రాష్ట్రీయం

ఓట్లు మావే.. సీట్లూ మావే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, సెప్టెంబర్ 17: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో లంబాడా తెగ అభ్యర్థులను ఓడించి ఆదివాసీ అభ్యర్థులను గెలిపించుకుంటామని, లంబాడా అభ్యర్థులను ఇకనుండి తమ గూడేల్లోకి రానిచ్చేది లేదని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక అల్టిమేటం జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ), విద్యార్థి, యువజన సంఘాల అధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, బహిరంగ సభ ఏర్పాటు చేయగా ఆదివాసీ తెగకు చెందిన రాజకీయ పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆదివాసీలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని, ఖానాపూర్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ లంబాడాలకు టికెట్లు ఇచ్చినందున రేఖానాయక్, రాథోడ్ బాపురావులను ఓడించి ఆదివాసీ అభ్యర్థులకు పట్టం కట్టాలని తీర్మానించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీచేసే ఆదివాసీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకోసం ప్రతి ఒక్కరు రూ.100 నోటుతో పాటు ఓటు ఇచ్చి గెలిపించాలని నిర్ణయించారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు మాట్లాడుతూ కాంగ్రెస్‌తోపాటు మిగతా రాజకీయ పార్టీలు మూడు ఎస్టీ నియోజకవర్గాల్లో ఆదివాసీలకు టికెట్లు కేటాయించాలని, లేనట్లయితే తుడుం దెబ్బ పేరిట తామే స్వతంత్రంగా రంగంలోకి దిగి ఎన్నికల్లో సత్తా చూపుతామని అన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు ఉద్యమం ఆపేది లేదని, చట్టసభల్లో తమ వాణి వినిపించేందుకు ఈ ఎన్నికలే ప్రధాన అస్త్రంగా మలచుకుంటామని అన్నారు. ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మంత్రి జోగు రామన్నను ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఓడించడమే లక్ష్యంగా ఆదివాసీలు ఐక్యంగా కదలాలని తీర్మానించారు. గతంలో గోండు రాజుల ఏలుబడిలో సాగిన ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వివక్ష కారణంగా ప్రస్తుతం ఆదివాసీల ఉనికి
ప్రశ్నార్థకంగా మారుతోందని, తమ పిల్లల భవిష్యత్తుకోసం ‘ఓట్లు మావే.. సీట్లు మావే’ అన్న లక్ష్యంతో ఖానాపూర్, ఆసిఫాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో ఆదివాసీ అభ్యర్థులు విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. లంబాడా అభ్యర్థులను గూడేలకు రానివ్వద్దని తీర్మానించారు. సోషల్ మీడియా ద్వారా యువత, విద్యార్థులు ఆదివాసీల హక్కుల పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సార్‌మేడి మెస్రం దుర్గు, ఐటిడిఏ చైర్మెన్ కనక లక్కెరావు, మాజీ చైర్మెన్ భీంరావు, రాష్ట్ర నాయకులు వెడ్మ బొజ్జు, కొట్నాక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ఇంద్రవెల్లిలో జరిగిన ఆదివాసీల మహాసభకు తరలివచ్చిన జనం