రాష్ట్రీయం

అబద్ధాలకోరు కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని కే చంద్రశేఖరరావు (కేసీఆర్) కాంగ్రెస్‌ను మోసం చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. అలాగే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతను, రిజర్వేషన్లు పెంచుతామని ముస్లింలను టీఆర్‌ఎస్ అధినేత దగా చేశారని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కువ అబద్ధాలు, తప్పుడు ప్రకటనలు ఇవ్వడంలో కేసీఆర్‌ను మించిన వారు లేరని ఆయన విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో కనీసం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయలేని ఆయన ఇక కొత్త ఉద్యోగాలేమి భర్తీ చేస్తారని ఆజాద్ ఎద్దేవా చేసారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన గులాం నబీ అజాద్ గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. పార్లమెంట్‌లో మోదీ సర్కార్‌కు మద్దతిస్తున్న కేసీఆర్, రాష్ట్రంలో బీజేపీని విమర్శిస్తూ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దు నుంచి మొదలు పెడితే అవిశ్వాస తీర్మానం దాకా కేసీఆర్ భారతీయ జనతాపార్టీకే మద్దతుగా నిలిచారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్‌ఎస్ పాత్రే లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆజాద్ స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. తమ ఎంపీలు అధికార పార్టీలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసారని, ఇందులో టీఆర్‌ఎస్ పాత్ర ఎక్కడుందని ఆయన నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే సందర్భంలో కనీసం తాము టీఆర్‌ఎస్‌తో చర్చించలేదని కాంగ్రెస్ నేత వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు అడ్డుపడితే, వారిని ఒప్పించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆజాద్ తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం తమ వల్లే వచ్చిందని టీఆర్‌ఎస్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్. అయితే దుక్కిదున్ని విత్తనాలు నాటి పంట చేతికొచ్చాక టీఆర్‌ఎస్
కోసుకెళ్లింది’ అని ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను ఓడించి తప్పు చేశామన్న భావన తెలంగాణ ప్రజల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. కేసీఆర్ చెప్పే ప్రతీ మాట, ప్రతీ అడుగు అబద్ధమేనని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ స్వయంగా సోనియాగాంధీని కలిసి టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పి మోసం చేసారని విమర్శించారు. ఇందిరాగాంధీ కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి పోలికే లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ఎవరు కూడా తమ కొడుకు, కూతురు, అల్లుడిని మంత్రులుగా చేయలేదని ఆజాద్ ఎద్దేవా చేశారు.
చిత్రం..హైదరాబాద్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతున్న ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్.
చిత్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు