ఆంధ్రప్రదేశ్‌

గందరగోళం మధ్య టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం:రాష్టవ్య్రాప్తంగా సోమవారం మొదలైన పదో తరగతి పరీక్షలు అటు విద్యార్థులకు, ఇటు పరీక్ష నిర్వహణాధికారులకు నిజంగానే పరీక్ష పెట్టాయి. తొలిరోజు తెలుగు పేపర్ వన్‌లో పద్యభాగంలో నాలుగు పాఠాలుండగా ఒకే పాఠంలోని రెండు పద్యాలిచ్చి వాటికి తాత్పర్యం రాయమనడంతో విద్యార్థులు తికమకపడ్డారు. సాధారణంగా వేర్వేరు పాఠాల నుంచి వేర్వేరు పద్యాలిచ్చి వాటికి అర్ధాలు రాయమంటారు. దీంతో విద్యార్థులు మొదట ఆశ్చర్యపోయినా తరువాత సర్దుకున్నారు. తెలుగు పరీక్షలో మాల్‌ప్రాక్టీస్ చేస్తూ విశాఖ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు దొరికిపోగా వారిని డీబార్ చేసినట్లు డిఇఒ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో సోమవారం తెలుగుకు బదులు సంస్కృతం పేపరు పంపిణీ చేయడంతో గందరగోళం నెలకొంది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి పొరపాటు సరిదిద్దాక అరగంట ఆలస్యంతో తెలుగు పేపర్ పంపిణీ చేశారు.
తల్లి మృతి వార్త దాచి పరీక్ష రాయించిన టీచర్లు!
రామాపురం: తల్లి మృతిచెందిన వార్త విద్యార్థికి చెప్పకుండా, రెండుగంటలు మనసులోనే ఉంచుకున్న టీచర్లు, ఇన్విజిలేటర్లు చివరికి పదో తరగతి తొలి పరీక్ష పూర్తయిన తరువాత ఆ దుర్వార్తను విద్యార్థికి చెప్పారు. కడప జిల్లా రామాపురంలో సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు.. మైదుకూరు మండలం విశ్వనాథపురానికి చెందిన టెన్త్ విద్యార్థి పొన్నూరు పవన్‌కుమార్‌కు రామాపురం ఆదర్శ పాఠశాల సెంటర్ రావడంతో ఉదయమే కేంద్రం వద్దకు చేరుకున్నాడు. పరీక్ష ఆరంభమైన కొద్దిసేపటికి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చిట్టిబాబుకు పవన్‌కుమార్ తల్లి కొండమ్మ మృతిచెందిందంటూ బంధువులు ఫోన్లో సమాచారం అందించారు. దీంతో ఈ విషయాన్ని అక్కడి రామాపురం ప్రిన్సిపాల్‌కు తెలియజేయడంతో ఇన్విజిలేటర్లు ఈ విషయాన్ని విద్యార్థికి చెప్పాలా, వద్దా అని తీవ్రంగా మదనపడ్డారు. ఏంచేయాలో పాలుపోక వెంటనే జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డికి విషయాన్ని చేరవేయడంతో ఆయన హుటాహుటిన పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పవన్‌కుమార్ పరీక్ష రాస్తున్న గదికి వెళ్లి పరిశీలించి ప్రిన్సిపాల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఏదేమైనా పరీక్ష అయ్యేవరకు విద్యార్థికి విషయం చెప్పొద్దని ఇన్విజిలేటర్‌ను ఆదేశించారు. పరీక్ష పూర్తయ్యాక పవన్‌కుమార్‌ను కార్యాలయంలోకి పిలిపించి ఓదార్చారు.
తల్లి... మరణం.. బిడ్డకు పరీక్షా కాలం
తిరుపతి: మరో గంటలో పదోతరగతి పరీక్షలు రాయాలి... అమ్మ తల దువ్వి పరీక్షలకు సిద్ధం చేసింది. బాగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆత్మ విశ్వాసం పెంచి తన బిడ్డను ఆశీర్వదించింది. ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి బయలు దేరడానికి కొన్ని క్షణాల ముందు ఇంట్లో తల్లి కాలుజారి కిందపడటంతో ఆమె తలపై గాయమై కుప్పకూలి మృత్యుఒడిలోకి జారుకుంది. ఓ వైపు పరీక్షకు వెళ్ళే సమయం మించి పోతోంది. కిందపడ్డ అమ్మ కళ్ళు తెరవడంలేదు. అమ్మా... అమ్మా ... అని ఎంత పిలిచినా ఆ తల్లి పలుకులు పెదవి దాటడంలేదు. విగత జీవిగా ఉన్న తల్లిని చూసి బిడ్డ జయశ్రీ తల్లడిల్లింది. పదో తరగతి పాస్ కావాలని తన అమ్మ కోరికను తీర్చాలనుకున్న జయశ్రీ గుండెను దిటవు చేసుకుంది. పరీక్షా కేంద్రం వైపు అడుగులు వేసింది. ఓవైపు కంటనీరు ధారగా కారుతున్నా తుడుచుకుంటూ మనో నిబ్బరంతో పరీక్ష రాసింది.

ఎంసెట్‌కు 2.76 లక్షల దరఖాస్తులు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, మార్చి 21: ఎపి ఎంసెట్-2016కు దరఖాస్తుల దాఖలుకు చివరి రోజైన సోమవారం నాటికి 2,76,089 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ ఏడాది రెండున్నర లక్షల వరకు దరఖాస్తులు దాఖలు కావచ్చని నిర్వహిస్తున్న జెఎన్‌టియుకె వర్గాలు భావించాయి. అయితే వారి అంచనాలకు మించి విద్యార్థులు దరఖాస్తులు దాఖలుచేశారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి 1,77,051, మెడిసిన్, అగ్రికల్చర్‌లో ప్రవేశానికి 96,940, రెండింటికి కలిపి 1,049 మంది విద్యార్థులు దరఖాస్తులు దాఖలు చేసుకున్నట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి తెలిపారు. దరఖాస్తుల దాఖలుకు విధించిన గడువు సోమవారంతో పూర్తికావడంతో, మంగళవారం నుండి అపరాధ రుసుంతో దాఖలు చేసుకునే అవకాశం ఉంది. మంగళవారం నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు రూ.500 అపరాధ రుసుంతో, ఏప్రిల్ 11 వరకు రూ.1000, ఏప్రిల్ 19వ తేదీ వరకు రూ.5000 అపరాధ రుసుంతో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఆయన వివరించారు.

శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు సిఎం కుటుంబం 20 లక్షల విరాళం
తిరుమల, మార్చి 21: రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు కుటుంబం తరపున ఎస్వీ నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.20లక్షలు విరాళంగా అందినట్లు టిటిడి తిరుమల జె ఇ ఒ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమల్లోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సి ఎం చంద్రబాబు నాయుడి మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈమేరకు విరాళం చెక్కును పంపించినట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణకు రోజుకు రూ.20లక్షలు ఖర్చు అవుతోందని అన్నారు. అనంతరం విరాళం చెక్కును ఆయన టిటిడి అన్నప్రసాద విభాగం అధికారులకు అందించారు.

సచివాలయ పనులు పరిశీలించిన జస్టిస్ రమణ
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు మార్చి 21: తుళ్లూరు వద్ద కేంద్ర రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెంలో సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన సమయంలో సభకు హాజరైన జస్టిస్ రమణ మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. జస్టిస్ రమణ వెంట సిఆర్‌డిఎ కమిషనర్ ఎన్ శ్రీకాంత్, సిఆర్‌డిఎ అదనపు కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఆర్డీవో భాస్కరనాయుడు, రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, డిఎస్పీ మధుసూదనరావు, తుళ్లూరు తహశీల్దార్ ఎ సుధీర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఏసిబి వలలో గోస్పాడు ట్రాన్స్‌కో ఎఇ
నంద్యాలటౌన్, మార్చి 21: కర్నూలు జిల్లా నంద్యాల నియోజక వర్గంలోని గోస్పాడు మండలంలో విద్యుత్‌శాఖ ఎఇగా పనిచేస్తున్న రామచంద్రుడు సోమవారం మధ్యాహ్నం లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఎసిబి డిఎస్పీ మహబూబ్ బాషా తెలిపిన వివరాల మేరకు.. గోస్పాడు మండలం కానాలపల్లె మెట్ట మీద పుల్లయ్య అనే వ్యక్తి గోదామును నిర్మించుకున్నాడు. దానికి అవసరమైన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన పైకం చెల్లించాడు. అయినా ఏడాది నుంచి ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వకుండా లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని ఎఇ డిమాండ్ చేయటంతో పుల్లయ్య చివరికి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీనిపై ఎసిబి అధికారులు రూపొందించిన పథకం ప్రకారం సోమవారం మధ్యాహ్నం నంద్యాల తహశీల్దార్ కార్యాలయం సమీపంలోని ఓ ఫ్రూట్‌జ్యూస్ స్టాల్ వద్ద ఎఇ రామచంద్రుడికి పుల్లయ్య నగదు ఇస్తుండగా ఎసిబి అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
హోదాపై త్వరలోనే స్పష్టత: సోము వీర్రాజు
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మార్చి 21: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదానా, లేక ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడమా అన్నదానిపై కేంద్రం త్వరలోనే స్పష్టత వస్తుందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. సోము వీర్రాజు సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ దేశానికి అపకీర్తితెచ్చే శక్తులను వ్యతిరేకించాలని బిజెపి జాతీయ కార్యవర్గం అభిప్రాయపడిందన్నారు. జెఎన్‌యులో జరిగిన ఘటనలకు జాతివ్యతిరేక శక్తుల కారణమని ఆయన ఆరోపించారు. రాజకీయంగా కనుమరుగవుతామన్న భయంతోనే ప్రతిపక్షాలు కేంద్రం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయన్నారు. కేంద్రం పేదలకు అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తుందని, వాటిని కార్యకర్తలు గ్రామస్థాయికి తీసుకెళ్లాల్సిందిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సూచించారన్నారు.
సమర్థతకు దక్కిన ప్రతిఫలం
పిఎసికి బుగ్గన పేరు సిఫారసు చేసిన జగన్
ఆంధ్రభూమిబ్యూరో
కర్నూలు, మార్చి 21: శాసనసభ ప్రజా పద్దుల సంఘం (పిఎసి) చైర్మన్ పదవి మళ్లీ కర్నూలు జిల్లాకే దక్కింది. ఇంతకు ముందు పిఎసి చైర్మన్‌గా ఉన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వైకాపా నుంచి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరే ముందు పిఎసి చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పదవికి డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని ఎంపిక చేసిన ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్ ఆ మేరకు సోమవారం ప్రభుత్వానికి సిఫారసు చేశారు. డోన్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైకాపా తరపున శాసనసభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పలుమార్లు ప్రసంగించారు. ఎక్కడా సభా మర్యాదలకు భంగం కలుగకుండా, నిర్దిష్టమైన సమాచారంతో ప్రభుత్వాన్ని నిలదీసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తనదైన శైలిలో ఛలోక్తులు విసురుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బుగ్గన సభలో వ్యవహరించిన తీరు కూడా పార్టీ అధినేత ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణంగా భావిస్తున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని ఆయన పిఎసి చైర్మన్‌గా పదవీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని తోటి శాసనసభ్యులు అంటున్నారు. ఆంగ్ల, తెలుగు భాషల్లో పట్టు ఉన్న బుగ్గన విద్యావంతుడని, ప్రభుత్వ పనుల్లో జరిగిన అక్రమాలను వెలికి తీసి ప్రభుత్వానికి సవాల్ విసరగల సామర్థ్యం ఆయనకు ఉందని వైకాపా జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
బాబు తీరు కుట్రపూరితం: శైలజానాథ్
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మార్చి 21: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహారం అంతా కుట్రపూరితంగా ఉందని, సిఆర్‌డిఎను బాబు రియల్ ఎస్టేట్ అథారిటీగా మార్చేసారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. సోమవారం సామాజిక న్యాయ సాధికారత యాత్రలో బాగంగా కేంద్ర మాజీ మంత్రులు జెడి శీలం, కిల్లి కృపారాణి, ఏఐసిసి అనుబంధ విభాగాలైన బిసి, ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులతో కలిసి ఆయన ఇందిరా విజ్ఞాన్ భవన్‌ను సందర్శించారు. దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు సమాజ నిర్మాణంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో శాంతి, సామరస్యంతో పాటు సమాజాన్ని అసహనంగా ప్రేరేపిస్తున్నాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆనాటి యుపిఎ ప్రభుత్వం ఐదేళ్లు అమలు చేయాలని భావిస్తే...కాదంటూ పదేళ్లు ఉండాలన్న ప్రతిపాదనలతోనే కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలు వాదించి, నేడు బిల్లులో పొందుపర్చలేదని మాట మార్చడం దురదృష్టకరమన్నారు. ఇది ఒక సాకుగా కొట్టిపారేస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి 33 వేల కోట్ల రూపాయలతో బుందేళ్‌ఖడ్ తరహాలో ప్యాకేజీ వర్తింపజేయాలని బిల్లులో ఆనాడు పొందుపరిస్తే, మరెందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేవలం వంద కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్న కేంద్రప్రభుత్వం నేడు ప్రత్యేక హోదాపట్ల బిల్లులో పెట్టలేదని మాట్లాడటం సబబుకాదన్నారు.

శాస్త్రోక్తంగా
కామ దహనం
శ్రీశైలం, మార్చి 21: శ్రీశైల మహాక్షేత్రంలో ఫాల్గుణ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకొని సోమవారం కామ దహన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తపోభంగానికి కోపించిన పరమ శివుడు మన్మధున్ని ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజునే దహింపచేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణం చేతనే చతుర్దశి రోజున మన్మధ రూపానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి దహింపచేస్తారు. సోమవారం సాయంత్రం దేవస్థానం అధికారులు, పండితులు, అర్చకులు కామ దహన కార్యక్రమాన్ని గుడి ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. తరువాత ఉత్సవ మూర్తులకు పల్లకి సేవ నిర్వహించి, గంగాధర మండపం వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడ్డితో చేసిన మన్మధరూపాన్ని దగ్ధం చేశారు.