రాష్ట్రీయం

హాజరు కావల్సిందే....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 21: చట్టానికి అందరూ సమానులేనని, దీనికి ఎవరూ అతీతులు కారంటూ బాబ్లీ కేసుకు సంబంధించి ధర్మాబాద్ న్యాయస్థానం శుక్రవారం విస్పష్టంగా ప్రకటించింది. ముఖ్యమంత్రులైనా, ఎవరైనా కూడా కోర్టు ముందుకు రావాల్సిందేనని తెగేసి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై తీరాలని తేల్చిచెప్పిన కోర్టు విచారణంను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు హాజరైన ముగ్గురికి బెయిల్ ముంజూరు చేసింది. నిజామాబాద్ జిల్లా సరిహద్దున మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ‘బాబ్లీ’ ప్రాజెక్టు వివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో, చంద్రబాబు కోర్టుకు తప్పక హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎనిమిదేళ్ల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగు దేశం ఆధ్వర్యంలో బాబ్లీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర సరిహద్దులో ధర్నా నిర్వహించిన విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుసహా మరో 16 మందికి ధర్మాబాద్ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు వారం రోజుల క్రితం నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది. 21వ తేదీలోగా కోర్టులో హాజరుకావాలని ఆదేశించడంతో, చంద్రబాబు తరఫున అడ్వకేట్ సుబ్బారావు శుక్రవారం ధర్మాబాద్‌కు చేరుకుని రీకాల్ పిటిషన్ వేశారు. అయితే న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ముఖ్యమంత్రి అయినా సరే, కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని న్యాయస్థానం తేల్చి చెప్పడంతో, చేసేదేమీ లేక తమ క్లయింట్‌కు మరికొంత సమయం గడువు ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఇందుకు సమ్మతించిన జడ్జి, అక్టోబర్ 15వ తేదీన చంద్రబాబుసహా మిగతా 15మంది కూడా నేరుగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే ఈ కేసులో నోటీసులు అందుకున్న మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, టీ.ప్రకాష్‌గౌడ్, కేఎస్ రత్నం శుక్రవారం వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరయ్యారు. తమకు ఇదివరకు ఎలాంటి నోటీసులు రాలేదని, ప్రస్తుతం ఒక్కసారిగా నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్‌లతో కూడిన నోటీసులు అందించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారు కూడా రీకాల్ పిటిషన్‌లు దాఖలు చేయగా, న్యాయమూర్తి వారికి ఐదు వేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. అక్టోబర్ 15వ తేదీ నాటి విచారణకు హాజరుకావాలని వారిని సైతం ఆదేశించారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు తరఫున న్యాయవాది సుబ్బారావు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే కోర్టు ద్వారా అరెస్టు వారెంట్‌తో కూడిన నోటీసులు జారీ కావడం రాజకీయ దుమారం రేపుతున్న విషయం విదితమే. ఎన్డీఏ నుండి వైదొలగినందునే మోడీ సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదెపా ఆక్షేపిస్తుండగా, బాబ్లీ కేసులో వాయిదాలకు హాజరుకాకపోవడం వల్లే ఎన్‌బీడబ్ల్యూ వారెంట్ జారీ అయిందని, ఇందులో తమ ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో మహాకూటమితో జతకడుతుండడాన్ని జీర్ణించుకోలేకనే పాత కేసులను తిరగదోడి, ఇబ్బందులకు గురిచేసేలా తెరాస పార్టీ బీజేపీతో కుమ్మక్కై కుట్రలు చేస్తోందని కూడా టీటీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రీకాల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, అక్టోబర్ 15వ తేదీన చంద్రబాబు సహా మిగతా వారందరూ విచారణకు స్వయంగా హాజరుకావాలని కోర్టు తాజాగా ఆదేశించిన నేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ ప్రకంపనలు మరింతగా రాజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా, ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నోటీసులో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే పేరు సైతం ఉన్నప్పటికీ, తనకు ఎలాంటి నోటీసు అందలేదని ఆయన స్పష్టం చేశారు.