రాష్ట్రీయం

రేపటి వెలుగు కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: నేటి ఈ చీకట్లు చీల్చి.. రేపటి వెలుగులు అందించేందుకు ఓ మహోద్యమంగా చేపట్టిన తుపాను పునర్నిర్మాణ కార్యక్రమంలో అంతా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు పిలుపునిచ్చారు. తుపాను బాధితులను స్వచ్ఛందంగా ఆదుకోవాల్సిందిగా సోమవారం రాష్ట్ర ప్రజలకు బహిరంగలేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం ఇలా ఉంది..
అందరికీ నమస్కారం..!
తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది.. తుపాను తీవ్రత తెలిసిన వెంటనే యావత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రాణ నష్టం తగ్గించ గలిగాం.. అయితే 165 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలుల బీభత్సం వల్ల ఆస్థినష్టాన్ని నివారించలేక పోయాం.. తిత్లీ సృష్టించిన ఆస్థినష్టం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, ప్రజలు తీరని బాధల్లో ఉన్నారు.. రైతులు కన్నబిడ్డల్లా చూసుకున్న పచ్చనితోటలు నిలువునా కుప్పకూలాయి.. కళ్ల ముందే ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి..
ఉద్యానవనం లాంటి ఉద్దానం తిత్లీ తెచ్చిన నష్టంతో దశాబ్దాలు వెనక్కువెళ్లింది.. నిన్నటి వరకు కిడ్నీ బాధలే అనుకుంటే పులిమీద పుట్రలా తిత్లీ విలయతాండవంచేసి ఉద్దానాన్ని అధ్వాన్నంగా మార్చేసింది.. ఒక్క ఉద్దానమే కాదు..శ్రీకాకుళం జిల్లాలోని అన్ని గ్రామాల్లో తుపాను పెను విషాదాన్ని మిగిల్చింది. కొబ్బరి, జీడి తోటలతో పాటు వరి తదితర పంటలు కళ్లెదుటే కుప్పకూలటం చూసిన రైతుల బాధ వర్ణనాతీతం.. వలలు, పడవలు కొట్టుకుపోయి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు.. సుమారు 40వేల కరెంటు స్తంభాలు నేలకూలాయి.. 114 సబ్‌స్టేషన్లు దెబ్బతిన్నాయి.. 700 కిలోమీటర్ల మేర రహదార్లు ఛిద్రమయ్యాయి.. 365 తాగునీటి పథకాలకు నష్టం వాటిల్లింది.. లక్షా 59వేల 524 ఎకరాల్లో వరి, 4543 ఎకరాల్లో కొబ్బరి, 17వేల 589ఎకరాల్లో జీడిమామిడి తోటలు, 968 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైంది.. 34వేల 848 ఇళ్లు పూర్తిగా, 12వేల 397 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.. రూ 3428 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోతే జీవితమేలేదు..
తిత్లీ తుపాను మిగిల్చిన గాయాలకు మనమే మందు వేయాలి.. ఒక రైతు బిడ్డగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి కష్టాన్ని చూసి చలించిపోయాను.. వెంటనే రంగంలో దిగా.. ఈ సంక్షోభాన్ని గట్టెక్కేందుకు వ్యూహరచన చేశామన్నారు. పూర్తిస్థాయిలో కోలుకునే వరకు అధికారులు కదలొద్దని ఆదేశించాను.. బాధితుల్లో ధైర్యం నింపేందుకు సచివాలయాన్ని అక్కడికే తరలించాను. నా మంత్రివర్గ సహచరులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆపన్నులను ఆదుకునేందుకు అహోరాత్రులూ కృషిచేశారు.. 35 మంది ఐఏఎస్, వందమంది డిప్యూటీ కలెక్టర్లు, 10వేల మంది విద్యుత్ సిబ్బంది మోర 13వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ఇతర శాఖల ఉద్యోగులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు శాయశక్తులా పనిచేస్తున్నారు.. నీరు, ఆహారం, నిత్యావసర వస్తువులు పుష్కలంగా అందిస్తున్నాము. తుపాన్లు, కరవు ఇతర ప్రకృతి విలయాలు రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.. విభజన సమయంలో దీనిగురించే ప్రస్తావించాను. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశా.. అప్పుడు నా మాటలు నిర్లక్ష్యం చేశారు.. మానవ ప్రయత్నం ఉంటే దైవం కూడా తోడవుతుంది. ఎదిరించి నిలబడే గుండెధైర్యం ఉంటే తుపాను కూడా తలొంచుతుంది. మనో నిబ్బరంతో నాడు హుదుద్ తుపానును జయించాం.. ఒక ఆపదను అవకాశంగా తీసుకుని అభివృద్ధి చేసుకున్నాం.. హుదుద్ తరువాత విశాఖ నగరం ఎలా మారిందో అందరికీ తెలుసు.. ఇప్పుడు ఆ నగరం ప్రపంచ గుర్తింపు పొందింది.. అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచింది. తిత్లీ నుంచి కూడా అలాంటి స్ఫూర్తినే తీసుకుని శ్రీకాకుళం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అందరితో సమాలోచనచేసి ‘తూర్పు’ అనే పేరుతో పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టాం. తిత్లీ ఉద్దానం రీ కనస్ట్రక్షన్ ప్రోగ్రామ్ యూనిట్ అర్థమొచ్చేలా కార్యాచరణ నిర్దేశించాం. ఆంధ్రప్రదేశ్ తూర్పుతీర ప్రాంతంలో గొప్ప మార్పును తీసుకురావాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. తిత్లీ తుపాను జాడలే కనిపించని తరహాలో అభివృద్ధి చేస్తాం. కష్టాలపాలైన ఉద్దానాన్ని కాపాడుకోవటం ప్రస్తుతం మనందరి కర్తవ్యం.. బాధల్లో ఉన్న బారువాను ఓదార్చడం అందరి ఉమ్మడి బాధ్యత.. ఈ రెండు ప్రాంతాలనే కాదు తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాలన్నింటినీ పునర్నిర్మించాలి.. దీన్ని ఒక సామూహిక ఉద్యమంగా చేపట్టాలి. తిత్లీ తుపాను నష్టంపై కేంద్రానికి వేదిక పంపి రూ 12వందల కోట్లు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరాం.. ఇప్పటికి రెండు లేఖలు రాశాం.. నష్టాలను వివరిస్తూ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాం.. అయినా ఇంత వరకు కేంద్రప్రభుత్వం నుంచి స్పందనలేదు.. కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా ఖర్చుకు వెనుకాడకుండా శరవేగంతో సహాయ చర్యలు చేపట్టాం. బాధిత కుటుంబాలు నిలదొక్కుకునేందుకు నష్ట పరిహారాన్ని ప్రకటించాం. ప్రభుత్వం అందించే సాయంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆర్థిక స్తోమతుగల వ్యాపార సంస్థలు, ప్రవాసాంధ్రులు అన్నివర్గాల ప్రజలు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఒక సమస్య వచ్చినప్పటికీ దీని ద్వారా మరికొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కలిగింది..
ఉద్దానంలో కిడ్నీ వ్యాధి నివారణ పరిశోధన సంస్థను నెలకొల్పడానికి దాతలు ముందుకొచ్చారు.. హార్టీకల్చర్ పరిశోధనా సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.. వీటితో పాటు మరికొన్ని సమస్యల పరిష్కారానికి మీ అందరి చేయూత కావాలి. ఏపీ సీఎం సహాయనిధికి ప్రారంభించిన ‘ఏపీసీఎంఆర్‌ఎఫ్.ఏపీ.జీవోవి.ఇన్’ వెబ్‌సైట్‌కు స్తోమతు కొద్దీ విరాళాలు అందించాలి. ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లాలో ఆస్తులు కోల్పోయినా ఆత్మవిశ్వాసం సడలని ప్రజలు సిక్కోలు జనం.. ఆపదలో ఆదుకునే హృదయమే గొప్పది.. చేతనైన సహాయం చేద్దాం.. శ్రీకాకుళ ప్రజానీకానికి వీలైనంత ఆసరా ఇచ్చి మానవతను చాటుకుందాం.. తుపాను బాధితులకు ఓదార్పునిచ్చి.. వారి బతుకులకు భరోసో కల్పిద్దామని సీఎం చంద్రబాబునాయుడు ఆ లేఖలో ఉద్బోధించారు.