రాష్ట్రీయం

గరుడ వాహనంపై గోవిందుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 17: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు... ఆదిమద్యాంత రహితుడు... ఆపద మొక్కుల వాడు... శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంటేనే భక్తులకు ఆనందోత్సవాలు. ఆ వాహనసేవలో పాల్గొని తరలించాలని తపిస్తారు. అందులోనూ శ్రీవారికి అత్యంత ఇష్టుడైన గరుడ వాహన సేవలో పాల్గొనాలంటే ఎనలేని ఆసక్తి కనపరుస్తారు. రాత్రి వేళలో జరిగే ఈ వాహనసేవను తిలకించడానికి భక్తులు ఉదయం నుండే నాలుగు మాడవీధుల్లో టీటీడీ ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో పడిగాపులు కాస్తారు. గరుడ వాహనం ఎప్పుడు తమ ముందుకు వస్తుందా? అని కోటి కన్నులతో బ్రహ్మాండనాయకుడి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ పరిస్థితి భక్తుల భక్తికి వారి సహన నిరీక్షణ ఒక పరీక్ష అనే చెప్పాలి. భక్తుల ఆనందానికి ఆధ్యాత్మిక చింతనకు సోమవారం నాడు తిరుమల ఆలయ నాలుగు మాడవీధులు వేదికగా మారాయి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన సోమవారం రాత్రి 7 గంటలకు స్వామివారు మూలవిరాట్టుకు ధరించే లక్ష్మీహారం, మకరకంఠి వంటి వజ్రవైఢూర్యాలు పొదిగిన వేలకోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలు, సుగంధ పరిమళాలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో విశేషాలంకారభూషితుడై గరుడ వాహనాన్ని అధిరోహించి వాహన మండపం నుండి చతుర్వీధుల్లో విహరించడానికి బయలుదేరారు. వజ్రవైఢూర్యాలు పొదిగిన ఆభరణాలు, మరోవైపు రంగురంగుల విద్యుదీపాలంకరణలతో గరుడ వాహనంపై ఉన్న స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందారు. సాక్షాత్తు స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి తమను కటాక్షించడానికి వచ్చాడన్నట్లుగా భక్తులు తన్మయత్వం చెందారు. వాహన మండపం నుండి గరుడ వాహనారూడుడైన స్వామివారు బయలుదేరగానే గరుడుడు తన రెక్కలను రెపరెపలాడిస్తూ గగనంపై లేచినట్లుగా స్వామి వాహనాన్ని తిలకించడానికి ఆలయం ముందు గ్యాలరీల్లో వేచి ఉన్న దేశం నలుమూలల నుండి విచ్చేసిన భక్తులు ఒక్కసారిగా కూర్చున్నచోటనే నిల్చుని చేసిన గోవింద నామస్మరణలు గరుడ గమనాన్ని చాటుతూ శేషాచల కొండలు మోరుమోగాయి. స్వామివారిని సుమారు 4లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా. ఒక్కనాలుగు మాడ వీధుల్లోనే టీటీడీ ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో రెండులక్షల మంది గరుడ వాహన సేవను దర్శించుకున్నారు. టీటీడీ ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ల ద్వారా మరో రెండులక్షల మంది దర్శించుకున్నారని అంచనా. సుమారు నాలుగున్నర గంటల పాటు ఏకబిగిన సాగిన ఈ గరుడ వాహన సేవకు భక్తులు తాము నిల్చున్న గ్యాలరీల్లోనే కర్పూర హారతులతో నీరాజనాలు అర్పించారు. గోవింద నామస్మరణలతో తమ భక్తిని చాటుకున్నారు. అయతే పది గంటల ప్రాంతంలో చిరుజల్లులు పడటంతో మలయప్పస్వామిని పటాటోపం కిందికి తీసుకువచ్చి ఊరేగింపు ముగించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు తిరుమలకు వాహనాల్లో రెండు కనుమార్గాల్లో పయనిస్తుంటే చీమలదండును తలపించింది. కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శన సౌకర్యం రద్దు చేసినా భక్తులు మాత్రం గరుడసేవ రోజున పెద్ద ఎత్తున కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. స్వామివారి గరుడసేవను తిలకించాలని పలుచోట్ల గ్యాలరీల్లో ఉన్న భక్తులు ఉత్సాహం చూపడంతో అక్కడక్కడా స్వల్ప తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి. తిరుమాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు.
ఈ గరుడ వాహన సేవలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, కలెక్టర్ ప్రద్యుమ్న, జేఈఓలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, ఇన్‌చార్జి సీవిఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఏ అండ్ సిఏఓ బాలాజీ, ఎస్పీ అభిషేక్ మహంతి, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
చిత్రం..తిరుమల మాడ వీధుల్లో సోమవారం రాత్రి అశేష భక్తజనవాహినిని అనుగ్రహించడానికి గరుడ వాహనంపై ఊరేగుతున్న శ్రీ మలయప్పస్వామి