రాష్ట్రీయం

అభివృద్ధి ఆగింది... అవినీతి పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగి అవినీతి పెరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ధ్వజమెత్తారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆదివారం మల్కాజీగిరి, ఎల్‌బీ నగర్, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాం మాధవ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవినీతితో పోలిస్తే, తెలంగాణ నెంబర్-2గా నిలిచిందని ఆరోపించారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని,
కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు. నాడు ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే, ఇప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్‌తోనే చెలిమి చేసిందని ఆయన దుయ్యబట్టారు. ఈ సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళాలని, బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని చెప్పాలని ఆయన సూచించారు. బీజేపీకి ఉన్న ఐదు అసెంబ్లీ సీట్లను 10కి పెంచుకోవాలన్న ఆలోచన చేయరాదని, అధికారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
‘నాయిని చక్కగా చెప్పారు’
రాష్ట్ర అపద్ధర్మ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇటీవల ఒక సభలో ప్రసంగిస్తూ తనకే 10 రోజులుగా కేసీఆర్ అప్పాయింట్‌మెంట్ లభించడం లేదని చక్కగా చెప్పారని రాం మాధవ్ అన్నారు. మంత్రుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చన్నారు. సచివాలయానికి వెళితే వెన్నుపోటుకు గురవుతారన్న జ్యోతిష్యుల మాటలను కేసీఆర్ నమ్మి సచివాలయానికి వెళ్ళడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీని మతతత్వ పార్టీ అని ముద్ర వేయాడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన కోరారు. దేశంలో అత్యధికంగా ముస్లింలు ఉండే జమ్మూ-కాశ్మీర్‌లోనూ బీజేపీ ప్రభుత్వం ఉన్న విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్-మజ్లీస్‌తో దోస్తీ చేయడాన్ని ప్రజల్లో ఎండగట్టాలని ఆయన కోరారు.
ఎల్‌బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి పేరాల శేఖర్ నాగోలులో ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని రాంమాధవ్ ప్రారంభించారు. మల్కాజీగిరి అభ్యర్థి, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు లక్ష్మీసాయి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ కె. లక్ష్మణ్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాంమాధవ్ తన ప్రసంగంలో టీఆర్‌ఎస్, మజ్లీస్‌లను తూర్పారబట్టారు. పార్టీ జాతీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు ప్రసంగించారు.
చిత్రం..ముషీరాబాద్ బీజేపీ కార్యకర్తల సమావేశం సందర్భంగా పార్టీ జాతీయ నేత రాంమాధవ్‌ను సత్కరిస్తున్న
తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్. చిత్రంలో సీనియర్ నాయకుడు దత్తాత్రేయ తదితరులు