రాష్ట్రీయం

వంచనకు మారుపేరు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 12: ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా అన్నివర్గాలను మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంచనకు మారుపేరని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. విశాఖలో బుధవారం జరిగిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ పదవికోసం ఎంత నీచానికైనా వెనుకాడని మనస్తత్వం ఆయన సొంతమన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లిం వర్గాలకు తీరని అన్యాయం చేసిన చంద్రబాబు నాలుగేళ్ల పాటు ఆ పార్టీతో అంటకాగి ఇప్పుడు అదే పార్టీని విమర్శిస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లుగా మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకుండా పాలించాడని, ఉత్తరప్రదేశ్ బీజేపీ సీఎం ఆదిత్యనాథ్ కేబినెట్‌లో ముస్లిం మంత్రి ఉన్నాడని గుర్తు చేశారు. గుంటూరులో నారా హమారా - టీడీపీ హమారా పేరిట సదస్సు నిర్వహించిన చంద్రబాబు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టించారని ఆరోపించారు. అధికారం కోసం క్షణానికో మాటమార్చే చంద్రబాబును నైజాన్ని ముస్లిం సోదరులు గమనించాలన్నారు. ఒకప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఓటమి అనంతరం పొత్తు చారిత్రాత్మక తప్పిదం అన్న చంద్రబాబు 2014లో బీజేపీతో కలిసి పోటీ చేశారన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌కు ఓటేసినట్టేనంటూ ప్రచారం చేసుకున్న చంద్రబాబు, ఇప్పుడు మాటమార్చి వైసీపీకి ఓటేస్తే బీజేపీకే వెళ్తుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు రాజకీయ నీచత్వానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలని, ఏ వర్గానికైనా వీసమెత్తు మేలు జరిగిందా అని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. దివంగత నేత వైఎస్, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనన భేరీజు వేసుకోవాలని సూచించారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన వరాలను ప్రస్తావిస్తూ, వీటిలో ఏ ఒక్కటైనా అమలైందా అని ప్రశ్నించారు. ముస్లింలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుతో రుణాల విడుదల వంటి హామీలు ఏ మయ్యాయని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో ముస్లింలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఖర్చు చేయలేదని గణాంకాలతో వివరించారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన పూర్తిగా అవినీతి మయమన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు వంటి పథకాలు వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కొనసాగిస్తామన్నారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే చంద్రబాబుకు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ముస్త్ఫా, అంజాద్ భాషా, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇక్బాల్, పార్టీ మైనార్టీ విభాగం నాయకుడు రెహ్మాన్, ఖాదర్‌భాషా తదితరులు ప్రసంగించారు.
అంతకు ముందు విశాఖ ఉషోదయ జంక్షన్‌లో ప్రారంభమైన పాదయాత్ర టీటీడీ కల్యాణ మండపం, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, హనుమంతవాక మీదుగా చినగదిలి వరకూ కొనసాగింది. బుధవారం 6.3 కిమీ మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు బ్రహ్మరధం పట్టారు. దారి పొడవునా జనం సమస్యలు వింటూ ముందుకు సాగారు.