రాష్ట్రీయం

ఆ నోటా..ఈ నోటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెల్లని నోటు..చెల్లని ఫేసూ ఒకటే! ఇప్పుడు కొత్తగా ఎవరూ కాదనుకునే అభ్యర్థులూ వచ్చారు. ఇది ప్రజాస్వామ్యం. ఇదే ప్రజాస్వామ్యం. ప్రజలు ఓటేస్తే గెలుస్తారు. వేయకపోతే ఓడిపోతారు. మరి తిరస్కరిస్తే..చెల్లకుండా పోతారు. ఇప్పుడు చెల్లని ఓట్ల కంటే కూడా చెల్లని అభ్యర్థుల సంఖ్య పెరిగిపోతోంది. ఈవీఎమ్‌ల పుణ్యమా అని ప్రజాస్వామ్య భారతంలో ప్రజలకు ఈ మహదవకాశం దక్కింది. ఉన్న వారిలో ఎవరో ఒకర్ని చచ్చినట్టు ఎన్ను కోవాల్సిన పనిలేదు. వారెవరూ వద్దనుకునే ఆప్షన్ అందిరావడంతో జనం రోజురోజుకూ, ఎన్నిక ఎన్నికకూ నోటా బాట పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఉన్న అభ్యర్థుల కంటే ‘నోటా’కాటుపడ్డ ఓట్లే ఎక్కువగా ఉన్న దాఖలాలూ ఉన్నాయి. ఓటు హక్కు ఎంత ముఖ్యమో..దాన్ని అంతే పవిత్రంగా, నిబద్ధంగా వినియోగించడమూ అంతే రాజ్యాంగ అవసరం. రాజ్యాంగం మనకు కల్పించిన ఈ ఓటు హక్కు శుష్కహామీల పరం కాకుండా, నిఖార్సయిన మాటలకు వనె్నతెస్తే ఎలాంటి బెంగా ఉండదు. కానీ, ఇలా జరగడం లేదన్నదే వాదన. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిపోయింది. తొలి ఎన్నిక నుంచి నేటి భారత ఎన్నిక వరకూ నేతల నోట ఒకే మాట..అదే పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన. ఈ రెంటికోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. పేదరిక లోతులు ఎంత తవ్వినా అంతకు మించి పెరిగిపోతున్నాయి. ఉపాధి కూడా అందనిమావి చందంగా ఎప్పుడూ వికటాట్టహాసం చేస్తూనే ఉంటోంది. మరి ఇన్ని లక్షల కోట్లు ఏమైనట్టు..మనం వేసిన ఓటు విలువ ఎటు పోయినట్టు? నమ్మి ఓటు వేయడం కంటే నమ్మకం లేదని చెప్పడమే మేలనుకునే యువత సంఖ్య పెరుగుతోంది. అందుకే నోటా పదునెక్కుతోంది. మాయమాటలు చెప్పి..ఓటర్లను బుట్టలో వేసుకున్నామనుకుంటే అది భ్రమేనన్న చైతన్యం పెరుగుతోంది. అందుకే నోటా కాటు పడకూడదనుకుంటే నోటి మాటకు విలువివ్వాలి. చేయగలిగేదే చెప్పాలి. నిజాయితీని నిలబెట్టుకోవాలి. ఓటు మాట ఎలా ఉన్నా ముందు నోటా బారిన పడకుండా తమ పరువును కాపాడుకోవాల్సిన అగత్యం ఇప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులకూ ఏర్పడింది. ప్రజాస్వామ్యమా మజాకా..!