రాష్ట్రీయం

సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 25: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చే సామాన్య భక్తులందరూ స్వామిని దర్శించుకోవడానికి వీలుగా అధికప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ అధికారులకు సూచించానని భారత ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. ఉప రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చిన వెంకయ్యనాయుడు తిరిగి ఏడాది తరువాత స్వామివారిని దర్శించుకోవడానికి సోమవారం తిరుమలకు వచ్చారు. మంగళవారం ఉదయం విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఉపరాష్టప్రతి హోదాలో శ్రీవారి ఆలయ మహాద్వారం గుండా ఆలయంలోకి వెళ్లే సౌలభ్యం ఉన్నప్పటికీ ఆయన సామాన్య భక్తుడిలా కుటుంబ సభ్యులతో కలసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయం మహాద్వారం వద్దకు రాగానే టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు సాదర స్వాగతం పలుకగా, అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు శ్రీవారి సన్నిధికి కుటుంబ సభ్యులతో కలసి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి వైభవాన్ని, ఆభరణాల విశేషాలను వివరించారు. ఆలయం తరపున స్వామివారి శేష వస్త్రాన్ని ఉపరాష్టప్రతికి బహూకరించారు. అనంతరం ఉపరాష్టప్రతి కుటుంబ సభ్యులతో కలిసి వకుళ మాత ఆలయాన్ని, విమాన వేంకటేశ్వర స్వామిని, భాష్యకారుల సన్నిధిని, యోగ నరసింహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత హుండీలో కానుకలు సమర్పించి, ధ్వజస్తంభం దర్శనం చేసుకుని రంగనాయక మండపం చేరుకున్నారు. ఈసందర్భంగా వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. ఈఓ ఏకే సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు ఉపరాష్టప్రతి ఆయన కుటుంబ సభ్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారి చిత్రపటాన్ని, నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఉపరాష్టప్రతి విలేఖరులతో మాట్లాడుతూ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి మీద రోజురోజుకీ ప్రజల్లో అపార భక్తి విశ్వాసాలు పెరుగుతున్నాయని, దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్వామివారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వారంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు వస్తున్నారని చెప్పారు. తిరుమలకు వచ్చే ప్రతి సామాన్య భక్తుడు స్వామిని దర్శించుకునేలా ఎక్కువ సమయం కేటాయించాలని సూచించానన్నారు. ఈ క్రమంలో ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఏడాదికి ఒకమారు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే సామాన్యభక్తులకు సులభంగా దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు. వీఐపీలు, వీవీఐపీలు తిరుమలకు తమ రాకపోకలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. తాను నాడు ఎంపీగా ఉన్నా, నేడు ఉపరాష్టప్రతిగా ఉన్నా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే స్వామివారి దర్శించుకునేందుకు ఇష్టపడతానన్నారు. రాజ్యాంగ పరంగా ఉప రాష్టప్రతి హోదాకు ఆలయమహాద్వారం గుండా వెళ్లే సౌలభ్యం ఉందని గుర్తు చేశారు. తాను ఉపరాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారత ప్రజలకు సేవలు అందించేందుకు తనకు మరింత శక్తిని, సామర్థ్యాన్ని, ఓపికను ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించానన్నారు. శ్రీవారి దర్శనానికి తాను వచ్చినప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పళణీస్వామి కూడా తిరుమలకు వచ్చారని, తాను వచ్చిన విషయం తెలుసుకుని మర్యాద పూర్వకంగా కలిశారని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశాఖపట్నం అరుకులో మావోయిస్టులు ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని కాల్చి చంపిన ఘటనపై స్పందించాలని కోరగా తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని, ఉపరాష్టప్రతిగా తనకు కొన్ని పరిధులు ఉన్నాయన్నారు. ఉప రాష్టప్రతి వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డి, జిల్లాకలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ అభిషేక్ మహంతి, టీటీడీ ఇన్చార్జ్ సీవీ ఎస్వో శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ తదితరులు ఉన్నారు.
చిత్రం..విద్యార్థినులతో ముచ్చటిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు