించటం లేదు. ఇదే అదనుగా ఇతర ప్రధాన పార్టీలు వారిని తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో ఒకరిద్దరు టీఆర్‌ఎస్ నేతలను తమవైపుకు తిప్పుకొని ఆ నియోజకవర్గాల్లోనే పోటీలో పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు అభ్యర్థులు ప్రచారానికి వెళితే ఆయా ప్రాంతాల్లోని ఇతర నేతల అనుచరులు దూరంగా ఉంటుండటం ఇబ్బందిని కలిగిస్తున్నది. ప్రధానంగా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఎంపీ అనుచరులు, మధిరలో రామ్మూర్తి అనుచరులు ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. నాలుగైదు రోజుల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతలందరితో సమావేశాలు నిర్వహించి అందరిని ఐక్యం చేసేందుకు ప్రయత్నిస్తారని చెబుతున్నా ఈ లోపుగానే కొందరు పార్టీ మారేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచారం.