రాష్ట్రీయం

వ్యూహ ప్రతివ్యూహాల్లో పోలీసులు.. మావోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ మన్యంలో మళ్లీ అలజడి మొదలైంది. పోలీసులు, మావోయిస్ట్‌ల వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య గిరిజనులు నలిగిపోతున్నారు. రామగుడ ఎన్‌కౌంటర్ తరువాత విశాఖ మన్యంలో రెండేళ్లుగా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. ఈ ఘటన వలన మావోయిస్ట్‌లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇదే సమయంలో పోలీసులు మన్యంపై పట్టుసాధించారు. దీంతో కొంత కాలం మన్యంలో ఇరు వర్గాల నుంచి గిరిజనులు ఎటువంటి వేధింపులకు గురికాలేదు. తాజాగా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్ట్‌లు హత్య చేసిన తరువాత ఏవోబీలో మళ్లీ అలజడి మొదలైంది. మావోయిస్ట్‌ల వేటలో పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుండగా, వారిని మట్టుపెట్టడానికి మావోయిస్ట్‌లు ప్రతి వ్యూహాలను రచిస్తున్నారు. కిడారి, సివేరి హత్యతో పోలీసుల ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతింది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు పోలీసులు ఏజెన్సీలో జల్లెడపడుతున్నారు. ఇదే సమయంలో అస్వస్థతకు గురై డుంబ్రిగుడ మండలం ఆండ్రపల్లిలో చికిత్స పొందుతున్న ఏవోబీ డిప్యూటీ కమాండర్ మీనా ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం పట్ల అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ ఎదురుకాల్పులు బూటకమని మావోయిస్ట్‌లు అంటున్నారు. కిడారి, సివేరిని హత్య చేసిన కేసులో మీనా ఏ21 అని పోలీసులు పేర్కొంటున్నారు. కిడారి, సివేరి హత్య తరువాత మావోయిస్ట్‌లు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ మీనా ఎన్‌కౌంటర్‌పై ఏఓబీ మావోయిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు కైలాసం పేరుతో సోమవారం ఒక ఆడియో మీడియాకు చేరింది. ఇందులో మీనాను లేని లోటు తీర్చలేనిదంటూ పేర్కొన్నారు.
గత నెల 23న కిడారి, సివేరిని హత్య చేసి తప్పించుకున్న 50 మంది మావోయిస్ట్‌లు పోలీసులు కండపడకుండా తిరుగుతున్నారు. ఈ జంట హత్యల్లో ఆర్కేను ఏ1గా, చలపతిని ఏ2గా, అరుణను ఏ3గా చేర్చారు. అయితే, ఇంత దారుణ ఘటనకు సూత్రధారులు, పాత్రధారులను సున్నితంగా పక్కన పెట్టారు. ఈ ఘటనలో వీరి పాత్ర ఏమేరకు ఉందన్న విషయాన్ని పోలీసులు ఇప్పటికే బయటపెట్టినా, మావోయిస్ట్‌లనే టార్గెట్‌గా చేసుకుని కేసులు నమోదు చేయడం గమనార్హం.
ఇక ప్రత్యేక పోలీసులు బలగాలు అడివిలో గాలిస్తున్నా, అక్కడక్కడ మావోయిస్ట్‌ల కదలికలు ఉన్నాయి. మావోయిస్ట్‌ల జాడకోసం పోలీసులు ఏఓబీలోని అనేక గిరిజన గ్రామాల్లోకి వెళ్లి గిరిజన యువకులను పదేపదే ప్రశ్నిస్తున్నారు. వారి ఇళ్ళకు వచ్చిన బంధువులను
కూడా ప్రశ్నిస్తున్నట్టు కైలాసం విడుదల చేసిన ఆడియోలో పేర్కొనడం గమనార్హం. గతంలో మాదిరి పోలీసు బలగాలు మళ్లీ గిరిజనులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం వలన పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గతంలో ఇలాంటి సందర్భంలోనే ఏవోబీలోని కొన్ని గ్రామాల్లో మగవాళ్లు గ్రామాలు విడిచి వెళ్లిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మళ్లీ అలాంటి భయానక వాతావరణం ఏర్పడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏవోబీలో ఒడిశా, ఏపీ పోలీసుల జాయింట్ కూంబింగ్ జరుగుతున్నా, వారిని మట్టుపెట్టడానికి మావోయిస్ట్‌లు ప్రతి వ్యూహాన్ని రచిస్తున్నారంటే, మావోయిస్ట్‌లు ఎంతకు తెగించారన్నది అర్థమవుతోంది. కొద్ది రోజుల కిందటే ఏఓబీలో మావోయిస్ట్‌లు మందుపాతర పేల్చడమే ఇందుకు నిదర్శనం. దీన్నిబట్టి మావోల కోసం పోలీసులు, పోలీసుల కోసం మావోయిస్ట్‌లు వేట మొదలు పెట్టారన్నది అర్థమవుతోంది.
ఏఓబీ మావోయిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు
కైలాసం ఆడియో సారాంశం
ఏఓబీ మావోయిస్ట్ పార్టీ సీనియర్ నాయుకుడు కైలాసం పేరిట సోమవారం ఒక ఆడియో మీడియాకు చేరింది. ఇటీవల పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన మీనా మరణాన్ని ప్రస్తావిస్తునే, ఏఓబీలో ఉద్రిక్త పరిస్థితుల గురించి ఆయన మాట్లాడారు.
‘మీనా లేని లోటు ఉద్యమానికి, ఏఓబీలోని పార్టీకి తీవ్రమైన నష్టం. ఈ నష్టాన్ని తిరిగి భర్తీ చేసుకుంటాం. అమరుల ఆశయాలను కొనసాగించేందుకు మీనా లేని లోటును భర్తీ చేసుకుంటాం. తుపాకి కాల్పులతో ఏఓబీలో పోలీసులు తీవ్రమైన భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కటాఫ్ ఏరియాలో వారం రోజులుగా, పెదబయలు, ముంచింగిపుట్ మండలాలతో పాటు, ఒడిశాలోని మల్కన్‌గిరి, ఆండ్రపల్లి, పనసపుట్టు, జంత్రి ప్రాంతాల్లో పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. జంత్రి, ఆండ్రపల్లి మహిళలపై హింసకు పాల్పడుతున్నారు. బీఎస్‌ఎఫ్ పోలీసులు తీవ్రంగా దాడిచేసి, ఐదుగురు గిరిజనులను గాయపరిచారు. అప్రకటిత నిర్బంధం, తీవ్రమైన హింస కొనసాగుతోంది. కర్ఫ్యూవాతావరణం కనిపిస్తోంది. ఆండ్రపల్లి ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదు. చుట్టపు చూపుగా వచ్చిన వారిని అక్రమంగా నిర్బంధించి తీసుకువెళ్లారు. తీసుకువెళ్లేటప్పుడు ఫైరింగ్ చేశారు. అక్కడి గ్రామస్తులు ప్రతిఘటిస్తున్నా, వారిని బలవంతంగా తీసుకువెళ్లారు. ఇలాంటి ఘటనలతో గిరిజనులను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నారు. వారిని బేషరుతుగా విడుదల చేయాలి. ఒడిశా ఏరియాలో గిరిజనుల భూములను వారికి లేకుండా చేస్తున్నారు. ఏపీలో పోలీసులు భయాందోళనలు సృష్టిస్తున్నారు. గిరిజనులపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ఏజెన్సీలో భయాందోళనలు సృష్టిస్తున్న పోలీసుల రాజ్యాన్ని పారదోలడానికి ఉద్యమాలు చేస్తున్నాం.’