రాష్ట్రీయం

‘20 సూత్రాల’పై శీతకన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ నల్లగొండ, డిసెంబర్ 1: ఇందిరాగాంధీ ప్రధానిగా పనిచేసిన సమయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం’ (20 పాయింట్ ప్రోగ్రాం) ఉం టుందా? ఊడుతుందా? అన్నది చర్చనీయాంశం అయింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి కేంద్రీకరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతి ఏటా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల అమలు తీరుతెన్నులపై సమగ్ర నివేదికను కేంద్రం వెల్లడిస్తుంది. అయితే 2014-15 సంవత్సరానికి ఈ వివరాలు ప్రకటించలేదు. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని 1975లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించడంతో ఇందిరాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందన్న అభిప్రాయం ప్రస్తుత ప్రభుత్వంలో ఉండటంతో దీన్ని గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎపి ప్రభుత్వం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం చైర్మన్‌గా వై.శ్రీనివాస శేష సాయిబాబును పదినెలల క్రితమే నియమించింది. రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ 20 సూత్రాల పథకంపై ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. ఇరవై సూత్రాల పథకం కిందకు వచ్చే పథకాలు, కార్యక్రమాలను జిల్లాస్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఆయన సమీక్ష చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం చైర్మన్‌ను నియమించలేదు. దాంతో తెలంగాణలో ఈ పథకం అమలు సజావుగా సాగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బిపి ఆచార్య, డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి తరచూ సమీక్షలు చేస్తున్నారు. అయితే చైర్మన్ లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. చైర్మన్ పోస్టు రాజకీయపరంగా ఉన్నప్పటికీ, ఈ పోస్టు క్యాబినెట్ హోదాలో ఉండటం వల్ల సమీక్షల సందర్భంగా రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారుల్లో కూడా బాధ్యత కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పథకంలో 20 సూత్రాలు, 65 ఐటమ్స్, 160 ప్యారామీటర్లు ఉంటాయి. ఇరవై సూత్రాల్లో ఉపాధి హామీ, ఆహార భద్రత, రక్షితమంచినీరు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాల సంక్షేమ పథకాలు, సమగ్ర స్ర్తి శిశు సంక్షేమం, అడవులు గ్రామీణ రహదారుల అభివృద్ధి, వ్యవసాయ విద్యుత్తు, అందరికీ ఆరోగ్యం, పేదలకు గృహవసతి తదితర అంశాలున్నాయి.
వీటిపై వివరంగా సమీక్షించి అమలు తీరును అనుసరించి జిల్లా స్థాయిలోనూ, రాష్టస్థ్రాయిలోనూ గ్రేడింగ్ ఇస్తుంటారు. ఈ పథకాల అమల్లో రాష్టస్థ్రాయిలో ఉత్తమమైన జిల్లాల ఎంపిక జరుగుతుండగా, జాతీయ స్థాయిలో ఉత్తమమైన రాష్ట్రాల ఎంపిక జరుగుతుంది. సమైక్య రాష్ట్రంగా ఉండగా విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పర్యాయం ఎపి జాతీయ స్థాయిలో ఉత్తమమైన రాష్ట్రంగా ఎంపికైంది.
చంద్రబాబు మంచిపాలనాధక్షుడు అని పేరున్నప్పటికీ, ఆయన హయాంలో ఎపి రాష్ట్రం 20 సూత్రాల పథకం అమల్లో ఏనాడూ మొదటి స్థానం పొందలేదన్న విమర్శలున్నాయి. ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నసమయంలో 2010-11, 2011-12, 2012-13 సంవత్సరాల్లో వరుసగా జాతీయ స్థాయిలో ఎపి మొదటిస్థానం పొందిందని ఆనాటి ఇరవై సూత్రాల పథకం చైర్మన్ ఎన్. తులసిరెడ్డి గుర్తు చేశారు. మంగళవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ఈ కార్యక్రమం ఒక గీటురాయిగా ఉంటుందన్నారు.
పథకాలు, కార్యక్రమాల మంజూరు చేసే అధికారం ఈ విభాగానికి లేకపోయినా, మానిటర్ చేసే అధికారం ఉంటుందని, అందువల్ల సత్ఫలితాలు వస్తాయన్నారు. 20 సూత్రాల పథకం అమల్లో ఆర్థిక, ఫిజికల్ అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారని వివరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చేందుకు ప్రయత్నిస్తోందని తులసిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.