రాష్ట్రీయం

ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 21: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాయలసీమ ప్రాంతానికి నిధులివ్వని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు.
సీమపై కపట ప్రేమ నటిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్రం హామీలు, ఆర్థిక ప్యాకేజీ అమలుకు పోరాటం చేయాలని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల అభివృద్ధికి రూ. 350 కోట్లు ఇచ్చి వెనక్కు తీసుకుని కేంద్రం ద్రోహం చేస్తే ఎందుకు నోరుమెదపరని ప్రశ్నించారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం దగా చేస్తుంటే బీజేపీ ప్రతినిధిగా ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ, కర్నూలులో రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన నేతలు ఇప్పుడెందుకు ప్రస్తావించటం లేదని ఆయన విమర్శించారు. చిత్తూరు జిల్లాలో మన్నవరం ప్రాజెక్టుకు నిధులు, విస్తరణ విషయంలో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రప్పించటంలో ఎందుకు విఫలమయ్యారో ప్రజలకు వివరించాలన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల నిధులు వెనక్కు తీసుకున్నారని, పక్క రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి మన రాష్ట్రానికి అన్యాయం చేస్తే వౌనం వహిస్తున్న నేతలు ప్రాంతీయ వాదాలను రెచ్చగొట్టటం రాజకీయ లబ్ధి కోసమేనని అన్నారు. గత నాలుగేళ్లుగా కేంద్రం నుంచి సాయం రాకపోయినా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర అభివృద్ధిలో పురోగతి సాధించామన్నారు. కియా వంటి ప్రపంచ ప్రసిద్ధ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రాంతీయతత్వాలను రెచ్చగొట్టటం ద్వారా పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తోందని, దీన్ని ప్రజలు ప్రతిఘటించాలని కోరారు. రాష్ట్ర ప్రజల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రానికి కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు వంత పాడటం సిగ్గుచేటని మంత్రి కాలవ శ్రీనివాసులు నిరసన తెలిపారు.