రాష్ట్రీయం

తెలంగాణ భాషకు ప్రాణ ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ భాషకు తెలంగాణ ప్రభుత్వం ప్రాణ ప్రతిష్ఠ పెట్టిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విద్యా, సామాజిక సాంస్కృతిక సాహిత్య వేదిక భాషా సాహిత్య రంగాలపై నిర్వహించిన చర్చాగోష్టిలో సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భాషలో లక్ష కవులను తయారుచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో విశ్రాంతాచార్యులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ద్రావిడ వర్శిటీ మాజీ వీసీ ఆచార్య రవ్వా శ్రీహరి కీలక ఉపన్యాసం చేశారు. కార్యక్రమాన్ని డాక్టర్ వెల్చాల కొండలరావు నిర్వహించగా, ఆచార్య కే యాదగిరి సమన్వయకర్తగా వ్యవహరించారు. తెలంగాణ భాష అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, తెలుగును నిర్బంధ అభ్యసనాంశంగా మార్చిందని, తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించిందని పేర్కొన్నారు. తెలంగాణ భాష అధ్యయనం పెంచడానికి, ప్రమాణాలు పెంచడానికి కృషి జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య సంస్థలను ఒకే చోట కలిపి సుదీర్ఘంగా వారితో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశామని ఆయన వెల్లడించారు. ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య మాట్లాడుతూ తెలంగాణ భాషాభివృద్ధికి అనేక సంస్థలు ఎవరికి తోచినట్టు వారు పనిచేస్తున్నారని, అయితే ఈ కార్యక్రమాల మధ్య సమన్వయం ఉంటే అవి మరింత అర్ధవంతంగా, ప్రయోజనాత్మకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. శబ్దరత్నాకరం, సూర్యరాయ ఆంధ్ర నిఘంటువు, ఆంధ్ర శబ్దరత్నాకరం, శ్రీహరి నిఘుంటువు, తాళ్లపాక నిఘంటువు, మాండలిక వృత్తి పదకోశాలు, పరిపాలనా పదకోశం, పారిభాషిక పదకోశాలు, జిల్లాల పదకోశాలు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటన్నింటినీ సమన్వయం చేసుకుని తెలంగాణ భాష, సాహిత్య రంగాల వికాసానికి మరింత కృషి జరగాలని ఆచార్య సుప్రసన్న అన్నారు. తెలంగాణ భాషను సుస్థిరం చేయాల్సి ఉందని, జిల్లాల వారీ తెలంగాణ భాషలో వైవిధ్యం ఉందని, తెలంగాణ పదజాలానికి ప్రామాణీకీకరణ జరగాల్సి ఉందని ఆచార్య రవ్వా శ్రీహరి అన్నారు. జనబాహుళ్యంలోని పదాలను కూడా స్థిరీకరించుకోవాలని చెప్పారు. ఏదైనా పదాన్ని అన్ని రకాలుగా బావుంటుందని భావించినపుడు అది తెలంగాణలో ఎక్కడ వినియోగిస్తున్నా దానిని వినియోగించుకోవాలని అన్నారు. అదే విధంగా ప్రత్యాయాలను కూడా విరివిగా వినియోగించాలని, ప్రస్తుతం వీటి వినియోగంపై ఎలాంటి నియమావళి లేకున్నా , తెలంగాణ భాషలో గ్రంథాలు, వ్యాసాలు పెద్ద ఎత్తున వస్తున్నాయని రవ్వాశ్రీహరి చెప్పారు. ప్రామాణికీకరణ జరగనిదే తెలంగాణ భాషకు ఏకవాక్యత ఉండదని, తెలంగాణ పదాల వైవిధ్యాన్ని పరిశీలించి, వాడుకలోకి తెచ్చినపుడే జనామోదం లభిస్తుందని అన్నారు. తెలంగాణ భాష ఉచ్చారణకు సులభంగా ఉండేలా స్థిరీకరణ జరగాలని ఆచార్య రవ్వా శ్రీహరి చెప్పారు. సులభంగా ఉచ్చరించగలిగే మంచి పదాలను ఒక చోట చేర్చాలని, రాష్ట్రంలో ఉన్న సాహిత్య అకాడమి, తెలుగు అకాడమి, తెలంగాణ సారస్వత పరిషత్, కృష్ణదేవరాయ ఆంధ్రా భాషా సంస్థ, తెలుగు విశ్వవిద్యాలయం ముందుకు వచ్చి భాషాభివృద్ధికి ప్రయత్నం చేయాలని అన్నారు. ప్రామాణికీకరణ ఎక్కడో ఒక చోట మొదలైతే తర్వాత అన్ని ప్రాంతాల్లో విస్తరించి స్థిరీకరణకు దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆచార్య టి గౌరీశంకర్, ప్రొఫెసర్ వి విశ్వనాధం, ప్రొఫెసర్ వి నిత్యానందరావు, టి వేదప్రకాశ్, డాక్టర్ టి చక్రధరస్వామి, డోర్నాల విజయకుమార్, ప్రొఫెసర్ హెచ్ నాగేశ్వరరావు, ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..భాషా సాహిత్య రంగాలపై చర్చాగోష్ఠిలో మాట్లాడుతున్న సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి