రాష్ట్రీయం

కిడారి, సోమకు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/అరకు/ పాడేరు: మావోయిస్ట్‌ల చేతిలో ఆదివారం హత్యకు గురైన అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం కండ్రాం గ్రామానికి వెళుతుండగా మావోయిస్ట్‌లు వీరిని హతమార్చిన సంగతి తెలిసిందే. వీరి భౌతికకాయాలకు అరుకు ఏరియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. విశాఖ కేజీహెచ్ నుంచి వెళ్లిన డాక్టర్ల బృందం దాదాపూ ఆరు గంటలపాటు ఈ ప్రక్రియను పూర్తిచేశారు. సోమ భౌతికకాయాన్ని అరుకులో ఉంచారు. సర్వేశ్వరరావు భౌతికకాయాన్ని పాడేరుకు తరలించారు. అక్కడి కిడారి క్యాంపు కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు వచ్చి
కిడారి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆ తరువాత అరకులో సివేరి సోమకు, పాడేరులో సర్వేశ్వరరావు భౌతికకాయాలకు ప్రభుత్వ లాంఛనాలతో సోమవారం అంత్యక్రియలు జరిగాయి. వీరిద్దరి అంత్యక్రియలు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అరుకు, పాడేరులో నిర్వహించారు. వీరి అంత్యక్రియలకు హోం మంత్రి చినరాజప్ప, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, గిరిజనశాఖ సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్, గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు హాజరయ్యారు. వీరంతా రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి ముందుగా అరుకు వెళ్లారు. అక్కడ సోమ భౌతికకాయంవద్ద వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. వీరంతా అక్కడి నుంచి పాడేరు చేరుకుని సర్వేశ్వరరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే మృతుల బంధువులను పరామర్శించనున్నారని హోం మంత్రి చినరాజప్ప తెలియచేశారు.
సోమ భౌతికకాయాన్ని మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఊరేగించి ఆ తరువాత క్రైస్తవ మత సంప్రదాయారీతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. పాడేరులో సర్వేశ్వరరావు భౌతికకాయాన్ని ఊరేగించి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సర్వేశ్వరరావు మృతదేహానికి ఆయన కుమారుడు శ్రావణ్ తలకొరివి పెట్టాడు. సర్వేశ్వరరావు భౌతికకాయాన్ని క్యాంపు కార్యాలయం నుంచి బయటకు తీసుకురాగానే భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ వేలాది మంది ఆయన భౌతికకాయం వెంట శ్మశానవాటి వరకూ వెళ్లారు. అక్కడ మంత్రులు అయ్యన్నపాత్రుడు, నక్కాఆనందబాబు, మాజీ మంత్రి బాలరాజు తదితరులు ఉన్నారు.
సోమ, సర్వేశ్వరరావు నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్‌బాబు, గిడ్డి ఈశ్వరి, అనిత, వాసుపల్లి గణేష్‌కుమార్, గణబాబు, పీలా గోవింద్, ఎమ్మెల్సీలు పప్పల చలపతిరావు, పీవీఎన్ మాధవ్, గుమ్మడి సంధ్యారాణి, ఈపీడీసీఎల్ డైరక్టర్ శోభా హైమవతి, మాజీ మంత్రి మణికుమారి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ కారెం శివాజీ, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జేసీ సృజన, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ ఏ.బీ.వెంకటేశ్వర్లు, డీఐజీ శ్రీకాంత్, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తదిరులు ఉన్నారు.

చిత్రాలు.. సర్వేశ్వరరావు భౌతికకాయాన్ని ఊరేగిస్తున్న దృశ్యం.
* సోమ భౌతికకాయం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు