రాష్ట్రీయం

కలల జలసౌధం పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 12: పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి మాత్రమే కాదని, అది అయిదుకోట్ల ప్రజల కలల జలసౌధమని, రాయలసీమ రత్నాభరణమని, ఉత్తరాంధ్ర ఆశాకిరణమని, ఇంతటి కీలకమైన ప్రాజెక్టును 2019 నాటికల్లా పూర్తిచేసి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం ద్వారా తన జన్మ చరితార్థమవుతుందని, పూర్వజన్మ సుకృతం వల్లే ఇంతటి గొప్పప్రాజెక్టు నిర్మించి, పూర్తిచేసే అవకాశం తనకు లభించిందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ 2019 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టు నుండి నీరు అందిస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే వర్షం మొదలవ్వడంతో జోరు వానలోనే ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగించారు. గోదావరి మహాపుష్కరాల సమయంలో తాను మహాసంకల్పం చేసుకున్నానని, రాష్ట్రంలోని గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా, నాగావళి నదుల అనుసంధానం సాధించి మహాసంగమానికి శ్రీకారం చుడతామన్నారు. ఎవరైనా అయ్యప్పదీక్షలు, భవానీదీక్షలు లాంటివి చేపడుతుంటారని, తాను మాత్రం రాష్ట్రంలో కరవు అనే మాట వినపడకుండా ఉండాలని జలదీక్ష చేపట్టానన్నారు. మహాసంగమాన్ని సాధిస్తే రాష్ట్రంలో కరవు అనే మాట వినపడదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తోందని, అవినీతికి తావులేకుండా, కమీషన్ల ప్రస్తావన లేకుండా నిర్మాణ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నా తనపై విపక్ష నేత నిరాధార విమర్శలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైన స్థాయిలో సహకారం అందించకపోయినా రాష్ట్రానికి జీవనాడి కావడంతో ఆర్థిక ఇబ్బందులున్నా ముందుకువెళుతున్నామని బాబు చెప్పారు. ఇంతవరకు ప్రాజెక్టుపై రూ.14,600 కోట్లు ఖర్చు చేశామని, ఇందులో ఆరువేల కోట్ల రూపాయల మేరకు కేంద్రం నుండి రీయింబర్స్‌మెంట్ జరిగిందన్నారు. ఇంతవరకు 76సార్లు పోలవరం ప్రాజెక్టు పనుల వర్చువల్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించానని, మరో 26సార్లు స్వయంగా ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి పనులను స్వయంగా సమీక్షించానని చెప్పారు. ఈరకంగా ముందుకు వెళ్లటం వల్లే ప్రాజెక్టు పనులు 58.15 శాతం పూర్తయ్యాయన్నారు. గోదావరి వరద తగ్గిన వెంటనే ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు పూర్తవుతాయని, మిగిలిన వాటిని మరింత వేగవంతం చేయనున్నామని చెప్పారు. ఏదేమైనా 2019నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరతానని చెప్పారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా కొంత సానుకూలంగా మాట్లాడుతున్నారని, సహకరించడానికి ముందుకొస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని మరో ఆరేడు సార్లు సందర్శిస్తే దాదాపుగా నిర్మాణం పూర్తవుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టు పనులను శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామని, ఈ ఏడాది 12 ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రపంచంలో ఉన్న రికార్డులన్నింటిని అధిగమించి మరీ పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు.
పోలవరం ప్రాజెక్టు ప్రాంతం ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా మారిపోయిందని, దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్న ఈప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ స్వయంగా చూడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈవిషయంలో విద్యార్థినీ విద్యార్థుల ప్రాధాన్యత చాలా ఉందని, చిన్నతనంలోనే ఇలాంటివి తెలుసుకుంటే ఆ స్ఫూర్తి వారికి ఎన్నో ఆలోచనలను అందిస్తుందన్నారు. అందువల్లే తన మనుమడు దేవాన్ష్‌ను ఇక్కడకు తీసుకువచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి స్పీకర్ ఫరూక్, బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, కెఎస్ జవహర్, నక్కా అనందబాబు, అచ్చెయ్యనాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, శిద్ధా రాఘవరావు, కాల్వ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, పలువురు ఎంపీలు, వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పశ్చిమ, తూరు గోదావరి జిల్లాల కలెక్టర్లు డాక్టరు కాటంనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.