రాష్ట్రీయం

బాబుది డ్రామా.. కేసీఆర్ అవకాశవాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఓటు బ్యాంకు అవకాశవాద రాజకీయాలు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఎన్నికల డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒక రోజు పర్యటనకు శనివారం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం చేసిన సాయం గురించి వివరంగా చెబుతూనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలం చెందారని ఎండగట్టారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను తిరిగి రజాకర్ల చేతుల్లో పెట్టవద్దని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రజలను కోరారు. పెట్రోలు ధరలు, చంద్రబాబుకు వారెంట్లు, ఎంఐఎంతో టీఆర్‌ఎస్ అవగాహన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. పెట్రోలియం ధరలపైనా స్పందించిన అమిత్ షా తగిన చర్యలు చేపడతామని చెప్పారు. తెలంగాణలో శాంతి భద్రతలు నుండి అభివృద్ధి వరకూ అన్ని రంగాల్లో వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని అన్నారు. కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, నియోజకవర్గాల్లో ఆస్పత్రులు, కేజీ టు పీజీ ఉచిత విద్య ఎటుపోయాయని, డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్లు ఎక్కడి వెళ్లాయని ప్రశ్నించారు. వాస్తు పేరుతో మూఢనమ్మకంతో సచివాలయానికి వెళ్లని సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే ఎలా నమ్మాలని వ్యాఖ్యానించారు. పరిపూర్ణానంద స్వామిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తీసుకొస్తున్నారా అన్న ప్రశ్నను అమిత్ షా కొట్టిపారేశారు. కేసీఆర్ చెప్పిన దళిత సీఎం హామీని ఆయన మరిచారని, దళితులు మాత్రం మరువలేదని అన్నారు. ఈసారైనా కేసీఆర్ దళితుడ్ని సీఎం చేస్తారా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో దళితులపై దాడులు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌తో తమకు ఎలాంటి దోస్తీ లేదని, ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పారు. బీజేపీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. బలమైన శక్తిగా మారి ఎన్నికల అనంతరం కీలక పాత్ర పోషిస్తుందని , బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని పేర్కొన్నారు.

మైనార్టీల సంతుష్టీకరణ
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించడం సంతుష్టీకరణ రాజకీయాలు కాదా అని నిలదీశారు. రాజ్యాంగం మత రిజర్వేషన్లను ఒప్పుకోదని తెలిసే వారు ఈ ప్రతిపాదన చేశారని, ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ ఓటు బ్యాంకు రాజకీయాలే కొనసాగుతాయని ఆయన విమర్శించారు. ఎంఐఎం కనుసన్నల్లో కేసీఆర్ పాలన కొనసాగుతోందని, ఎంఐఎం కోసమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించడం లేదని ఆరోపించారు. కావాలనే కేసీఆర్ ప్రభుత్వం కేంద్రం చేపట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రజలకు అందించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను కలెక్టరేట్‌లకే పరిమితం చేసిందని ఆరోపించారు. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్‌కు పట్టలేదని , ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం కేసీఆర్‌దేనని ఇంత అన్యాయం తానెక్కడా చూడలేదని చెప్పారు.

ప్రజలపై భారం
కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలతో ప్రజలపై భారం మోపిందని అన్నారు. జమిలి ఎన్నికలను కేసీఆర్ మొదట సమర్ధించారని, అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని అన్నారు. కోట్లాది రూపాయిలు ఎందుకు వృధా చేస్తున్నారని అమిత్ షా నిలదీశారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక అనేది తమ నినాదమని, రెండు మార్లు ఎన్నికలతో ప్రజలపై విపరీతమైన భారం పడుతుందని అన్నారు. కుటుంబ పాలనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు.

నిర్ణయాత్మక శక్తి
బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని , తెలంగాణలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తుందని అమిత్‌షా చెప్పారు. ప్రజల మద్దతు బీజేపీకి ఉందని, ప్రజల ఆశీర్వాదం తమకు లభిస్తుందని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం 2.30 లక్షల కోట్లు ఇచ్చిందని అన్నారు. ఆదివాసి వర్శిటీ, సెంట్రల్ యూనివర్శిటీ, హార్టికల్చర్ యూనివర్శిటీ, అగ్రికల్చర్ యూనివర్శిటీ, వెటర్నరీ వర్శిటీ, సైన్స్ రీసెర్చి సెంటర్, డిసీజ్ కంట్రోల్ సెంటర్, బయోడైవర్శిటీ సెంటర్, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్ వంటి కేంద్రాలను ఇచ్చిందని చెబుతూ ఏ పథకం కింద ఎంత మేరకు నిధులు ఇచ్చిందో కూడా వివరించారు.

బాబు డ్రామాలు
చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర వెళ్లినపుడు అక్కడా ఇక్కడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని, తర్వాత ఆయనపై కేసు రిజిస్టర్ చేసినపుడు, ఎఫ్‌ఐఆర్ చార్జిషీట్ అయినపుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని, ఇపుడు బీజేపీపై విమర్శలు చేయడం అంటే ఎన్నికల రాజకీయాలేనని అన్నారు. ఈ మొత్తం ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.