రాష్ట్రీయం

మోదీ మోసం చేశారు..మేం న్యాయం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 18: ఎన్నికల సమయంలోగానీ, చట్టసభల్లో గానీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడమంటే అది రాజ్యంగ ఉల్లంఘన కిందకే వస్తుందని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఉన్నా, నరేంద్ర మోదీ ఉన్నా, భవిష్యత్తులో తాను ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే చట్టసభలను అగౌరవ పరచడం, దేశ ప్రజలను అవమానపరచడమేనని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన సత్యమేవ జయతే బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందని, అందులో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ బాధ్యత ఉందన్నారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన కారణంగా జరిగిన నష్టాన్ని నేడోరేపో పూడుస్తారని నరేంద్ర మోదీపై ఆశలు పెట్టుకుంటే, గత నాలుగేళ్లుగా ఆయన వాటిని అమ్ము చేస్తునే వచ్చారని విమర్శించారు. ఇచ్చిన హామీల మేరకు ప్రజలకు మంచి జరిగే ఏ ఒక్క పనినీ మోదీ చేయలేకపోయారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడినయ్యాక మొట్టమొదటి సభ కర్నూలులో నిర్వహించడానికి కారణం దేశంలోనే నిజాయితీపరులుగా పేరుగాంచిన దివంగత నేతలు దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డినే కారణమని రాహుల్ వ్యాఖ్యానించారు. తాను ప్రధానమంత్రినైతే, వారిని ఆదర్శంగా తీసుకుని నీతివంతమైన పాలన అందిస్తానన్నారు. అంతేగాక రాష్ట్రంలో నీతినిజాయితీలకు పెద్దపీట వేసే వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తానని అన్నారు. విభజన సమయంలో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సహకారం, రైల్వేజోన్, కేంద్రీయ విద్యాసంస్థలు, రాజధాని నిర్మాణం, రాజధానికి అనుసంధానంగా పలు జాతీయ రహదారులను కేటాయించారని తెలిపారు. వీటిని చట్టంలో పొందుపరచడమేగాకుండా ప్రజలు దేవాలయంగా భావించే లోక్‌సభలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మన్మోహన్ సింగ్ ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదుకాదు పదేళ్లు కావాలని బీజేపీ పట్టుబట్టిందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామని నాడు ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ తరుపున మోదీ ఎన్నికల సభల్లో రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారని రాహుల్ అన్నారు. ఆయనను నమ్మి దేశ ప్రజలు ప్రధాన మంత్రి పదవిలో కూర్చోబెడితే, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలే కాకుండా దేశం మరెక్కడా హామీలను నెరవేర్చకుండా, ఎవరికీ న్యాయం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోదీ మోసం చేశారని, తాను ప్రధాన మంత్రి అయిన తక్షణం విభజన హామీలనే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తీరుతామని అన్నారు. దేశంలోని రైతులందరికీ రూ. రెండు లక్షల వరకు బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. అంతేగాక, నిరుద్యోగ యువత, మహిళలు, ప్రజలందరికీ న్యాయం జరిగేలా ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తానని రాహుల్ అన్నారు. అసత్యాలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈసారి కేద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు ఇచ్చే ప్రతి మాట నిలబెట్టుకుంటామన్నారు. కాంగ్రెస్ అంటే నీతి, నిజాయితీ, చెప్పిన మాట మీద నిలబడే పార్టీ అని నిరూపించి తీరుతానని రాహుల్ స్పష్టమైన
హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాన్ని గ్రహించి ఎంతో ఆవేదనకు గురవుతున్నానని అన్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతానని హామీ ఇచ్చారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.

చిత్రం..కర్నూలులో మంగళవారం జరిగిన కాంగ్రెస్ సభకు హాజరైన జనం. ప్రసంగిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ