రాష్ట్రీయం

ఆగదు.. పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 19: ప్రత్యేక హోదా.. విభజన హామీల అమలులో కేంద్రం వ్యవహారశైలి బ్రిటీష్ పాలకులను తలపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిస్థితి ఇలానే కొనసాగితే చరిత్రలో కలసిపోతారని మండిపడ్డారు. ‘ప్రత్యేక హోదా, ఇతర హామీలతో పాటు ఏపీ పునర్విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బుధవారం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని టీడీపీ, బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సున్నితమైన అంశాలపై అడ్డంగా వ్యవహరించటం తగదన్నారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలుచేసినా..ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నా కేంద్రంలో కదలిక లేదని ఆరోపించారు. అన్యాయం జరిగిందని పదేపదే చెప్తున్నా పెడచెవిన పెడుతోందని ధ్వజమెత్తారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో సహా అన్ని పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం నిర్లక్ష్యం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసి పరారయ్యారన్నారు. మిగిలిన పార్టీలన్నీ ముక్తకంఠంతో ఏపీకి మద్దతిచ్చాయని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారిందన్నారు. పోలవరానికి సకాలంలో అనుమతులు.. నిధులు మంజూరు చేయరు.. ఆర్థికలోటు భర్తీచేస్తామని చెప్పి అది కూడా ఇచ్చే సూచన కనిపించటంలేదు.. రాజధానికి నిధులు విదిలించి చేతులు దులుపుకున్నారు.. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించి ఇచ్చిన డబ్బులు వెనక్కు తీసుకుంటారు.. కొత్త రైల్వేజోన్ ఊసేలేదని దుయ్యబట్టారు. మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే కనీస న్యాయం చేయకపోగా పొరుగు రాష్ట్రాలతో చిచ్చులు పెడుతున్నారని ఆరోపించారు. మీరు డబ్బులివ్వద్దు.. మేం కట్టే పన్నులు మాకు వెనక్కు ఇవ్వండని డిమాండ్ చేశారు. దుగ్గరాజపట్నం, విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు నిధులివ్వకుండా ముంబై- ఢిల్లీ కారిడార్‌కు వేల కోట్లు మంజూరు చేయటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మెట్రోరైల్‌కు అతీగతీలేదు..విమానాశ్రయానికి భూములిస్తే స్పందించరు.. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం ఉందంటారు.. మేమేమైనా బానిసలమా? అని నిలదీశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమన్నారు. బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ తప్ప ప్రతి ఒక్కరూ విభజన హామీల కోసం నిలదీస్తున్నారని తెలిపారు. హోదా, హామీల
అమలు సాధించే వరకు పోరాటం ఆగదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తని మీరే చెప్పి టీఆర్‌ఎస్‌తో కలవకుండా ఉండే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ‘కృష్ణా-గుంటూరు జిల్లాల్లో లభ్యమైన మన కోహినూర్’ వజ్రాన్ని బ్రిటీష్ పాలకులు ఎత్తుకెళ్లినట్టే కేంద్రం మనం కట్టే పన్నులు తీసుకుంటూ హక్కులు కాలరాస్తోందని ధ్వజమెత్తారు. నష్టపోయినప్పుడు అడిగే బాధ్యత మాకు ఉండదా? హోదా సాధించే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. ప్రజలు ధ్వేషం పెంచుకుంటున్నా మీలో మార్పురాలేదని విమర్శించారు. ఎక్కువ పన్నులు చెల్లించే ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా అధికారం ఉందనే అహంభావంతో అన్యాయంచేసి అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. నాలుగైదు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి.. మీకు బాధ్యత ఉంది.. రాజ్యాంగ ధర్మం ప్రకారం చేయం అంటే కుదరదని హెచ్చరించారు.
తీర్మానం పూర్తి సారాంశం
‘అశాస్ర్తియంగా జరిగిన విభజన వల్ల నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం వాటిల్లింది. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదాతో సహా అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీలు ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’లోని అంశాల అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల రాష్ట్ర శాసనసభ తీవ్ర అభ్యంతరాన్ని, నిరసనను వ్యక్తం చేస్తోంది. గత నాలుగేళ్లుగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, 29 పర్యాయాలు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి, ఇతర కేంద్రమంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి స్వయంగా కలిసి సంప్రతింపులు జరిపినప్పటికీ వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ ఒత్తిడి పెంచి, ఎన్నివిధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కేంద్రం తన తీరును మార్చుకోకుండా మొండిగా వ్యవహరించటాన్ని ఈ శాసనసభ గర్హిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పనప్పుడు, ప్రస్తుతం హోదా లబ్ధిని పొందుతున్న 11 రాష్ట్రాలకు ఆ ప్రయోజనాలు కొనసాగిస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఎందుకు నెరవేర్చరని శాసనసభ కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి భారత ప్రభుత్వ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నట్లుగా శాసనసభ అభిప్రాయపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పనిసరిగా పన్ను రాయితీలతో కూడిన ప్రత్యేక హోదాను ఇవ్వాలని, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరచిన అన్ని అంశాలను వెంటనే సంపూర్తిగా అమలు చేయాలని సభ డిమాండ్ చేస్తోంది. తద్వారా పార్లమెంటు వ్యవస్థ గొప్తనాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని కోరుతూ తీర్మానిస్తోంది.