రాష్ట్రీయం

ప్రజాస్వామ్యం ఖూనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకోసం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓ.పీ. రావత్ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారుల బృందం సోమవారం హైదరాబాద్ వచ్చింది. మూడురోజుల పర్యటనకోసం వచ్చిన ఈ బృందం తొలిరోజు వివిధ రాజకీయ పక్షాలతో వేర్వేరుగా చర్చించింది. తాజ్‌కృష్ణా హోటల్‌లో సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 7.30 వరకు కొనసాగింది. పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య సమావేశం జరిగింది. తాజ్ కృష్ణాను పోలీసులు ఒక రకంగా దిగ్బంధం చేశారు. హోటల్‌లోకి వెళ్లేందుకు ఐడీ కార్డులు లేని వారెవరినీ అనుమతించలేదు. హోటల్‌లో గదులు తీసుకున్నవారు, భోజనానికి వెళ్లే వారిని కూడా పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతించారు. ఒక్కొక్క రాజకీయ పార్టీ నేతలతో దాదాపు 15 నిమిషాల పాటు ఈసీఐ బృందం సభ్యులు మాట్లాడారు. దాదాపు అన్ని పార్టీలు కూడా లిఖితపూర్వకంగానే తమ అభిప్రాయాలను తెలియచేశాయి. ఈసీఐతో భేటీ తర్వాత అన్ని రాజకీయ పార్టీల నేతలు వేర్వేరుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ అధికార పక్షం కనుసన్నల్లోనే జరిగిందని, టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా లేని ఓటర్ల పేర్లను విచక్షణారహితంగా తొలిగించారని ఆరోపించారు. పేర్లను తొలిగించే అంశంలో ఎలాంటి నియమావళిని అనుసరించలేదని ఆరోపించారు. వివిధ రాజకీయ పార్టీలు చేసిన సూచనలను ఓపికగా విన్న ఈసీఐ బృందం సరైన చర్యలు
తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈసీఐ బృందంతో చర్చించిన తర్వాత మీడియా ప్రతినిధులతో వివిధ పక్షాలు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి.
* కోర్టును తప్పుదోవ పట్టించారు: మర్రిశశిధర్‌రెడ్డి, కాంగ్రెస్
హైకోర్టును కేంద్ర ఎన్నికల కమిషన్ తప్పుదోవపట్టించింది. 68 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలిగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే కిందిస్థాయి సిబ్బంది ఓటర్ల పేర్లను తొలిగించారు. ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టే. 2015-16 నుండి ఈ విషయంలో పోరాటం చేస్తున్నాను. 15 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలిగించాలంటూ భన్వర్‌లాల్ సీఈఓగా పనిచేసిన సమయంలో కేసీఆర్ హెచ్చరించారు. ఈ నెల 12 వరకు ఓటర్ల జాబితాను ఇస్తానన్న సీఈఓ ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు. ఈ నెల 31 న హైకోర్టులో విచారణ ఉంది. కోర్టుకు అన్ని ఆధారాలను అందిస్తాం.
* టీఆర్‌ఎస్‌పై చర్య: ఎల్లన్న, బీఎస్‌పీ
గత ఎన్నికల్లో ప్రజలకు అందించిన మానిఫెస్టోను అమలు చేయనందుకు టీఆర్‌ఎస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. డబ్బు, మద్యం ఈ ఎన్నికల్లో విచ్చల విడిగా అధికార పార్టీ ఖర్చు చేస్తోంది. ఈ అక్రమాలను అరికట్టాలి.
* బోగస్ ఓట్లు: ఇంద్రసేనారెడ్డి, బీజేపీ
హైదరాబాద్‌లో బోగస్ ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఒకవైపు అర్హులైన ఓటర్ల పేర్లను తొలిగించి, మరోవైపు దొంగఓట్లను అధికార పక్షం ప్రోత్సహిస్తోంది. ఒక్కో ఇంట్లో 200 నుండి 300 ఓట్ల వరకు ఉన్నాయి. ఇదెలా సాధ్యం.
* నిస్పక్షపాతంగా ఎన్నికలు: చాడా వెంకట్‌రెడ్డి, సీపీఐ
ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగాలి. బోగస్ ఓట్లను తొలిగించడం లేదు. ప్రజాస్వామ్యం లేదు. కార్పోరేట్ తరహాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసీఐ నిఘా పెట్టాలి.
* గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లు: నర్సింహారెడ్డి, సీపీఎం
గిరిజన ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు గిరిజన గూడేల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ర్యాలీలకు అనుమతి ఇవ్వాలి. ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్క మోటార్‌సైకిల్ వివరాలు ఇవ్వలేము.
* మంత్రుల వార్తలు రాస్తే నోటీసులా: వినోద్, టీఆర్‌ఎస్
ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా ఆన్‌గోయింగ్ పథకాల అమలును ఈసీఐ నిలిపివేయకూడదు. కొనసాగుతున్న పథకాల పర్యవేక్షణకు ఆపద్దర్మ మంత్రులు వెళ్లవద్దంటే ఎలా? పెయిడ్ న్యూస్ పేరుతో సతాయించవద్దు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు మంచి వాతావరణం ఉంది.
* టీడీపీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు: చంద్రశేఖరరెడ్డి, టీడీపీ
టీడీపీ నాయకులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. టీడీపీ నేతలపై అధికార పార్టీ పత్రికలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. అర్హులందరికీ ఓటర్ల జాబితాలో చోటు కల్పిస్తూ, అనర్హులైన వారిపట్ట అప్రమత్తంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని నిలపాలి.
* ధనప్రవాహం: శివశంకర్, వైసీపీ
ఈ ఎన్నికల్లో ధనప్రవాహం పారుతోంది. నీళ్లయినా పారడం లేదు కానీ ధనం పారుతోంది.

చిత్రాలు..ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం సోమవారం హైదరాబాద్ చేరుకున్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓ.పీ. రావత్, ఉన్నతాధికారుల బృందం
*సీఈసీ భేటీకి హాజరవుతున్న విపక్ష నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ