రాష్ట్రీయం

నాలెడ్జ్ ఎకానమీదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 24: ప్రవాసులకు ఈ ఏడాది ఓటుహక్కు వస్తుందని, నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. అమెరికా పర్యటనలో భాగంగా తొలిరోజు న్యూజెర్సీలోని ‘న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ సెనేట్’లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రవాస భారతీయుల ఓటు హక్కుకు సంబంధించిన బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిందని, త్వరలో రాజ్యసభ ముందుకు వస్తుందని తెలిపారు. దీనివల్ల
నివాసమున్న ప్రాంతం నుంచే ఓటు వేసే అవకాశం ప్రవాసులకు లభిస్తుందని చెప్పారు. ప్రవాసాంధ్రులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటంతో పాటు ప్రచారం కూడా చేయాలని కోరారు. ఏ పార్టీ వల్ల పైకి వచ్చామో ఆ పార్టీ తరపున బాధ్యతగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఎన్నారై టీడీపీలో అంతా సభ్యులు కావాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజాసేవ చేయాలని పరితపించే ప్రవాస తెలుగువారికి అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. దూరం అనేది సమస్య కాదని, రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగువారు ప్రభుత్వానికి ఎలా సహకరిస్తున్నారో ప్రవాసులు కూడా అదే తరహాలో సహకారం అందించవచ్చన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల సమాచారం ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచామని, దీనిద్వారా ఎవరు ఏవిధంగా ఎంతమేరకు సాయం చేయవచ్చనే అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. సొంత గ్రామానికి ఏంచేయాలో ఆలోచించాలని సూచించిన ముఖ్యమంత్రి ఆ ఆలోచనలను గ్రామస్తులతో పంచుకోవాలని ‘గ్రామదర్శిని, వార్డుదర్శిని’కి చేయూత ఇవ్వాలని కోరారు. విజ్ఞానం గ్రామాభివృద్ధికి దోహదపడేలా కృషి చేయటమే కాకుండా సమస్యల పరిష్కారానికి ప్రతిఒక్కరూ వినూత్న ఆలోచనలు చేయాల్సి ఉందన్నారు. ప్రవాస తెలుగువారు రెండు విషయాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలన్నారు. ఒకటి కష్టపడి పనిచేయటం, రెండోది జన్మభూమిని మరచిపోకుండా ఉండటమని ఆయన ఉద్భోదించారు. తాను ఆత్మవిశ్వాసం, ఎన్టీఆర్ ఆత్మగౌరవం నినాదాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగామని చెప్పారు. న్యూయార్క్ నగరంలో పసుపుజెండా ఇంతలా ఎగురుతుందని ఎన్టీఆర్ ఊహించలేదని, తెలుగునేలపై నుంచి ప్రపంచం నలువైపులా పార్టీ జెండా కనిపించటం తనకు నూతనోత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. ఇది తమ పార్టీకి దక్కిన గౌరవంగా అభివర్ణించారు. త్వరలోనే ఎన్నారై టీడీపీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమెరికాలోని తెలుగువారంతా వ్యవసాయ రంగంలోనే కాదు, నాలెడ్జి ఎకానమీలోనూ ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఏంచేస్తే మనవాళ్లకు భవిష్యత్తు బాగుంటుందనే విషయమై అమెరికాలోని ప్రవాస తెలుగువారితో సమాలోచనలు జరిపారు. సమైక్యాంధ్రలో ఐటీ దిగ్గజం బిల్‌గేట్స్‌తో గడిపిన క్షణాలను గుర్తుచేశారు. నాడు మైక్రోసాఫ్ట్ కార్యాలయం హైదరాబాద్‌కు రావాలని కోరుకున్నామని, ఇవాళ అదే సంస్థ సీఈఓగా మన తెలుగుబిడ్డ ఉండటం మన సత్తా, తెలివితేటలకు నిదర్శనమని ఆయన ప్రశంసించారు. ఐటీ రంగంపై తాను పెట్టిన శ్రద్ధ కారణంగానే అమెరికాలో ఇందరు ఆంధ్రులకు ప్రవేశం లభించిందన్నారు. అమెరికన్ పౌరులతో మమేకం కావాలని, రాజకీయాల్లో సహకరించాలని సూచించారు. శ్రమదానం ద్వారా సామాజిక కార్యక్రమాలకు సహకరించండని పిలుపునిచ్చారు. ఉద్యోగంతో సంతృప్తి చెందక పదిమందికీ ఉపాధి కల్పించే శక్తిగా ఎదగాలన్నారు. ఇందుకు యూదులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల జనాభా 8.5 కోట్ల మందిమి ఉన్నామని, యూదుల గురించి మాట్లాడుకుంటున్నట్టే ప్రపంచమంతా తెలుగుజాతి గురించి చెప్పుకునే రోజు రావాలని ఆయన ఆకాంక్షించారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలనేదే తన సంకల్పంగా చెప్పారు. ఇందుకోసం పట్టుదలతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని, కేంద్రం సహకరించటం లేదన్నారు. అయినా తాను వదిలిపెట్టటం లేదని, ప్రపంచంలో ఆంధ్రావనిని అత్యున్నతంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇందుకు అందరి సహకారం కావాలని చంద్రబాబు కోరారు. ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలని, ప్రతి తెలుగువారు ఓ పారిశ్రామికవేత్తలా ఎదగాలని ఆకాంక్షించారు. ఇక్కడ స్థిరపడిన వారు మీ గ్రామాన్ని ఐటీతో అనుసంధానం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి జీ. సాయిప్రసాద్, ఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణకిషోర్, సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
చిత్రాలు.. అమెరికాలోని ప్రవాసాంధ్రుల సదస్సులో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు